కన్నుపడితే.. కబ్జా.. ఆలయ భూముల్లో దర్జాగా పాగా

ABN , First Publish Date - 2022-04-30T18:02:40+05:30 IST

కన్నుపడితే.. కబ్జా.. ఆలయ భూముల్లో దర్జాగా పాగా

కన్నుపడితే.. కబ్జా.. ఆలయ భూముల్లో దర్జాగా పాగా

  • జగద్గిరిగుట్టలో ప్రభుత్వ భూములు మాయం
  • చెరువులో మట్టి నింపి ప్లాట్లుగా విక్రయం

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : కుత్బుల్లాపూర్‌ మండలం జగద్గిరిగుట్టలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు విచ్ఛలవిడిగా కబ్జా అవుతున్నాయి. పట్టపగలే ప్రభుత్వస్థలాల్లో మట్టి నింపి కబ్జా చేస్తున్నా, వాటిని పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది కళ్లు మూసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 348/1లో సుమారు 687 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండేది. ఇందులో ప్రభుత్వ అవసరాలకు వినియోగించినదిపోగా, 369.08 ఎకరాలు మిగిలింది.


ఈ స్థలంలో పెద్ద ఎత్తున కబ్జాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ వెనుకభాగం, ముందు భాగంలో కొందరు దర్జాగా పట్టపగలే నిర్మాణాలు సాగిస్తున్నారు. భూదేవిహిల్స్‌ను ఆనుకుని ఉన్న పరికి చెరువును మట్టితో నింపి కొందరు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. స్థానికులు అనేకమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో ఒక్కో ప్లాట్‌ను రూ.30లక్షలకు విక్రయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. మహంకాళీనగర్‌, మోడల్‌ మార్కెట్‌, రాజీవ్‌గృహకల్ప బ్లాక్‌నెంబర్‌ 53, 54 ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో విచ్ఛలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.


పంచుకుంటున్నారు..

జగద్గిరిగుట్టలో ప్రభుత్వ భూములను కొందరు నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పంచుకుని దోచుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


చర్యలు తీసుకుంటున్నాం..

జగద్గిరిగుట్టలో ప్రభుత్వ భూములను కబ్జాచేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నాం. భూదేవిహిల్స్‌, వేంకటేశ్వస్వామి ఆలయ ప్రాంతం, జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో సాగుతున్న నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకుంటాం. మాసిబ్బంది అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. - సంజీవరావు, కుత్బుల్లాపూర్‌, తహసీల్దార్‌.



ఆలయ స్థలాన్నీ.. 

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాలు చేస్తున్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఈ స్థలాల్లో ఇష్టానుసారంగా విగ్రహాలు ఏర్పాటు చేసి, గృహనిర్మాణాలు చేపట్టడం పరిపాటిగా మారింది. ఈ విషయమై దేవాదాయ శాఖ ఈవో కృష్ణమాచార్యులును సంప్రదించగా, ఆలయ స్థలం కబ్జాపై రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఆలయ స్థలం హద్దులు ఏర్పాటు చేసి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

Updated Date - 2022-04-30T18:02:40+05:30 IST