కామన్‌సైట్‌పై కన్ను

ABN , First Publish Date - 2022-07-01T06:32:03+05:30 IST

రామవరప్పాడు రింగ్‌రోడ్డుకు కూతవేటు దూరంలోని రామవరప్పాడు పంచాయతీ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన కామన్‌సైట్‌పై వైసీపీ నేత కన్నుపడింది.

కామన్‌సైట్‌పై కన్ను
రామవరప్పాడు కామన్‌ సైట్లో వెలసిన సిమెంట్‌ దిమ్మెలు

రూ. కోటి 25 లక్షల విలువైన భూమి కొట్టేసేందుకు వైసీపీ నేత యత్నం

పైగా తన స్థలంలో కలిసిందంటూ బుకాయింపు

ప్రభుత్వ సర్వేయర్‌తో కొలిపించాలని కలెక్టర్‌కు స్థానికుల విన్నపం

2న సర్వేకు ఆదేశాలు?

గుణదల, జూన్‌ 30 : రామవరప్పాడు రింగ్‌రోడ్డుకు కూతవేటు దూరంలోని రామవరప్పాడు పంచాయతీ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన కామన్‌సైట్‌పై వైసీపీ నేత కన్నుపడింది. దీంతో ఆయన ఏకంగా నాల్గురోజుల క్రితమే స్థలం హద్దులు తెలిసేలా సిమెంట్‌ దిమ్మెలు పాతించడం జరిగింది. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే నాకిక్కడ 250 గజాల పట్టాభూమి ఉందని, అందులో ఏమైౖనా కామన్‌సైట్‌ ఉందేమో తెలియదని బుకాయిస్తున్నారు. ఇక్కడ గజం మార్కెట్‌ విలువ రూ.50వేలు పైమాటే. ఈ ప్రదేశంలో ఉండాల్సిన 43 సెంట్ల కామన్‌ సైట్‌ ఏమైనట్టు అని స్థానికులు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌, విజయవాడ రూరల్‌ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం రూపంలో అందజేశారు. ప్రభుత్వ సర్వేయర్‌ చేత కొలతలు వేయించి నిగ్గుతేల్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే 1985లో రామవరప్పాడు పంచాయతీ పరిధిలో గ్రామానికి నడిబొడ్డున 8.70 ఎకరాల విస్తీర్ణంలో నిబంధనల ప్రకారం ఓ బిల్డర్‌ లే అవుట్‌ తీసుకుని 75 నివేశన స్థలాలకు ప్లాట్లు వేసి అమ్మేశాడు. అందులో 43 సెంట్ల భూమిని కామన్‌సైట్‌గా చూపించి పంచాయతీకి అప్పగించారు. 75 ప్లాట్లలోనూ ఇంచుమించుగా ఇళ్లనిర్మాణం జరిగిపోయింది. కొన్నిచోట్ల నిర్మాణాలు జరగాల్సి ఉంది. కగా ఈ కామన్‌సైట్‌లో 250 గజాల నివేశన స్థలం ఉందంటూ ఓ వైసీపీ నేత నాలుగు రోజుల క్రితం ఇక్కడకు వచ్చి సిమెంట్‌ దిమ్మెలు పాతించాడు. దీంతో స్థానికులు కలెక్టర్‌, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జూ లై 2న ప్రభుత్వ సర్వేయర్‌ చేత సర్వే చేయించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎల్‌పీ నెంబరు 64, 80లో గల 4 సర్వే నెంబర్లలో మొత్తం కలిపి 43 సెంట్ల కామన్‌సైట్‌ ఉండాలన్నది గ్రామస్థుల వాదన. రామవరప్పాడులో కామన్‌సైట్లను కబ్జా చేయడం కొత్తేమీ కాదని చెప్పవచ్చు. లక్ష్మీపతిరావు వీధి, రాఘవేంద్ర సొసైటీల్లో ఉండాల్సిన కామన్‌సైట్లు ఆక్రమణకు గురవ్వడమే ఇందుకు నిదర్శనం. ఇకపోతే సర్వే నెంబర్లు 73, 74లో వేసిన ప్లాట్లకు సుమారు 30సెంట్ల కామన్‌సైటును వదిలారు. దీనికి హద్దులు లేవు. పంచాయతీ అధికారులు హద్దులు వేసి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జూలై 2న జరిగే సర్వేతో 43 సెంట్ల కామన్‌సైట్‌ బయటపడుతుందా లేక సదరు వైసీపీ నేతకు అనుకూలంగా వ్యవహారం జరుగుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. 

కామన్‌సైట్‌ వాస్తవమే!

పంచాయతీ కార్యదర్శి ఘంటా రామ్మోహనరావు 

కామన్‌సైట్లో సిమంట్‌ దిమ్మెలు వేసిన విషయం మా దృ ష్టికి వచ్చింది. స్థల యజమాని చెబుతున్నట్టు ఆయన స్థలం కామన్‌సైట్లోకి వచ్చిందా లేక ఆయనే వచ్చాడా అన్నది జూలై 2న ఉదయం 11గంటలకు గ్రామస్థుల సమక్షంలోనే ప్రభుత్వ సర్వేయర్‌ చేత కొలతలు వేయించాలని పంచాయతీలో తీర్మానం చేసి తహసీల్దార్‌కు పంపించాం.

Updated Date - 2022-07-01T06:32:03+05:30 IST