చుక్కలపై.. నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-10T06:02:06+05:30 IST

22ఏ నిషేధిత భూముల జాబితాపై తప్పు చేసింది అధికారులు.. ఫలితం అనుభవిస్తున్న భూ యజమానులు. చివరకు భూ యజమానులే గుర్తించి అధికారులను కలిసి వేడుకున్నా వారు ఆలకించడంలేదు.

చుక్కలపై.. నిర్లక్ష్యం

హైకోర్టుకు వెళ్తేనే 22ఏ నుంచి తొలగింపు

అర్జీలు పెట్టుకున్నా స్పందించని అధికారులు

వ్యయప్రయాసలకు గురవుతున్న భూయజమానులు

హెచ్చరికలకే పరిమితమౌతోన్న ఉన్నతాధికారులు


గుంటూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): 22ఏ నిషేధిత భూముల జాబితాపై తప్పు చేసింది అధికారులు.. ఫలితం అనుభవిస్తున్న భూ యజమానులు. చివరకు భూ యజమానులే గుర్తించి అధికారులను కలిసి వేడుకున్నా వారు ఆలకించడంలేదు. దీనిపై ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం ఉండటంలేదు.  చివరకు భూ యజమానులు దీనిపై పెద్ద న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది. గతంలో రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ పట్టా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు వాటి యజమానులు పెద్ద న్యాయపోరాటమే చేయాల్సి వస్తున్నది. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా ఉపయోగం ఉండటంలేదు. దీంతో బాధితులు హైకోర్టుని ఆశ్రయిస్తోన్నారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పులు వెలువడుతున్నా వాటిని అమలు చేయకుండా అధికారులు నాన్చుతున్నారు. చివరికి కోర్టు ధిక్కరణ కేసులు దాఖలైతే తప్ప చలనం కలగడం లేదు. ఇటీవల గుంటూరు తూర్పు, పశ్చిమ మండలాలతో పాటు మేడికొండూరు మండలంలో ముగ్గురు రైతులు హైకోర్టులో కేసులు గెలవడంతో సీసీఎల్‌ఏ జోక్యం చేసుకుని 22ఏ లిస్టు నుంచి ఆయా సర్వే నెంబర్లను తొలగించాల్సి వచ్చింది. ప్రభుత్వ, అసైన్డ్‌, చుక్కల భూములు వంటి వాటిని 22ఏ జాబితాలో చేర్చిన సందర్భంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించకుండా ఇష్టారాజ్యంగా జాబితాలోకి ఎక్కించారు. ఈ విషయం చాలామంది భూయజమానులకు కూడా తెలియదు. ఎప్పుడైతే వారు  భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వెళ్లినప్పుడు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆ వివరాలు తెలుస్తున్నాయి. తమది పట్టా భూమి అని, తరతరాల నుంచి శిస్తు కూడా చెల్లిస్తున్నామని, పట్టాదారు పాసు పుస్తకాలు చూపించినా రెవెన్యూ అధికారులు వారి సమస్యలను పరిష్కరించడం లేదు. ఇలాంటి సమస్యలను స్థానికంగానే తహసీల్దార్‌ పరిశీలించి వాస్తవమైతే ఫైలుని పై అధికారులకు పంపొచ్చు. ఆ దిశగా అఽధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల తీరుతో బాధితులు విసుగు చెందుతున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయం చేయమంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేస్తోన్నారు.


హైకోర్టు ఆదేశించినా.. నిర్లక్ష్యం

ఇటీవల మూడు కోర్టు ధిక్కరణ పిటీషన్లు రెవెన్యూ అధికారులపై దాఖలు కావడంతో గుంటూరు తూర్పు మండలంలోని గోరంట్లలో 13 ఎకరాలు, పశ్చిమలోని చౌడవరం సమీపంలో 11 ఎకరాల భూమిని 22ఏ నుంచి భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. అలానే మేడికొండూరులోని విశదలలో ఎనిమిది మంది రైతులకు చెందిన సర్వే నెంబరు భూమి విషయం కూడా హైకోర్టు ధిక్కరణ వరకు వెళ్లడంతో ఎట్టకేలకు ఆ సర్వే నెంబరుని కూడా తొలగించారు. అయితే 1బీ అడంగల్‌లో సవరణలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఆయా సవరణలు జరిగితే తప్ప 22ఏ నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్లు జరగవు. దీంతో బాధితులు మళ్లీ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాగా భూముల మ్యూటేషన్లు, సవరణలు అకారణంగా తిరస్కరించినా, నిర్దేశిత గడువు లోపు పరిష్కరించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చేస్తోన్న హెచ్చరికలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి.  మండల స్థాయి రెవెన్యూ వర్గాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోన్నది. 


Updated Date - 2022-08-10T06:02:06+05:30 IST