ల్యాండ్‌ పూలింగ్‌పై రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2022-05-26T08:25:36+05:30 IST

జనగామ, మే 25 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ రైతులు రోడ్డెక్కారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌ను నిరసిస్తూ

ల్యాండ్‌ పూలింగ్‌పై రోడ్డెక్కిన రైతులు

వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ధర్నా.. 3 గంటలు నిరసన

భారీగా నిలిచిన వాహనాలు.. ‘భూ సమీకరణ’ జీవో రద్దుకు డిమాండ్‌

ధర్నాకు వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు

జనగామ, మే 25 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ రైతులు రోడ్డెక్కారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌ను నిరసిస్తూ ధర్నా చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి, నష్కల్‌, జఫర్‌ఘడ్‌ మండలం రఘునాథపల్లి, కూనురు గ్రామాలు ‘కుడా’ పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 500 మంది రైతులకు చెందిన 2,500 ఎకరాల భూమి ల్యాండ్‌ పూలింగ్‌ కింద పోతోంది. దాంతో, భూముల స్వాధీనానికి జారీ చేసిన జీవో 80ని రద్దు చేయాలంటూ ఇటీవలి వరకూ చిన్నపాటి నిరసన కార్యక్రమాలకే పరిమితమైన రైతులు.. బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నాలుగు గ్రామాల రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై మూడు గంటలపాటు బైఠాయించారు. దీంతో రోడ్డుకిరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ధర్నాలో నష్కల్‌ సర్పంచి కర్ణకంటి స్వప్న, ఎంపీటీసీ పాశం శిరీష, బాధిత రైతు సంఘం నాయకులు శాతరబోయిన రాజు, కోరుకొప్పుల అశోక్‌ నేతృత్వంలో నాలుగు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది రైతులు పాల్గొన్నారు. జీవో రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేసే వరకు రోడ్డుపై నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న ట్రెయినీ ఐపీఎస్‌ పరితోశ్‌ పంకజ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, కాజీపేట ఏసీపీలు దురిశెట్టి రఘుచందర్‌, శ్రీనివాస్‌ ధర్నా వద్దకు చేరుకుని రైతులు, అఖిలపక్ష నేతలను సముదాయించారు. అయినా, వారు శాంతించలేదు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు ధర్నా వద్దకు చేరుకొని చర్చించారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయినా, కొంతమంది నాయకులు భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం పారిశ్రామికీకరణ, అభివృద్ధిని సాకుగా చూపి ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వేలాది ఎకరాలను దండుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, హైవేపై ధర్నా చేయడానికి వెళుతున్న ఐనవోలు, ధర్మసాగర్‌, జఫర్‌గఢ్‌ మండలాల రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయినా, రైతులు ఇతర మార్గాల ద్వారా తరలివెళ్లారు. ఐనవోలు, నాగపురం నుంచి మహిళా రైతులు ట్రాక్టర్‌పై వెళ్లడానికి సిద్ధమయ్యారు. వారినిపోలీసులు అడ్డుకోగా ఆర్టీసీ బస్సు ఎక్కారు. దానిని కూడా పోలీసులు ఐనవోలు స్టేషన్‌కు తరలించడంతో మహిళా రైతులు ఐదు కిలోమీటర్లు నష్కల్‌కు కాలినడకన బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2022-05-26T08:25:36+05:30 IST