‘ల్యాండ్‌ పూలింగ్‌’పై రైతుల కన్నెర్ర

ABN , First Publish Date - 2022-05-26T05:54:58+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రైతుల భూములను సేకరించడానికి (ల్యాండ్‌ పూలింగ్‌) జారీ చేసిన జీవో నెంబరు 80ఎ పై నిరసనలు పె ల్లుబుకుతూనే ఉన్నాయి. భూ సేకరణ ప్రక్రియ కోసం గత నెలలో ‘కుడా’ నోటిఫికేషన్‌ జారీ చేయగా, రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం విదితమే.

‘ల్యాండ్‌ పూలింగ్‌’పై రైతుల కన్నెర్ర
చిలుపూర్‌ మండలంలోని నష్కల్‌ వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు, బైఠాయించిన అఖిల పక్ష నేతలు, రైతులు, ఫ్లెక్సీతో నిరసన తెలుపుతున్న రైతులు

జీవో 80ను పూర్తిగా రద్దు చేయాలంటూ ఆందోళన
నష్కల్‌ వద్ద వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై బైఠాయింపు
మూడు గంటల పాటు నిరసన.. భారీగా నిలిచిన వాహనాలు
బలవంతంగా తొలగించి అరెస్టు చేసిన పోలీసులు
ధర్నాకు వెళ్లకుండా రైతులను అడ్డుకున్న పోలీసులు
హాజరైన కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం నేతలు
ఆందోళనలో స్పృహ తప్పి పడిపోయిన రావు పద్మ


ఐనవోలు/ధర్మసాగర్‌/హనుమకొండ రూరల్‌/జనగామ, మే 25 (ఆంధ్రజ్యోతి):
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రైతుల భూములను సేకరించడానికి (ల్యాండ్‌ పూలింగ్‌) జారీ చేసిన జీవో నెంబరు 80ఎ పై నిరసనలు పె ల్లుబుకుతూనే ఉన్నాయి. భూ సేకరణ ప్రక్రియ కోసం గత నెలలో ‘కుడా’ నోటిఫికేషన్‌ జారీ చేయగా, రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం విదితమే. ఈ క్రమంలో 15 రోజుల కిందట ‘కుడా’ ల్యాండ్‌ పూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే జీవోను పూర్తిగా రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్‌ వద్ద వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారి వద్ద బుధవారం రైతులు పెద్ద ఎత్తున చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  ల్యాండ్‌ పూలింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ.. రైతులు సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ల్యాం డ్‌ పూలింగ్‌ కోసం తెచ్చిన జీవో నంబర్‌ 80ను పూర్తిగా రద్దు చేసే వరకు నిరసనలు విరమించేది లేదన్నారు.

చిల్పూరు మండలం వంగాలపల్లి, నష్కల్‌, జఫర్‌ఘడ్‌ మండలం రఘునాథపల్లి, కూనురు గ్రామాలు ‘కుడా’ పరిధిలో ఉన్నాయి. ఈ నాలుగు గ్రామాల పరిధిలో సుమారు 500 మంది రైతులకు చెందిన 2,500 ఎకరాలు భూమి ల్యాండ్‌ పూలింగ్‌ కింద పోతుండడంతో  రైతులు బుధవారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై 3 గంటల పాటు బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ధర్నా చేయాలని ఆయా గ్రామాల రైతులు రెండు, మూ డు రోజుల కిందట భావించారు. ముందుగా అనుకున్నట్లుగానే నష్కల్‌ సర్పంచి కర్ణకంటి స్వప్న వెంకటేశ్‌, ఎంపీటీసీ పాశం శిరీష సురేశ్‌, బాధిత రైతుల సంఘం నాయకులు శాతరబోయిన రాజు, కోరుకొప్పుల అశోక్‌ నేతృత్వం లో నాలుగు గ్రామాలకు చెందిన సుమారు 300మంది రైతులు ధర్నాకు దిగారు. జీవో రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేసేవరకు రోడ్డుపై నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. వీరికి బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.  

సమాచారం అందుకున్న ట్రెయినీ ఐపీఎస్‌ పరితోశ్‌ పంకజ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, కాజీపేట ఏసీపీలు దురిశెట్టి రఘుచందర్‌, శ్రీనివాస్‌ ధర్నా వద్దకు చేరుకుని రైతులు, అఖిలపక్ష నేతలను సముదాయించినప్పటికీ వారు శాం తించలేదు. దీంతో జనగామ జిల్లా అదనపు కలెక్టర్‌ భా స్కర్‌ రావు ధర్నా వద్దకు చేరుకొని చర్చించారు. సమస్య ను ప్రభుత్వ దృష్ఠికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కొంతమంది నాయకులు భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

అడ్డుకున్న పోలీసులు
ల్యాండ్‌ పూలింగ్‌ జీవోను రద్దు చేయాలంటూ నష్కల్‌ వద్ద వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుపతలపెట్టిన రాస్తారోకోకు వెళుతున్న ఐనవోలు, ధర్మసాగర్‌, జఫర్‌గఢ్‌ మండలాల రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.   ఐనవోలు మండలంలోని ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, పున్నేలు, వెంకటాపురం, పంథిని తదితర గ్రామాల్లో రైతులు జేఏసీ పిలుపులో భాగంగా రాస్తారోకోకు భారీ ఎత్తున వెళ్లడానికి సిద్ధమయ్యారు. రైతులను వెళ్లనీయకుండా ఐనవోలు, జఫర్‌గఢ్‌ పోలీసులు తెల్లవారుజాము నుంచే రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లకు తరలించి రహదారులపై కాపుకాశారు. అయినప్పటికీ వందలాదిగా రైతులు ఇతర మార్గాల ద్వారా తరలివెళ్లారు.

ఐనవోలు, నాగపురం నుంచి మహిళా రైతులు ట్రాక్టర్‌పై రాస్తారోకోకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డగించడంతో అటుగా వెళ్లే ఆర్టీసీ బస్సును ఆశ్రయించారు. బస్సును సైతం ఐనవోలు స్టేషన్‌కు తరలించడంతో మహిళా రైతులు ఐదు కిలోమీటర్లు నష్కల్‌కు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఎట్టకేలకు ఐదు గ్రామాల నుంచి వందలాది మంది రైతులు రాస్తారోకోలో పాల్గొని తమ నిరసనను తెలిపారు.

ధర్మసాగర్‌ మండలం ధర్మారానికి చెందిన 18 మంది  రైతులు నిరసన కార్యక్రమానికి బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుచేసి ధర్మసాగర్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఆందోళనకు వెళుతున్న రైతులు గారిదాస్‌ సంపత్‌, కోయ్యాడ చంద్రమౌళి, బాబు, బి.కుమారస్వామి, జి.శ్రీనివాస్‌, జి.కృష్ణ, జి.యాదగిరి, బి.సునిల్‌, జి.రాజు, కె.సంపత్‌, బి.శేఖర్‌, జి.నాగరాజు, కె.శ్రీకాంత్‌, కె.రవి, రాజేందర్‌, కె.శ్రీనివాస్‌, బి.రమే్‌షలపై కేసు నమోదు చేశారు.

రావు పద్మకు అస్వస్థత
నష్కల్‌ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అస్వస్థతకు గురయ్యారు. పద్మ సొమ్మసల్లి పడిపోవడంతో వెంటనే హనుమకొండ బాలసముద్రంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫోన్‌లో రావుపద్మను పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

జీవోను తక్షణమే రద్దు చేయాలి
అఖిలపక్ష నేతల డిమాండ్‌

చిలుపూర్‌, మే 25 : ల్యాండ్‌ పూలింగ్‌ జీవో నెం.80ని తక్షణమే రద్దు చేయాలని అఖిల పక్ష నాయకులు (కాం గ్రెస్‌, బీజేపి, సీపీఎం) మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మా జీ ఎమ్మెల్యేలు గుండె విజయ రామారావు, మార్తినేని ధర్మారావు, రావు పద్మ, ఎ.రాకేశ్‌రెడ్డి, ఎన్నకూస కుమార్‌, బొజ్జపల్లి సుభాష్‌, వెంకటేశ్వర్లు  డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక సర్పంచ్‌ కర్ణకంటి స్వప్న వెంకటేశ్‌, ఎంపీటీసీ పాశం శిరీష సురేశ్‌ నేతృత్వంలో, బాధిత రైతుల సంఘం జేఏసీ నాయకులు శాతరబోయిన రాజు, కోరుకొప్పుల అశోక్‌తో కలిసి నష్కల్‌ బస్టాండ్‌ చౌరస్తా వద్ద హన్మకొండ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భైఠాయించి ధర్నాకు దిగారు.  
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చిలుపూర్‌ మండలంలోని వంగాలపల్లి, నష్కల్‌ గ్రామాలతో పాటు, ఐనవోలు, ధర్మసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో జీవనం సాగిస్తున్న సన్న, చిన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం పారిశ్రామికీకరణ, అభివృద్ధిని సాకుగా చూపి ల్యాండ్‌ పూ లింగ్‌ పేరుతో వేలాది ఎకరాలను దండుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒక్క నష్కల్‌ రెవెన్యూ పరిధిలో నే 1043 ఎకరాల విలువైన భూములను ల్యాండ్‌ పూలింగ్‌ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు.  ఈ కార్యక్రమంలో  నాయకులు గడ్డమీది సురేశ్‌, సాదం గట్టయ్య, పుల్యాల రాజిరెడ్డి, సంపత్‌తో పా టు, సీఐలు వినయ్‌కుమార్‌, బొల్లం రమేష్‌, రవి, ఎస్సైలు ఎం. రాజు, దివ్య, రఘుపతి, జోసఫ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-26T05:54:58+05:30 IST