టీడీపీ నేత సోదరుడి భూమి ఆక్రమణకు యత్నం

ABN , First Publish Date - 2022-01-20T05:37:29+05:30 IST

ఓ టీడీపీ నేత సోదరుడి కుటుంబానికి చెందిన భూమిని కొందరు వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి యత్నించిన ఘటన గంగాధరనెల్లూరు మండలంలో చోటుచేసుకుంది.

టీడీపీ నేత సోదరుడి భూమి ఆక్రమణకు యత్నం
బాలగంగనపల్లెకు వైసీపీనేతలు తెప్పించిన ఎక్స్‌కవేటర్‌

ఎక్స్‌కవేటర్లతో వెళ్లిన వైసీపీ నేతలు

అధికారికంగా తేలేంతవరకు భూమిలోకి ఎవరూ అడుగుపెట్టొద్దన్న ఎస్‌ఐ \


గంగాధరనెల్లూరు, జనవరి 19: ఓ టీడీపీ నేత సోదరుడి కుటుంబానికి చెందిన భూమిని కొందరు వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి యత్నించిన ఘటన గంగాధరనెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంలో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకెళితే ... బాలగంగనపల్లెకు చెందిన దొరస్వామిరాజు దీర్ఘకాలంగా సర్పంచ్‌ పనిచేసారు. అయన కుమారుడు దేవరాజు ఆత్మచైర్మన్‌గాను, సర్పంచ్‌గాను పనిచేసి కొంతకాలంగా టీడీపీలో కొనసాగుతున్నారు. కాగా దేవరాజు సోదరుడు హరినాథరాజు భార్య శిల్ప పేరుతో సర్వే నెంబరు 1180-1లో 2 ఎకరాల భూమిని 2010లో అప్పటి తహసీల్దార్‌ శాంతబాయి డీకేటీ పట్టా ఇచ్చారు. ఇదిలావుండగా బాలగంగనపల్లెకు చెందిన వైసీపీ నేత, కోఆప్షన్‌ మాజీ మెంబర్‌ అలీషేర్‌ఖాన్‌ మండల మీటింగ్‌లలో శ్మశానానికి స్థలం కేటాయించాలని పలుసార్లు కోరారు. అయినా రెవెన్యూ అధికారులు స్థలాన్ని చూపించలేకపోయారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని ఇటీవల స్థానిక టీడీపీ, వైసీపీ నేతలకు విభేదాలు చోటుచేసుకుంటూ వచ్చాయి. టీడీపీ నేత దేవరాజు కుటుంబసభ్యుల అధీనంలో ఉన్న స్థలాన్ని ఎలాగైనా శ్మశానానికి తీసుకోవాలని పలువురు వైసీపీ నేతలు భావించారు. తలుచుకుందే తడువుగా మూడురోజులుగా స్థానిక ప్రజలను పోగేసుకుని వైసీపీ నేతలతో కలిసి ఇద్దరు టీచర్లు ప్రణాళికలు రచించారు. బుధవారం దేవరాజు సోదరుడి కుటుంబానికి చెందిన పొలం వద్దకు ఎక్స్‌కవేటర్లను రెండింటిని తీసుకొచ్చి భూమిని చదునుచేయడానికి ప్రయత్నించగా దేవరాజు కుటుంబసభ్యులతోపాటు బంధువులు, టీడీపీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య అరుపులు కేకల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సుమన్‌కు సమాచారం చేరవేయగా సిబ్బందితో ఆయన చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. రెవెన్యూశాఖ అధికారులు తేల్చేవరకు ఇరువర్గాల వారు ఇందులో ఎవరూ ప్రవేశించరాదని, అతిక్రమిసే చర్యలు తప్పవని హెచ్చరించి పంపించేసారు.   కాగా దేవరాజు, ఆయన కుటుంబసభ్యులు మాట్లాడుతూ సంబంధిత భూమి గురించి హైకోర్టులో కేసు వేసామని, అయినా ఆ భూమిని లాక్కోవడానికి కొన్నిరోజులుగా వైసీపీనేతల బెదిరింపులు భరించలేకపోతున్నామని, ప్రభుత్వ టీచర్లుగా పనిచేసేవారు స్థానికులతోపాటు వైసీపీ వర్గాలను రెచ్చగొడుతున్నారని, వారివల్ల తమకు ప్రాణహాని ఉందని వారు ఆవేదన వ్యక్తం చేసారు.





Updated Date - 2022-01-20T05:37:29+05:30 IST