ల్యాండ్‌ మాఫియాపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2020-08-03T10:40:58+05:30 IST

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ల్యాండ్‌ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ల్యాండ్‌ మాఫియాపై ఉక్కుపాదం

భూదందా ముఠాలపై ప్రత్యేక దృష్టి

ఏరియాల వారీగా వివరాల సేకరణ

పీడీ యాక్టుతో హెచ్చరికలు

సెటిల్‌మెంట్‌ గ్యాంగుల్లోనే 200మంది

కొరఢా ఝుళిపిస్తున్న రామగుండం సీపీ


గోదావరిఖని, ఆగస్టు 2: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ల్యాండ్‌ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలని నేరస్థుల ముఠాలు భూదందాల్లో ప్రవేశించడంతో కొన్నిరోజులుగా కమిషనరేట్‌లో భూవివాదాలు పెరిగిపోయాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ భూ మాఫియా రోజురోజుకు ఆగడాలను పెంచుకుంటూ పోతోంది. నేరస్థుల ముఠాలన్నీ సెటిల్‌మెంట్‌ గ్యాంగుల్లో చేరిపోయాయి. దీంతో శాంతిభద్రతల సమస్యగా మారింది. దీనికి చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగిన పోలీస్‌ కమిషనర్‌ ల్యాండ్‌ మాఫియాపై కొరఢా ఝుళిపిస్తున్నారు. పీడీ యాక్టు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. 


పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ల్యాండ్‌ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. వివాదంలేని భూములకు కూడా వివాదాలు సృష్టించి సెటిల్‌మెంట్ల పేర డబ్బులు దండుకుంటున్నారు. దీనిపై పోలీస్‌ కమిషనర్‌కు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిరోజులుగా ప్రత్యేక విభాగం ద్వారా విచారణ జరిపించారు. గోదావరిఖని, పెద్దపల్లి, ఎన్‌టీపీసీ, మంచిర్యాల, నస్పూర్‌, బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల్లో భూమాఫియా కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.


రామగుండంపై ప్రత్యేక దృష్టి

ల్యాండ్‌ మాఫియాలో రామగుండం ముఠాలదే ప్రధానపాత్రగా పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడినుంచే వివిధ ప్రాంతాలకు వెళ్లి ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తున్నట్టు గుర్తించారు. గోదావరిఖని, ఎన్‌టీపీసీ ప్రాంతాల్లో ఇలాంటివి ఏడెనిమిది ముఠాలు ఉన్నట్టు తేలింది. కొందరు సింగరేణి ఉద్యోగులు కూడా ఈ దందాల్లో పాలుపంచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన వివాదాల్లో పలువురి పేర్లు ఎస్‌బీ విభాగం సేకరించింది. దీంతోపాటు ఒకరిద్దరు కార్పొరేషన్‌ ప్రాంత ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వీరి కట్టడిపై పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏరియాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో మార్కండేయకాలనీ ప్రాంతంలోనే భూ వివాదాలు ఉండేవి. రియల్టర్ల మధ్య గొడవలతో ఇప్పటికీ సామన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక భూస్వామి తన భూములు అమ్ముకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. మిగిలిన ఒకరిద్దరు 20 నుంచి 30ఏళ్ల క్రితం సామాన్యులు కొనుగోలు చేసిన భూములకు వివాదాలు సృష్టిస్తుండడంతో సమస్యలు పెరిగాయి. గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతంలో సైతం ఈ ల్యాండ్‌ ముఠాలు వివాదాలు సృష్టిస్తున్నాయి. 


పీడీ యాక్టు ప్రయోగం..

రామగుండం కమిషనరేట్‌లో ల్యాండ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్‌ కమిషనర్‌ పీడీ యాక్టుతో హెచ్చరికలు పంపుతున్నారు. గోదావరిఖకి చెందిన కోట కుమార్‌పై పీడీ యాక్టు ప్రయోగించడం ద్వారా భూ దందాలకు పాల్పడే వారికి సంకేతాలు ఇచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకోవడం, పీడీ యాక్టు ప్రయోగించేంత వరకు సొంత శాఖని అధికారులకు, సిబ్బందికి కూడా సమాచారం లేకుండా కట్టడి చేశారు. ఇంకా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏయే ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ ముఠాలు ఎక్కడెక్కడ వివాదాల్లో పాలుపంచుకున్నాయనే విషయంపై విచారణ జరుపుతున్నారు, ఎవరెవరూ వీరిని ఆశ్రయించారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. కాగా, సెటిల్‌మెంట్‌ గ్యాంగులకు కొన్ని ఫైనాన్స్‌ ముఠాలు కూడా పెట్టుబడి పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. భూముల్లో వివాదాలు సృష్టించడం, సెటిల్‌మెంట్‌ ముఠాల పేర రిజిస్ర్టేషన్‌ చేయించుకునేంత వరకు కొందరు ఫైన్సాన్షియర్లదే కీలకపాత్రగా గుర్తించారు. 


రెవెన్యూ రికార్డుల తారుమారు..

ఈ భూదందా ముఠాల్లోని కొందరు వ్యక్తులు రెవెన్యూ రికార్డుల్లోనూ సిద్ధహస్తులుగా పేరుంది. తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులను సైతం మాయం చేసి రికార్డులను ట్యాంపరింగ్‌ చేయడం, తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన ఒక రెవెన్యూ అధికారి అండతో పెద్దఎత్తున గతంలో రికార్డులు మార్చినట్టు గుర్తించారు. ఇప్పటికీ పాత తేదీలపై సదరు అధికారి సంతకాలతో ప్రొసీడింగ్‌లు, ఇతర ధ్రువీకరణాలు వెలువడుతున్నాయి. రెవెన్యూ రికార్డుల తారుమారుపై పారిశ్రామిక ప్రాంతంలోనే ఎనిమిది వరకు కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


ఠాణాలపైనా నిఘా..

ల్యాండ్‌ మాఫియాకు ఏయే ఠాణాల్లో ఎవరెవరూ సహకరిస్తున్నారనే వ్యవహారాలపై కూడా కమిషనరేట్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. కమిషనర్‌ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు. ఎవరెవరికి సంబంధాలున్నాయి, ఎంతమేరకు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. దీంతో పలు ఠాణాల్లో వీరితో సంబంధాలు కొనసాగించిన పోలీస్‌ సిబ్బంది కూడా హైరానాపడుతున్నారు. కొందరిపై వేటు తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది. 

Updated Date - 2020-08-03T10:40:58+05:30 IST