Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊహించని మలుపు తిరిగిన రూ.100 కోట్ల ల్యాండ్‌ వివాదం..

భూ మాయగాళ్లు

వైసీపీ ఎమ్మెల్యేకే ఝలక్‌ ఇచ్చిన దళారులు

నకిలీ జీపీఏ, సేల్‌డీడ్‌లతో అమ్మకానికి యత్నం

దళారుల్లో ఒకరు అరెస్టు...మరొకరు పరారీ

భూ యజమాని భార్య పాత్రపైనా అనుమానాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)కొమ్మాదిలో రూ.100 కోట్ల భూ వివాదం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజునే మోసం చేయడానికి ఈ బృందం యత్నించడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రముఖ విద్యా సంస్థలో డైరెక్టర్‌ అయిన జరజాపు శ్రీనివాసరావు నేరం అంగీకరించి, పోలీసులకు లొంగిపోవడం మరో విశేషం. అతడిని అరెస్టు చేసి శనివారం జైలుకు పంపించారు. కాకినాడకు చెందిన మరో దళారి పరారీలో ఉండగా, ఈ కేసులో భూ యజమాని భార్య లక్ష్మీ సూర్యప్రసన్న పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఎలా మోసం చేశారంటే..?

అమెరికాలో వుంటున్న కృష్ణచౌదరికి రాష్ట్రంలో పలుచోట్ల భూములు ఉన్నాయి. ఆయన ఇండియాకు వచ్చి 12 ఏళ్లు దాటింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన భార్యను అంటూ కొమ్మాది భూమిపై పోలీసు కేసు పెట్టిన లక్ష్మీ సూర్య ప్రసన్న(38)ది తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు. తనను అన్నవరం ఆలయంలో కృష్ణ చౌదరి పెళ్లి చేసుకున్నట్టు పోలీసులకు ఆమె తెలిపారు. ఇదిలావుంటే కొమ్మాది వైపు భూములు కొనాలని యత్నిస్తున్న ఎమ్మెల్యే కన్నబాబురాజు కోసం అదే పార్టీకి చెందిన చంద్రమౌళి...ప్రముఖ విద్యా సంస్థలో మ్యాథ్స్‌ లెక్చరర్‌ అయిన జరజాపు శ్రీనివాసరావు (ఆయన భార్య రైల్వేలో ఆఫీసర్‌), అప్పలరాజు అనే వ్యక్తుల ద్వారా కృష్ణచౌదరికి చెందిన 12.26 ఎకరాలు చూపించారు. ఆ భూ యజమాని అమెరికాలో ఉంటారని, వాటి డాక్యుమెంట్లు పోయాయని, పత్రికలో ప్రకటన ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చునని చెప్పారు.


ఆ మేరకు ఎమ్మెల్యే కన్నబాబురాజు రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో వివరాలు సరిచూసుకొని కరోనా మొదలవ్వడానికి నాలుగు నెలల ముందు వారితో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ జరజాపు శ్రీనివాసరావుతో పాటు కాకినాడకు చెందిన వాసంశెట్టి జయసూర్య కీలకంగా వ్యవహరించాడు. అమెరికాలో కృష్ణచౌదరి నుంచి సేల్‌ పవర్‌ తెప్పించి రిజిస్టర్‌ చేస్తామని చెప్పారు. ఆ విధంగానే ఎమ్మెల్యే కుటుంబం డాక్యుమెంట్‌ తయారు చేయించి ఇవ్వగా, దానిని అమెరికా పంపించినట్టు, అక్కడి నుంచి సంతకంతో తిరిగి వచ్చినట్టు ఆధారాలు సృష్టించారు. మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌కు కృష్ణచౌదరి పేరుతో మెయిల్‌ కూడా పెట్టించారు. దాంతో అధికారులు అంతా నిజమేననుకున్నారు.


రూ.19 కోట్లకు డీల్‌

ఈ భూమిని రూ.19 కోట్లకు అమ్మేందుకు జరజాపు శ్రీనివాసరావు అండ్‌ కో ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కుటుంబం మొదట రూ.49 లక్షలు, ఆ తరువాత రూ.50 లక్షలు కృష్ణ చౌదరి బ్యాంకు ఖాతాకు వేశారు. ఈ వ్యవహారంలో రూ.2 కోట్లు తన భార్యకు ఇవ్వాలని కృష్ణచౌదరి చెప్పినట్టు దళారులైన జరజాపు శ్రీనివాసరావు, జయసూర్య తెలపడంతో పేమెంట్‌లో భాగంగా ఎమ్మెల్యే మరో రూ.2.5 కోట్లు...ఆయన ఖాతాలో జమ చేశారు. అందులో రూ.2 కోట్లు జయసూర్య తన ఖాతాకు మళ్లించుకొని, అందులో రూ.1.4 కోట్లు విత్‌డ్రా చేసి ఆమెకు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇంకా మిగిలిన రూ.60 లక్షలు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. ఆమె అందులో రూ.30 లక్షలు అదే బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయగా, సేవింగ్స్‌ ఖాతాలో రూ.30 లక్షలు ఉన్నాయి. 


రిజిస్ట్రేషన్‌ దగ్గర తిరకాసు

రిజిస్ట్రేషన్‌ కోసం ఎమ్మెల్యే పత్రిక ప్రకటన ఇచ్చి వారం రోజులు పూర్తయిన తరువాత మధురవాడలో ఆ భూమిని రిజిస్ట్రేషన్‌కు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ చౌదరి భార్య ప్రసన్న విశాఖపట్నం వచ్చి..తన భర్త భూమిని ఎవరో రిజిస్టర్‌ చేసుకుంటున్నారని కేసు పెట్టారు. దాంతో అప్పటివరకు సజావుగా నడిచిన వ్యవహారం రచ్చ అయింది. ఆమె ఎందుకు ఫిర్యాదు చేశారో ఎమ్మెల్యే కుటుంబానికి అర్థం కాలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఏనాడు కూడా దళారులు భూ యజమానితో గానీ, భార్యతో గానీ మాట్లాడించలేదు. అంతా తామే చూసుకుంటున్నట్టు చెప్పారు. భార్య ఫిర్యాదును పోలీసులు స్వీకరించగానే అప్రమత్తమైన ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా ఎదురు కేసు పెట్టారు. పోలీసులు దళారి జరజాపు శ్రీనివాసరావును పిలిచి విచారించగా..ఆయన తప్పు ఒప్పుకున్నాడు. తాను, కాకినాడకు చెందిన జయసూర్య, కృష్ణ చౌదరి భార్య ప్రసన్న కలిసి ఈ మోసం చేశామని చెప్పినట్టు తెలిసింది. దాంతో అతడిని అరెస్టు చేశారు. జయసూర్య పరారీలో ఉన్నాడు. 


మాట మార్చిన భార్య

భూమిని ఎవరో రిజిస్టర్‌ చేసుకున్నారని ఫిర్యాదుచేసిన కృష్ణ చౌదరి భార్య ప్రసన్న తన ఖాతాలోకి వచ్చిన డబ్బుపై పోలీసులు ప్రశ్నించేసరికి లాయర్‌తో వచ్చి సమాధానం చెబుతానని వెళ్లిపోయారు. ఆ తరువాత లాయర్‌తో వచ్చి...జయసూర్య వద్ద రూ.3.20 చొప్పున వడ్డీకి రూ.60 లక్షలు అప్పు తీసుకున్నానని, అందుకే ఆయన తన బ్యాంకులో డబ్బులు వేశాడని చెప్పారు. రూ.3.20 వడ్డీకి అప్పు తీసుకొని అందులో రూ.30 లక్షలు 70 పైసల వడ్డీకి బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఎందుకు చేశారు?, అదేమైనా లాభదాయకమా? అని పోలీసులు ప్రశ్నిస్తే...ఆమె సమాధానం చెప్పలేకపోయారు. అప్పు చేసిన మొత్తం వాడుకోకుండా బ్యాంకులోనే ఎందుకు ఇంకా ఉంచారు? అని అడిగినా సమాధానం లేదు. దీంతో ఈ వ్యవహారంలో ఆమెకు అన్ని వివరాలు తెలుసునని పోలీసులు భావిస్తున్నారు. 


ఆ వివరాలు ఎలా వచ్చాయి?

అమెరికాలో వుంటున్న కృష్ణ చౌదరికి కొమ్మాదిలో భూములు వున్నాయనే విషయం జరజాపు శ్రీనివాసరావుకు, జయసూర్యకు ఎలా తెలిసింది?, ఆయన బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్టు ఎలా వచ్చాయి?...అనేది తేలాల్సి ఉంది. ఇంత పెద్ద వివాదంలో అసలైన యజమాని కృష్ణ చౌదరితో పోలీసులు మాట్లాడారా?, ఏమి తెలిసింది?...అనేది బయటకు రావడం లేదు. ఇక తప్పించుకు తిరుగుతున్న జయసూర్య ఆర్థికంగా స్థితిమంతుడు కాదు. కేవలం స్కూటర్‌పై తిరిగే మనిషి. అప్పులు ఇచ్చే స్థోమత లేదు. కానీ తనకు రూ.60 లక్షలు అప్పు ఇచ్చాడని ప్రసన్న చెబుతున్నారు. ఈ వివరాలన్నీ బయటకు రావాలంటే...జయసూర్య దొరకాలి. ప్రసన్నకు రూ1.4 కోట్లు నగదు రూపంలో ఇచ్చానని జయసూర్య నమ్మించాడు. ఈ భూమి కేసులో తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు...వారు తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇప్పించాలని ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఆయన కుమారుడు సుకుమారవర్మ డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసుకు ఎలా ముగింపు ఇస్తారో వేచి చూడాలి.

Advertisement
Advertisement