బోస్‌.. ఇదేం డోసు!

ABN , First Publish Date - 2020-03-22T09:13:20+05:30 IST

భూముల రీ సర్వే ప్రాజెక్టులో సరికొత్త కోణం మొదలైంది. పైలట్‌ ప్రాజెక్టు పూర్తయి దాని ఫలితాలను విశ్లేషించాకే తదుపరి నిర్ణయం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు....

బోస్‌.. ఇదేం డోసు!

  • పైలట్‌కు ముందే బేస్‌ స్టేషన్ల కొనుగోలు
  • ప్రతిపాదనలు ఇవ్వాలంటూ సర్వేకు లేఖ
  • పైలెట్‌ ఫలితం వచ్చాకే ఏదైనా చేద్దామని సర్కారు ఉత్తర్వులు.. జగ్గయ్యపేట ఎంపిక
  • ముందే కొనేద్దామంటూ మంత్రి దూకుడు
  • అంతకుమించిన రీతిలో సర్వే ప్రతిపాదన
  • ముందే టెండర్లకు అనుమతి కోరిన వైనం


అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే ప్రాజెక్టులో సరికొత్త కోణం మొదలైంది. పైలట్‌ ప్రాజెక్టు పూర్తయి దాని ఫలితాలను విశ్లేషించాకే తదుపరి నిర్ణయం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అది ఎప్పుడు పూర్తవుతుందో ఏమో..అంతకాలం ఎదురుచూడాలా? అనుకున్నారో ఏమోగానీ, పైలట్‌ ప్రారంభానికి సరిగ్గా ఒక రోజు ముందే, రాష్ట్రం అంతా కార్స్‌ బేస్‌ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వాటి కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలంటూ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ నేరుగా సర్వేశాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో రెవెన్యూ శాఖ అంతకు ముందు రీ సర్వేకు అనుమతి ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు, టెండర్లకోసం రూపొందించిన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎ్‌ఫపీ) తలకిందులయ్యాయి. ఇదే అనుకుంటే...దీన్ని మించేలా సర్వేశాఖ ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే  రీ సర్వే చేయాలన్న ప్రభుత్వ సంకల్పం చాలా తీవ్రమైన కారణాలతో బైపాస్‌ అవుతున్నదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 


ఏం జరిగిందంటే..

భూములకు ఆధార్‌ తరహాలో 12 అంకెల విశిష్ట సంఖ్యను ఇస్తూ, దానికి భూధార్‌గా నామకరణం చేస్తూ 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి జీపీఎ్‌సను అనుసంధానించాలని, ఇందుకు ప్రతి భూమి అక్షాంశ, రేఖాంశాలను కలిపేందుకు కార్స్‌ టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో దీన్ని పైలెట్‌గా చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు భూధార్‌ ఏర్పాటుకు 2018, సెప్టెంబరు 25న సర్కారు జీవో 1348ని జారీ చేసింది. ఆ తర్వాత పరిణామాల అనంతరం ప్రభుత్వం మారింది. భూధార్‌కు రీ సర్వే తోడైంది. కార్స్‌ ఆధారంగానే రీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందుకు జగ్గయ్యపేటలోనే రూ.3.20కోట్ల వ్యయంతో పైలట్‌గా చేపట్టాలనీ నిర్ణయించారు. టెండర్ల నిర్వహణకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ను (ఆర్‌ఎ్‌ఫపీ) రూపొందించారు. తొలిదశలో పైలట్‌గా చేపట్టి, దాని ఫలితాల ఆధారంగా కృష్ణా జిల్లా అంతటా అమలుచేయాలని, ఆపై రాష్ట్రానికి అంతా వర్తింపచేయాలని ఆర్‌ఎ్‌ఫపీలో పేర్కొన్నారు. ఈ మేరకు టెండర్లు నిర్వహించి ఏజెన్సీని ఎంపిక చేశారు. అయితే, ఈ ఒప్పందంలోనే అసలు కిటుకు ఉంది. రీ సర్వేను దీనిలో ప్రస్తావించలేదు. ఇంక్రిమెంటల్‌, అవసరాన్ని బట్టి చేపట్టే నీడ్‌ బేస్డ్‌ సర్వేలు మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని ఇంతవరకు  సవరించలేదు. అందులో రీ సర్వే అంశాన్ని చేర్చాల్సి ఉం ది. ఇక టెండర్లు తొలిదశలో భాగంగా పైలట్‌ కోసమే పిలిచారు. రెండో దశకు ఇంకా టెండర్లు పిలవనేలేదు. ఇది సుస్పష్టం! 


ఉపముఖ్యమంత్రి బోస్‌ రాసిన లేఖను ఉదహరిస్తూ ఈనెల 12న సర్వే శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. మంత్రి ఆదేశాల మేరకు రూ. 98.87 కోట్ల వ్యయంతో బేస్‌ స్టేషన్లు, సాఫ్ట్‌వేర్‌, మూడు వేల రోవర్స్‌ కొనుగోలు చేయడానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలో పూర్తి వైరుధ్యంతో కూడిన అంశాలున్నాయి. జీవో 1348ని కోట్‌చేస్తూ, ఏపీటీఎస్‌ ఇప్పటికే 65 బేస్‌స్టేషన్‌లకు టెండర్లు పిలిచి ఒప్పందాలు చేసుకుందని పేర్కొన్నారు. ఈ జీవో భూదార్‌ పైలట్‌కు స్పందించింది. ఇక కార్స్‌ టెండర్లు పైలట్‌ కోసమే పిలిచారు. అంటే అది తొలిదశ అన్నమాట. రాష్ట్రం అంతటికీ అన్నది లేదు. అది ఆర్‌ఎ్‌ఫపీలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.


అలాంటప్పుడు, పైలట్‌కోసం ఉద్దేశించిన టెండర్లలో రాష్ట్రం అంతటికీ టెండర్లు పిలిచి ఒప్పందం చేసుకున్నట్లు ఎలా ప్రస్తావిస్తారు? ఇక, పైలట్‌కు అనుమతిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వును కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇందులోనే సూపర్‌ ట్విస్ట్‌ ఉంది. అదేమంటే, తొలిదశ, రెండోదశల కింద 65 బేస్‌ స్టేషన్‌లు, కంట్రోల్‌ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు పరిపాలనా అనుమతి ఇవ్వాలంటూ రెవెన్యూశాఖను అభ్యర్థించారు. అంటే, ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏపీటీఎస్‌ ద్వారా టెండర్లు నిర్వహించి ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నట్లుగా స్పష్టమవుతోంది కదా! ఒక వేళ ముందుగానే సర్కారు అనుమతి ఇచ్చి ఉంటే, ఇప్పుడు కొత్తగా ఇదేమిటి? ఇప్పటికైనా ఏం జరుగుతుందో అర్థమవుతుందా అంటూ..  ప్రభుత్వ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. 


ముందురోజే బోస్‌ లేఖ..

గత నెల 18న పైలట్‌ ప్రాజెక్టును బోస్‌ ప్రారంభించారు. సరిగ్గా దానికి ఒక రోజు ముందు, అంటే, ఫిబ్రవరి 17న సర్వే డైరెక్టర్‌కు మంత్రి లేఖ రాశారు. ‘‘ఫిబ్రవరి 11న సీఎం వద్ద జరిగిన  సమావేశంలో ఇచ్చిన సూచనల ఆధారంగా రాష్ట్రమంతటికీ కార్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఆ సమావేశంలో సీసీఎల్‌ఏ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి కూడా పాల్గొన్నారు. కాబట్టి దీని ప్రకారం వెంటనే ప్రతిపాదనలు పంపించండి’’ అని ఆదేశిస్తూ సర్వేశాఖ డైరెక్టర్‌కు లేఖరాశారు. నిజానికి ఆ సమావేశంలో సీఎం ఇచ్చిన సూచనల ఆధారంగా సర్వే శాఖనుంచి ప్రతిపాదనలు కోరాల్సింది రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి. లేదంటే సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు వెళ్లాలి.  నేరుగా మంత్రినే లేఖరాసి ప్రతిపాదనలు కోరడం ఆసక్తికరంగా మారింది. పైగా, పైలట్‌ ఫలితమే రాలేదు. రీసర్వే 20శాతం కూడా పూర్తవ్వలేదు. కానీ సీఎం సూచనల పేరిట రాష్ట్రం అంతా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం, లోగడ రెవెన్యూ శాఖ ఇచ్చిన ఆదేశాలను బుట్టదాఖలు చేసినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైలట్‌ ఫలితం ఎలా ఉన్నా రాష్ట్రం అంతా దాన్ని వర్తింపచేయాలని సీఎం ఆదేశించారా? నిజంగా సీఎం అదే కోరుకుంటున్నారా? అదే నిజమైతే పైలట్‌ ఎందుకు చేపట్టినట్లు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 


ముందు ఫలితం.. తర్వాతే నిర్ణయం

జగ్గయ్యపేట మండలంలో కేవలం రెండు గ్రామాల్లో  రీ సర్వేకు పైలట్‌ ప్రాజెక్టు చేపట్టడానికి గత ఏడాది డిసెంబరు 31న  రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి. ఉషారాణి అనుమతి ఇచ్చారు. ఒక గ్రామంలో కార్స్‌ టెక్నాలజీతో, మరో గ్రామంలో డ్రోన్‌ టెక్నాలజీతో రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అంతేకాదు, ‘కార్స్‌ టెక్నాలజీతో చేసే రీ సర్వే పైలెట్‌ ఫలితాలు ప్రభుత్వం ముందు ఉంచుతాం. దీని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. దీనికోసం రెండు టెక్నాలజీలతో వచ్చే ఫలితాలను సరిపోలుస్తూ సమగ్ర అధ్యయన నివేదిక, సమాచారాన్ని ఇవ్వాలి’ అని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఇచ్చాకే పైలట్‌పై కదలిక వచ్చింది. సరిగ్గా ఫిబ్రవరి 18న జగ్గయ్యపేట మండలంలో పైలెట్‌ ప్రాజెక్టు మొదలైంది. ఉగాది నాటికి పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సర్కారు కార్యక్రమానికి ప్రాధాన్యం పెరగడంతో ఇక్కడ పనిచేస్తోన్న సర్వేయర్లను ఈ పనుల కోసం తరలించారు. దీంతో పైలట్‌ పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఉగాది తర్వాతే మళ్లీ కదలిక రానుందని కృష్ణా జిల్లా అధికారవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-03-22T09:13:20+05:30 IST