భూమాఫియా

ABN , First Publish Date - 2022-05-27T05:45:45+05:30 IST

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం సిద్దిపేట. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతోపాటు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు చేరాయి. విద్యా,వైద్య, పారిశ్రామికం, పర్యాటకంగా అనేక ప్రాజెక్టులు వచ్చాయి. పట్టణాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

భూమాఫియా
కొండపాక మండలం వెలికట్టలో వ్యవసాయ భూమిలో వెంచర్‌

జిల్లాలో విచ్చలవిడిగా భూ వ్యాపారం

పేరుకే ‘రియల్‌’.. అన్నీ అబద్దాలే

అనుమతులు లేకుండానే లేఅవుట్లు

నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు

ఎన్వోసీలు లేకుండానే క్రయవిక్రయాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 26: రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం సిద్దిపేట. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతోపాటు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు చేరాయి. విద్యా,వైద్య, పారిశ్రామికం, పర్యాటకంగా అనేక ప్రాజెక్టులు వచ్చాయి. పట్టణాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 


పదిమందిలో ఒకరు బ్రోకర్‌!

సిద్దిపేట ప్రాంతంలో ఎవరిని కదిలించినా భూముల ధరలు, క్రయవిక్రయాలు చేయాల్సిన స్థలాల గురించే చెబుతుంటారు. ప్రతీ పది మందిలో ఒక రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో ప్రొఫెషనల్‌ రియాల్టర్లు, వ్యాపారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల వాళ్లు ఉన్నారు. భూ క్రయవిక్రయాలు జరిపతే 2 శాతం వరకు కమీషన్‌  వస్తుండటంతో అమాయకులకు మాయమాటలు చెప్పి అయినా స్థలాలు కొనేలా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ అయ్యేదాకా మాయమాటలు చెప్పడం.. ఆ తర్వాత తమకేం తెలియదని చేతులెత్తేయడం షరామామూలే. 


నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు

వాస్తవానికి వెంచర్‌ ఏర్పాటు చేయాలంటే అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా వ్యవసాయ భూమిని వాణిజ్యపరమైన అవసరాల కోసం మార్పిడి చేస్తూ నాలా కన్వర్షన్‌ పొందాలి. గ్రామ కార్యదర్శి నుంచి ఎన్‌వోసీ తీసుకొవాలి. ఇక్కడ నిర్మించే వెంచర్‌ నుంచి ఆ గ్రామ అభివృద్ధి కోసం 10 శాతం భూమిని ఇస్తున్నట్లు ఒప్పందం చేసుకోవాలి. రహదారుల నిర్మాణం, విద్యుత్‌, డ్రైనేజీ, నీటి సౌకర్యాలు కల్పించి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో ఆమోదం పొందాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే స్థలాలు విక్రయించాలి. కానీ ఇవేవీ లేకుండానే వ్యవసాయ భూములకు హంగులు అద్దుతూ, అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి వెంచర్లు చేస్తున్నారు. కాగితాలపైనే మ్యాపులు చూపించి విక్రయిస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో మామూళ్లు ముట్టచెప్పి లావాదేవీలు ముగిస్తున్నారు. 


కోర్టు మెట్లెక్కుతున్న పంచాయితీలు

కోర్టులకు చేరే సివిల్‌ కేసుల్లో అత్యధిక శాతం భూలావాదేవీలకు సంబంధించినవే ఉంటున్నాయి. వ్యాపారులు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ర్టేషన్లు చేయించి డబ్బులు దండుకుంటున్నారు. ఆ తర్వాత వాస్తవాలు బయటపడడంతో కొన్నవారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సివిల్‌ తగాదాలు కావడంతో పోలీసులు కోర్టుకు రిఫర్‌ చేస్తున్నారు.  జిల్లాలోని అన్ని ఠాణాల పరిధిలో ఇవి నిత్యకృత్యంగా మారాయి. భూములకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం, వాటిని మరొకరికి విక్రయించిన ఘటనలు ఇటీవల సిద్దిపేటలో కొకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి.  ఇందులో చాలామంది అమాయకులు బాధితులుగా మారారు. తాము కూడబెట్టుకున్న డబ్బులు, బంగారం తాకట్టుపెట్టి కొనుగోలు చేసిన స్థలాలు వివాదాలకు చేరడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. 


అప్రమత్తతతోనే రక్షణ

రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్టు, వ్యాపారులు చూపించే హంగులు, ఆర్భాటాలను నమ్మకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతనే భూములు కొనుగోలు చేయాల్సి. లేదంటే చిక్కులు తప్పవని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఠాణాకు చేరిన పంచాయతీలకు కూడా ఇవే సూచిస్తున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించేపుడు ముందస్తుగానే అన్ని కోణాల్లో విచారించాలి. నిబంధనల ప్రకారం ఏర్పాటైన రియల్‌ వెంచర్‌లకే ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో రుణ సౌకర్యం, ఇంటి అనుమతులు పొందే స్థలాలనే ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడి త్వరగా పెరుగుతుందనే అత్యాశతో స్థలాలు కొనుగోలు చేస్తే ఆసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2022-05-27T05:45:45+05:30 IST