మల్లెమడుగులో మాయగాళ్లు

ABN , First Publish Date - 2021-10-20T04:37:20+05:30 IST

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో ఎక్కడైనా కొద్దిపాటి స్థలం ఎక్కువ రోజులు ఖాళీగా కనిపిస్తే చాలు పాగా వేయడం.. తమదికాని జాగాపై దొం

మల్లెమడుగులో మాయగాళ్లు

అసైన్డ భూములను ప్లాట్లు చేసి అమ్మిన వైనం

రూ.100కోట్ల విలువైన భూములపై కోరలు చాచిన రియల్‌మాఫియా 

పేద రైతులకు కుచ్చుటోపీ పెట్టిన అక్రమార్కులు

లబోదిబోమంటున్న ప్లాట్ల కొనుగోలుదారులు, చుట్టుపక్కల పట్టాదారులు

కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు

అసలు హక్కుదారులు, లెక్కతేల్చాలని ఆదేశం

ఖమ్మం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో ఎక్కడైనా కొద్దిపాటి స్థలం ఎక్కువ రోజులు ఖాళీగా కనిపిస్తే చాలు పాగా వేయడం.. తమదికాని జాగాపై దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మరీ ‘సెటిల్‌’మెంట్‌కు దిగడం ఆనవాయితీగా మారిన రోజులివి. అలాంటిది ఖమ్మానికి కూతవేటు దూరంలో ఉన్న మల్లెమడుగు రెవెన్యూలోని పలు అసైన్డ భూములపై మాయగాళ్ల కన్ను పడింది. రూ. 100కోట్ల విలువ చేసే భూమిపై రియల్‌ మాఫియా కోరలు చాచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదలు ఎకరాల భూమిలో అక్రమ వెంచర్లు వేసి అందినకాడికి దండుకుంది. అసలు అమ్మకానికి, కొనుగోలుకు వీలులేని భూమిలో వందల కొద్ది ప్లాట్లు చేసి దర్జాగా విక్రయించింది. ప్రస్తుతం అసలు విషయం వెలుగులోకి రావడంతో కొనుగోలుదారులు మొదలు అసలు హక్కుదారుల వరకు లబోదిబోమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి పలువురు హక్కుదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

మాయ జరిగిందిలా..

ఖమ్మం అర్బన పరిధిలోని మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని 184, 187, 189, 196, 198 సర్వే నంబర్లలోని సిరిపురపు నర్సయ్య అనే వ్యక్తి దగ్గర ఉన్న మిగులు భూమిని 1975లో 3045/75 సీసీ ద్వారా 38.02 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆయా భూములను 1989లో 3057/89 ఫైల్‌ ద్వారా 14 మంది రైతులకు కేటాయించి అసైనమెంట్‌ కింద కేటాయించింది. అనంతరం 1990లో హెచ5/201/1990 ద్వారా 184 సర్వే నంబర్లో ఎనిమిది, 187లో రెండు, 189 నాలుగు, 196లో రెండు, 198లో రెండు భాగాలుగా చేస్తూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల వారు గ్రామ నక్షాలో పోడీ చేసి బై నంబర్లు కేటాయించారు. అప్పటినుంచి సంబంధిత భూములను సదరు రైతులు సాగుచేసుకుంటుండగా.. రాను రాను ఆయా భూములకు నీటి సౌకర్యం లేకపోవడంతో వాటిని వదిలేశారు. దాంతో అవి బీడుభూములుగా మారగా... సదరు రైతులు అటువైపు తిరిగి చూడటం మానేయడంతోపాటుగా... కుటుంబపెద్దలు కాలం చేయడంతో వాటిని పట్టించుకోలేదు. ఇంకేముంది అప్పటికే ఆయా భూములపై కన్నేసిన రియల్‌ వ్యాపారులు సదరు పేద రైతులకు కుచ్చుటోపీ పెట్టేశారు. అసలు హక్కుదారులకు తెలియకుండానే అక్కడ ఉన్న భూముల్లో సుమారు 25 ఎకరాల వరకు ప్లాట్లు చేసి విక్రయించేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరం సుమారు రూ.4కోట్ల వరకు పలుకుతుండగా.. ప్రస్తుతం వారు విక్రయించిన భూమి విలువ రూ.100కోట్లు ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయా భూములకు సంబంధించిన అసలు హక్కుదారులు కలెక్టర్‌ను కలవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

అధికారులే సూత్రదారులా? 

ఎక్కడైనా ప్రభుత్వ భూమి, అసైన్డ భూముల క్రయ విక్రయాలు చేయకూడదు. ఎవరైనా అలా చేస్తే శిక్షార్హులవుతారు. ఆయా భూములకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ప్రభుత్వ భూములతోపాటుగా అసైన్డ భూములు ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు బదిలీ అవ్వకుండా ఆయా భూముల సర్వే నెంబర్లు, కేటాయింపు వివరాలను కూడా నోటిఫికేషన రూపంలో రిజిసే్ట్రషన కార్యాలయాలకు పంపడంతోపాటు.. రెవెన్యూ రికార్డుల్లోనూ స్పష్టంగా నమోదు చేస్తారు. అయితే మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని అసైన్డ భూముల క్రయవిక్రయాల విషయంలో పలువురు అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సాధారణ అగ్రిమెంటు ప్రకారం విక్రయం జరిగితే రెవెన్యూ శాఖ వారు వెంటనే పీవోటీ కేసులు నమోదు చేసి ఎవరి భూమిని అయితే విక్రయించారో దానిని వెంటనే స్వాధీనం చేసుకుంటారు. అయితే మల్లెమడుగు రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ తంతుకు అధికారులే సూత్రధారులుగా మారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే అంతటిస్థాయిలో విక్రయాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. అంతేనా సదరు రెవెన్యూ శాఖ వారు అసైన్డ భూమి ఉన్న చుట్టుపక్కల భూమిని రికార్డుల్లో అసైనమెంట్‌ భూమిగా చూపిస్తూ రికార్డులు మార్చారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఇది ఒక ఎత్తయితే అసైన్డ భూములను కేటాయించగానే.. ఆ వివరాలు రిజిసే్ట్రషన కార్యాలయానికి పంపినా అక్కడ చేతులు మారుస్తూ రిజిసే్ట్రషన శాఖ అధికారులు ఎలా భూమిని బదలాయించారన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు ప్రస్తుతం ధరణిలోనూ సదరు సర్వే నంబర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్న వాదన వినిపిస్తోంది. అసైనమెంట్‌ గా ఇచ్చిన సర్వే నెంబర్లలో ఉన్న భూముల కంటే ఎక్కువ మొత్తంలో భూములను రికార్డు చేసినట్టు వినికిడి. 

కొనుగోలుదారులు, పట్టాదారుల్లో గందరగోళం

ఆయా సర్వే నంబర్లలో సుమారు 25ఎకరాల వరకు అసైన్డ భూముల్లో ప్లాట్లు చేసి విక్రయించినట్టుగా తెలుస్తుండగా.. ప్రస్తుతం ఆయా ప్లాట్లను కొనుగోలు చేసిన వారు లబోదిబోమనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 200 గజాల చొప్పున ఒక్కో ఎకరానికి 18 ప్లాట్ల వరకు చేయగా.. అలా 25 ఎకరాల్లో 400 మందికి పైగా వాటిని కొనుగోలు చేశారు. అంతేకాదు సదరు కొనుగోలుదారుల నుంచి పదుల సంఖ్యలో చేతుల మారిన ప్లాట్లు కూడా ఉన్నాయి. మరికొందరయితే పలు ప్రైవేటు బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు కూడా పొందారు. దానితోపాటుగా 198వ సర్వే నెంబర్లో 10.28 ఎకరాల పట్టా భూమి కూడా ఉంది. అలా మరికొన్ని చుట్టుపక్కల సర్వే నెంబర్లలో కూడా పట్టా భూములు ఉండగా.. ప్రస్తుతం అధికారులు వాటిని అసైన్డ ల్యాండ్‌ అంటూ పరిగణించడంతో సంబంధిత పట్టాదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చేసిన తప్పుల కారణంగా అటు పట్టాభూముల యజమానులు, ఇటు అసైన్ట భూముల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు లబోదిబోమంటున్నారు. కాగా దీనికి సంబంధించి పలువురు అసైన భూముల హక్కుదారులు కలెక్టర్‌ను కలవగా.. ఆయన విచారణకు ఆదేశించారు. సదరు భూమిని కొనుగోలు చేసిన వారిపై పీవోటీ కేసులు నమోదు చేయాలని సూచించారు. మరో వైపు పూర్తిస్థాయిలో విచారణ, సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలని పట్టా భూముల యజమానులు కోరుతున్నారు. 

రైతులకు కేటాయించిన అసైన్డ భూముల వివరాలు 

మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని 38 ఎకరాల భూమిని 3057/1989 ఫైల్‌ నెంబరు ద్వారా 14 మంది రైతులకు కేటాయించారు. అందులో  లావుడ్యా మండమ్మకు 184/2లో 2ఎకరాల 8కుంటలు, ధరావత కమ్లీకి 184/3లో 2ఎకరాల13కుంటలు, వాంకుడోత కాంతికి 184/4లో ఎకరం 39కుంటలు, వాంకుడోత రాణికి 184/5లో ఎకరం33కుంటలు, బాణోత బాజికి 184/6లో 2ఎకరాల 36కుంటలు, బాణోత కౌస్రీకి 184/7లో 2ఎకరాల11 కుంటలు, బాణోత మంగతాయికి 184/8లో ఎకరం 29 కుంటలు, బాణోత జానకీకి 189/2లో ఎకరం 37 కుంటలు, అక్కి భాగ్యమ్మకు 189/3లో రెండెకరాల 17 కుంటలు, అక్కి తులశమ్మకు 189/4లో నాలుగెకరాల 13 కుంటలు, బోడా గంషీకి 187/2లో ఎకరం 6 కుంటలు, బాణోత చుక్కమ్మకు 196/1లో నాలుగెకరాల 24 కుంటలు, బాణోతు సక్కుబాయికి 196/2లో నాలుగెకరాల 25 కుంటలు, బడగుండ్ల లచ్చయ్యకు 198/2లో 3.29 కుంటల భూవమిని కేటాయించారు. వాటిల్లో సుమారు 25 ఎకరాల వరకు ప్రస్తుతం ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరిపారు. 

 

Updated Date - 2021-10-20T04:37:20+05:30 IST