సమస్యకు నూరేళ్లు

ABN , First Publish Date - 2021-04-17T05:22:25+05:30 IST

భూమిపై హక్కు కల్పిస్తూ జీవో జారీ చేసి రెండేళ్లు గడిచినా.. ఆ ప్రాంత రైతులకు నేటికి పట్టాలు అందలేదు.

సమస్యకు నూరేళ్లు
దర్భరేవు కంపెనీ భూములు

దర్భరేవు కంపెనీ భూములకందని పట్టాలు

హక్కు కల్పిస్తూ రెండేళ్ల క్రితం జీవో జారీ

రీ సర్వే పేరిట జాప్యం..   రైతుల ఎదురుచూపులు

భూమిపై హక్కు కల్పిస్తూ జీవో జారీ చేసి రెండేళ్లు గడిచినా.. ఆ ప్రాంత రైతులకు నేటికి పట్టాలు అందలేదు. సర్వే పేరిట ఇంకా కాలయాపన చేస్తుండడంతో అసలు భూమిపై మాకు హక్కు లభిస్తుందా..? అన్న సందేహమే దర్భరేవు కంపెనీ భూముల రైతుల్లో నెలకొంది. ఇదేంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాలి.                                          (నరసాపురం)

బ్రిటిష్‌ హయాంలో నరసాపురం తీర ప్రాంతమంతా ఇసుక భూములే. సాగు నీరు కూడా ఉండేది కాదు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు గ్రూపులుగా ఏర్పడి అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. గ్రామంలోని భూములను తమకు ఇస్తే వాటిని సాగు చేసుకుని ఉపాధి పొందుతామన్నారు. దీనికి ప్రభుత్వం 1920లో ఆమోదం తెలిపింది. రైతులంతా కలిసి నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీగా ఏర్పడ్డారు. దర్భరేవు, మర్రితిప్ప, వేములదీవి, రాజుల్లంక ప్రాంతాల్లో రెండు వేల ఎకరాలను ఈ కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం నుంచి దర్భరేవు వరకు చందాలు వేసుకుని కాల్వలను తవ్వుకుని భూములను సాగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ భూములన్నీ కంపెనీ పరిధిలోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చినా ఈ భూములకు విముక్తి లభించలేదు. ప్రభుత్వానికి కంపెనీ ద్వారా శిస్తు చెల్లిస్తున్నా.. భూమిపై హక్కు మాత్రం రాలేదు. సరిహద్దు భూమి ఎకరం రూ.30 లక్షలున్నా కంపెనీ భూమికి మాత్రం విలువ లేకుండా ఉండేది. రైతులంతా 30 ఏళ్లుగా ఉద్యమిస్తుండగా.. టీడీపీ ప్రభుత్వం 2019లో సాగులో ఉన్న రైతులకు హక్కు కల్పిస్తూ జీవో జారీచేసింది. అప్పటి లెక్కల ప్రకారం మొత్తం కంపెనీ పరిధిలో 1754.49 ఎకరాల భూమి ఉంది. దీనిని 1,489 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఎకరంలోపు 754 మంది, రెండున్నర ఎకరాల రైతులు 609 మంది, ఐదెకరాలు వున్నవారు 102 మంది, ఐదెకరాలు పైబడిన వారు 20 మంది ఉన్నారు. సర్వే చేసి హక్కుదారులందరికీ పట్టా ఇవ్వాలని 2019 జనవరి 21న కేబినెట్‌ నిర్ణయం తీసుకొని జీవో జారీచేసింది. అప్పట్లో కొంత మందికి పట్టాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అది పెండింగ్‌ పడింది. ప్రభుత్వం మారడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం రీసర్వేకు ఆదేశించింది.

‘ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్భరేవు కంపెనీ భూములకు రీ సర్వే జరిగింది. ఇటీవల సర్వే కూడా పూర్తిచేశాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైతులకు పట్టాలిస్తాం. ఏ విధమైన జాప్యం ఉండదు’ అని తహసీల్దార్‌ మల్లిఖార్జునరెడ్డి చెబుతున్నారు. ‘మా పూర్వీకుల నుంచి ఈ భూములనే నమ్ముకుని బతుకుతున్నాం. గత ప్రభుత్వం దున్నే వానికి హక్కు కల్పిస్తూ జీవో జారీ చేయడంతో సంతోషించాం. ఇంత వరకు పట్టాలు చేతికి అందలేదు. మళ్లీ రీ సర్వే చేస్తున్నారు. త్వరలో మాకు పట్టాలు అందుతాయని ఆశ తో ఎదురుచూస్తున్నా’మని దర్భరేవు రైతు అల్లూరి భాస్కర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-17T05:22:25+05:30 IST