ధరణికి అంతా సిద్ధం..రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-10-28T11:24:36+05:30 IST

ఈనెల 29వ తేదీ నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. తొలుత దసరా రోజు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ వెబ్‌సైట్‌లో తలెత్తిన

ధరణికి అంతా సిద్ధం..రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు

51 రోజుల తర్వాత మొదలుకానున్న రిజిస్ట్రేషన్లు

డాక్యుమెంట్‌ రైటర్లతో అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్‌

అదేరోజు మ్యూటేషన్‌, పట్టాదారు పాసు పుస్తకం జారీ


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఈనెల 29వ తేదీ నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. తొలుత దసరా రోజు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ వెబ్‌సైట్‌లో తలెత్తిన పలు సాంకేతిక కారణాల వల్ల ఈనెల 29కి వాయిదా వేసింది. అదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12:20 గంటలకు ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారు. అప్పటినుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. భూముల రిజిస్ట్రేషన్‌ రోజే మ్యూటేషన్‌ పూర్తిచేసి అదేరోజు పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీచేసే విధానానికి ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించింది. 


సులువుగా క్రయవిక్రయాలు..

వ్యవసాయ భూములను మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో, వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో చేపట్టనున్నారు. దీంతో భూముల క్రయ,విక్రయాలు సులువుగా జరగనున్నాయి. కూర్చున్న చోటే ధరణి వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్‌ సమయానికి అమ్మకందారుడు, కొనుగోలుదారుడు, సాక్షులు వెళితే రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయనున్నారు. గతంలో వలే డాక్యుమెంట్‌ రైటర్ల వద్దకు వెళ్లి రాయించుకునే పరిస్థితి ఉండదు. ధరణి సిటిజన్‌ పోర్టల్‌లో అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాత ఆ వివరాలను బాండ్‌ పేపర్‌పై ప్రింట్‌ తీసుకునే అవకాశం కల్పించారు. బాండ్‌ పేపర్‌ లేకున్నా సాదా పేపర్‌పై కూడా ప్రింట్‌ తీసుకోవచ్చు. భూమి అమ్మిన పట్దాదారు పాస్‌బుక్‌ నుంచి అమ్మిన భూమిని మైనస్‌ చేస్తారు. కొనుగోలు చేసిన వారికి ఇదివరకు పట్టాదారు పాస్‌బుక్‌ ఉంటే కొనుగోలు చేసిన భూమి విస్తీర్ణం, సర్వేనంబర్‌లో ప్రింట్‌ చేసి ఇస్తారు. ఒకవేళ ఎలాంటి భూములు లేని వారికి కొత్త పట్టాదారు పాసు పుస్తకంలో ప్రింట్‌ చేసి కొరియర్‌ ద్వారా ఒకటి, రెండు రోజుల్లో ప్రింట్‌ చేసి ఇవ్వనున్నారు. ఈ పాసు బుక్కులను ట్యాంపరింగ్‌ చేసే వీలు లేకుండా రూపొందించారు. 


అధికారులు, సిబ్బందికి శిక్షణ

గతంలో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మ్యూటేషన్‌ కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే దానిపై నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన 20 రోజుల తర్వాత ఆర్‌ఓఆర్‌ పూర్తిచేసి 13బీ ఫారాన్ని ఇచ్చే వాళ్లు. ఆ తర్వాత కొద్దిరోజులకు పట్టాదారు పాసుపుస్తకాన్ని ఇచ్చేవాళ్లు. ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు రెవెన్యూ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తుండడంతో ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తీసుకవచ్చి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకవచ్చింది. దీనిపై జిల్లాస్థాయిలో తహసీల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, నాయబ్‌ తహసీల్దార్లు తదితరులకు శిక్షణ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్‌ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. ఈ శిక్షణ తరగతులకు జిల్లాకు చెందిన తహసీల్దార్లు కూడా వెళ్లారు. ధరణి పోర్టల్‌ ద్వారా భూముల క్రయవిక్రయాలు సులువుగా చేసుకోవచ్చని, అదేరోజున మ్యూటేషన్‌ చేయడం, పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీచేయడం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు తప్పనున్నాయని తహసీల్దార్లు చెబుతున్నారు.


తమకు కూడా పనిభారం తప్పనున్నదని, మ్యూటేషన్‌ కోసం నోటీసులు జారీ చేయడం, వాటిపై విచారణలు జరపడం వంటి తతంగాలు ఏమి ఉండవని చెబుతున్నారు. ఎక్కడైనా తహసీల్దార్లు, సిబ్బంది తప్పిదాలకు పాల్పడితే వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నదని అంటున్నారు. పోర్టల్‌లో భూముల మార్కెట్‌ విలువలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు, ఇతరత్రా వివరాలన్నీ ఈ-చలాన్‌లో జనరేట్‌ అవుతాయని, వాటి ఆధారంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ధరణి వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆసక్తిగా మారింది. 51 రోజుల తర్వాత భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. 

Updated Date - 2020-10-28T11:24:36+05:30 IST