కబ్జా కోరల్లో రూ.3 కోట్ల స్థలం

ABN , First Publish Date - 2022-08-11T06:04:06+05:30 IST

43వ డివిజన్‌ ఊర్మిళా సుబ్బారావునగర్‌లోని ఆసుపత్రికి కేటాయించిన 4 ఎకరాల స్థలంలో కొంత భాగాన్ని బినామీ కాగితాలతో కబ్జాకు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ అనుచరుడు బరితెగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

కబ్జా కోరల్లో రూ.3 కోట్ల స్థలం
ఊర్మిళానగర్‌ ఆసుపత్రి స్థలం (4 ఎకరాల కామన్‌సైట్‌) వ్యూ

వెలంపల్లి అనుచరుడి హస్తం.. ఊర్మిళానగర్‌లో తీవ్ర చర్చ

భవానీపురం 10 : 43వ డివిజన్‌ ఊర్మిళా సుబ్బారావునగర్‌లోని ఆసుపత్రికి కేటాయించిన 4 ఎకరాల స్థలంలో కొంత భాగాన్ని బినామీ కాగితాలతో కబ్జాకు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌  అనుచరుడు బరితెగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.  కబ్జాలో సిద్ధహస్తుడైన హెచ్‌బీ కాలనీకి చెందిన ఓ ముస్లిం నాయకుడు దీనికి ఒడి గట్టాడు. తన కింద స్థాయి కుర్రాళ్లతో కొద్దిరోజుల క్రితం ఎక్స్‌కవేటర్‌తో భూమిని చదును చేశాడు. అనంతరం సర్వే బాదులతో హద్దులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి ప్రజలు అది ఆసుపత్రి స్థలం మీకెలా చెందుతుందని ప్రశ్నించేటప్పటికి ఆగారు. 1950లోనే వారి తాలూక వ్యక్తుల పేర్లను ఉపయోగించి ఎకరం లోపు స్థలం వారిదేనని కాగితాల సృష్టించేందుకు ప్రయత్నాలు సాగినట్లు సమాచారం. ఆ వ్యక్తి యూకేలో ఉన్నాడని నమ్మబలుకుతున్నారని వినికిడి.  ఇక్కడ గజం రూ.50 వేల నుంచి రూ.70వేలు పలుకుతోంది. చుట్టూ అపార్టుమెంట్లు పెరగడంతో ఊర్మిళానగర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇదే అదునుగా కబ్జాదారులు కార్పొరేషన్‌ కామన్‌ సైట్‌పై కన్నేశారన్నది స్పష్టమవుతోంది. కొద్ది నెలలు క్రితం కూడా ఈ స్థలంలోకి భవానీపురంలోని లారీ స్టాండ్‌ తరలించాలన్న ప్రయత్నాలకు స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో పాలకులు మిన్నకుండిపోయారు. 

2010లో ఆసుపత్రికి శంకుస్థాపన

ఐరన్‌యార్డు ఏర్పాటులో భాగంగా ఊర్మిళానగర్‌ లో 4 ఎకరాల కామన్‌ సైట్‌ కార్పొరేషన్‌కు వచ్చింది. అప్పటి ఎంపీ లగడపాటి,  ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, మేయర్‌ రత్నబిందు హయాంలో ఇక్కడ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి 2010లో  శంకుస్థాపన జరిగింది. ఈ విషయం ఇప్పటి ఎమ్మెల్యే మరిచిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్ల క్రితం ప్రజల అవసరాల కోసం మంచినీటి రిజర్వాయర్‌ ఇక్కడ నిర్మించారు. అనంతరం వర్మీకంపోస్టు యూనిట్‌ను నెలకొల్పగా, స్థానికులు దుర్వాసనతో అల్లాడుతున్నామని ఫిర్యాదులతో ఈ సర్కార్‌ హయాంలో దాన్ని మూసేశారు. గత కొద్ది నెలల నుంచి ఈ స్థలంలో పాగాకు డేగ కన్ను పడింది. ఇందులో రాళ్లు, మట్టి వేసి చదును చేశారు. ఇప్పుడు ఏకంగా పాగాకు ప్రయత్నాలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఖరీదైన ఖాళీ స్థలం రక్షణకు యుద్ధప్రాతిపదికన అధికారులు, కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రహారీ నిర్మించి, దానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 3 ఎకరాల స్థలం ఉన్నందున ఇందులో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, సచివాలయం, కమ్యూనిటీ హాలు నిర్మించే దిశగా కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పూనుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2022-08-11T06:04:06+05:30 IST