సోలార్‌కు భూములు ఇవ్వం

ABN , First Publish Date - 2021-06-24T05:14:44+05:30 IST

సోలార్‌ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన భూములను పరిశీలించేందుకు రుద్రసముద్రం గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను గ్రామ రైతులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ప్రాణమున్నంత వరకు మా భూములను సోలార్‌ ప్రాజెక్టుకు ఇవ్వబోమని స్పష్టం చేశారు. మా భూముల్లో బోర్లు, విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా పంటలు సాగుచేసుకుంటూ జీవిస్తున్నామన్నారు.

సోలార్‌కు భూములు ఇవ్వం
రుద్రసముద్రం రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ను చుట్టు ముట్టిన రుద్రసముద్రం  రైతులు

 దొనకొండ, జూన్‌ 23 : సోలార్‌ ప్రాజెక్టు కోసం  ఎంపిక చేసిన భూములను పరిశీలించేందుకు రుద్రసముద్రం గ్రామానికి వచ్చిన  కలెక్టర్‌ను గ్రామ రైతులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ప్రాణమున్నంత వరకు మా భూములను సోలార్‌ ప్రాజెక్టుకు ఇవ్వబోమని స్పష్టం చేశారు. మా భూముల్లో బోర్లు, విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా పంటలు సాగుచేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. కొద్దిపాటి కౌలు చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారని, మా ఆధీనంలో ఉన్న భూములు కౌలుకు ఇచ్చే ప్రసక్తేలేదని కలెక్టర్‌కు చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ రైతులు ఎటువంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, గ్రామంలో రైతులతో అన్ని విషయాలు చర్చించిన తర్వాతే ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు సాగుతామని కలెక్టర్‌ గ్రామ సర్పంచ్‌ వేగినాటి వెంకటసుబ్బయ్య, వైసీపీ నాయకుడు పెద్దవీరయ్యలకు తెలిపారు. భూములకు సంబంధించి మరికొన్ని విషయాలు వారితో చర్చించారు. 

  భూములు పరిశీలించిన కలెక్టర్‌ 

  మండలంలోని రుద్రసముద్రం గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న సోలార్‌ ప్రాజెక్టుకు సంబంధించిన భూములను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎటువంటి భూములు.., ఎన్ని ఎకరాల భూములు కేటాయించారు. వాటి పరిస్థితి.., నలుమూలల హద్దులు, మౌలిక సౌకర్యాలు వంటి వివరాలను మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం విలేకర్లతో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందు ఆయా భూముల రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో  జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి, కందుకూరు ఇన్‌చార్జ్‌ ఆర్డీవో వసంత్‌బాబు, తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు, మండల సర్వేయర్‌ దర్శన్‌, లైసెన్స్‌ సర్వేయర్‌ చెన్నంశెట్టి వెంకటరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-24T05:14:44+05:30 IST