భూ బకాసురులు

ABN , First Publish Date - 2022-05-21T05:38:26+05:30 IST

భూ బకాసురుల దాహానికి పేద, మధ్య తరగతి ప్రజలు భూములు కోల్పోయి ఆగమవుతున్నారు. పైసపైస కూడబెట్టి ఓ స్థలాన్ని కొనుగోలు చేసి అందులో ఇళ్లు నిర్మించుకుందామని ప్రణాళికలు చేసుకునే సమయంలోగానే ఆ స్థలాల్లో గద్దల్లా వాళుతూ కబ్జా చేస్తున్నారు.

భూ బకాసురులు
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి ఇదే

- ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా

- అధికారులను మాయ చేసేందుకు సర్వే నెంబర్‌ల మార్పు

- కొందరు తాజా, మాజీ కౌన్సిలర్‌లు, బిల్డర్‌లు, నాయకుల భూమాయ

- కబ్జా చేసిన స్థలంలో ఇళ్లు నిర్మించి అమ్మకాలు సైతం జరుపుతున్న పరిస్థితి

- ఏళ్ల తరబడి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేసేందుకు కుట్రలు

- కబ్జా చేసేందుకు, భూ యజమాని బ్యాక్‌గ్రౌండ్‌ ఎంక్వైరీకి ప్రత్యేక టీములు

- రిజిస్ట్రేషన్‌, ఇంటి నిర్మాణం చేసే వరకు అసలు భూ యజమానులకు తెలియని పరిస్థితి


కామారెడ్డి, మే 20(ఆంధ్రజ్యోతి): భూ బకాసురుల దాహానికి పేద, మధ్య తరగతి ప్రజలు భూములు కోల్పోయి ఆగమవుతున్నారు. పైసపైస కూడబెట్టి ఓ స్థలాన్ని కొనుగోలు చేసి అందులో ఇళ్లు నిర్మించుకుందామని ప్రణాళికలు చేసుకునే సమయంలోగానే ఆ స్థలాల్లో గద్దల్లా వాళుతూ కబ్జా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌, ఇంటి నిర్మాణం జరిగే వరకు కూడా అసలు భూ యజమానులకు తెలియని పరిస్థితి సృష్టిస్తున్నారంటే ఏ తరహాలో భూ బకాసురులు పెట్రేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని కొందరు తాజా, మాజీ కౌన్సిలర్‌లు, బిల్డర్‌లు, నాయకుల భూమాయతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సదరు వ్యక్తులు తమ అనుచరులను లేదంటే ప్రత్యక్షంగా వారే ఉంటూ కబ్జా చేసిన స్థలంలో ఏకంగా ఇల్లు నిర్మించి తక్కువ ధరకే ఆ ఇంటిని అమ్మకాలు జరిపి భూ యజమానికి, ఇళ్లు కొనుగోలు చేసిన వ్యక్తికి గొడవపెట్టి డబ్బులు మాత్రం కబ్జాకోరులు తీసుకుంటున్నారు. ఈ తరహ దందా కామారెడ్డిలో నిత్యం జరుగుతున్న ఏ అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసేందుకు వెళితే కబ్జా చేసిన వారితోనే మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

కామారెడ్డి మున్సిపల్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు కబ్జా చేస్తూ పెద్దఎత్తున భూ దందాకు తెరలేపుతున్నారు. కామారెడ్డి గాంధీగంజ్‌ పక్కన గల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు.  సర్వే నెంబర్‌ 6లోని 1 ఎకరం 3 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఓ ఇసుక వ్యాపారి స్థానిక నేతల అండతో ఆ భూమిని కబ్జా చేశాడు. కొందరు డాక్యుమెంట్‌ రైటర్ల సహాయంతో సర్వే నెంబర్‌లను తారుమారు చేసి ఆ ఎకరం భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇటీవల ఆ భూమిని అతని పేరు నుంచి వేరే వారి పేరుపైకి రిజిస్ట్రేషన్‌ చేసే క్రమంలో స్థానికులు, ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నారు. దీనిపై రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సర్వే నిర్వహించి ఆ 1 ఎకరం 3 గుంటలు ప్రభుత్వ స్థలమేనని నిర్ధారించి సదరు కబ్జాదారుడిపై ఉన్న రిజిస్ట్రేషన్‌లను రద్దు చేశారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఇలా కామారెడ్డి పట్టణంలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ, అసైన్‌మెంట్‌భూములు కబ్జాకు గురవుతున్నాయి.

ఖాళీ ప్రైవేట్‌ స్థలాలను సైతం వదలని కబ్జాదారులు

కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాట్లుగా మారి ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. అయితే భూముల ధరలు పెరిగిపోతున్నాయి. గజం భూమి రూ.10 వేలకు తక్కువ దొరకడం లేదు. కొందరు కబ్జాదారులు ప్రభుత్వ అసైన్‌మెంట్‌ భూములపైనే కాకుండా ప్రైవేట్‌ స్థలాలపై సైతం కన్నేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రైవేట్‌ స్థలాలు ఖాళీగా ఉంటే చాలు వాటిపై పాగ వేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఇందుకే కొందరు భూ కబ్జాదారులు నేతల సహకారంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆ ఖాళీ స్థలం ఎవరిది? ఆ వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటని తెలుసుకుంటున్నారు. ఎవరైన అమాయకంగా ఉంటే చాలు వారి ఖాళీ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. సర్వే నెంబర్‌లను తారుమారు చేసి అక్రమార్గంలో రిజిస్ట్రేషన్‌లు చేసి అమ్మివేయడమే కాకుండా ఇరువర్గాల మధ్య గొడవలు పెట్టి చివరకు వారే పంచాయితీని సృష్టించి సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు. ఇటీవల సైలాన్‌బాబా కాలనీలో ఓ వ్యక్తి స్థలంలో మరొకరు ఇల్లు నిర్మిస్తుండడంతో ఆ ప్లాట్‌ యజమాని అడ్డుకుని మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్‌ అధికారులు అక్కడికి చేరుకుని ప్రశ్నించడంతో వారిని బెదిరింపులకు గురిచేయడంతో పాటు కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉందంటూ సమాధానం ఇవ్వడంతో పాటు సదరు భూ యజమానిపై సైతం దాడులకు పాల్పడడంతో పోలీసులకు సైతం బాధితులు ఫిర్యాదు చేశారు.

భూ కబ్జాల్లో కొందరు స్థానిక నేతలు

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రియల్‌ వ్యాపారం చేస్తున్న కొందరు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, బిల్డర్‌లు, నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారు. ప్రైవేట్‌, ప్రభుత్వ స్థలం, రోడ్డు అని తేడా లేకుండా కబ్జాలు చేస్తూ ప్లాట్లుగా మార్చి అమాయక ప్రజలకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థలం ఒకరిపేరు మీద ఉంటే దొంగ డాక్యుమెంట్లను కొందరు డాక్యుమెంట్‌ రైటర్లతో సృష్టించి డబుల్‌ రిజిస్ట్రేషన్‌లు చేయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాత, కొత్త పట్టణాల్లో వార్డు మెంబర్‌లుగా గెలిచిన కొందరు నాయకులు తమ వార్డుల్లో ఖాళీ స్థలం ఎన్నిరోజుల నుంచి ఖాళీగా ఉంటుంది. దాని భూ యజమాని ఎవరు? ప్రభుత్వ భూమి అని తమకు పరిచయాలు ఉన్న అధికారులు, సిబ్బందితో ఎంక్వైరీలు చేయించి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే తమ అనుచరులు లేదంటే ఓ వర్గంకు చెందిన వారితో కబ్జాలు చేయిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. స్థలంపై ఏదైనా వివాదం వస్తే పెద్దనాయకులు కలుగజేసుకుని సెటిల్‌మెంట్‌ చేస్తు భూ యజమానికి ఇచ్చింది తీసుకోవాలని లేదంటే ఉన్న భూమి కూడా రాదని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సర్వే నెంబర్‌ 6 ప్రభుత్వ భూమే

- ప్రేమ్‌కుమార్‌, తహసీల్దార్‌, కామారెడ్డి

కామారెడ్డి వీక్లి మార్కెట్‌ ప్రాంతంలో గల సర్వే నెంబర్‌ 6లో గల 1 ఎకరం 3 గుంటలు ప్రభుత్వ భూమే. ఆ భూమిని కొందరు కబ్జాపెట్టారని ఫిర్యాదు రావడంతో సర్వే నిర్వహించాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆబాది భూమిగానే ఉంది. ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని సర్వే అనంతరం మున్సిపల్‌ అధికారులకు తెలియజేశాం. ప్రభుత్వ భూములు కబ్జాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-05-21T05:38:26+05:30 IST