గడ్డపోతారం, కాజీపల్లి పారిశ్రామికవాడల్లో కబ్జాలు

ABN , First Publish Date - 2021-06-21T05:54:15+05:30 IST

హైదరాబాద్‌ శివార్లలో భూముల ధరలు ఆకాశాన్నంటుతండటంతో ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు మాయంచేస్తున్నారు. పారిశ్రామికవాడల్లో ప్రభుత్వ భూములు, వరదకాల్వలు, అసైన్డ్‌ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. అసైన్డ్‌ భూముల్లోంచి రోడ్లు వేస్తున్నారు. చెరువలకు నీళ్లు వెళ్లకుండా వరద కాల్వలను ఆక్రమిస్తున్నారు. ప్రైవేటు సంస్థల పార్కింగ్‌ కోసం రహదారులను మింగేస్తున్నారు.

గడ్డపోతారం, కాజీపల్లి పారిశ్రామికవాడల్లో కబ్జాలు

జిల్లెలవాగును మింగేస్తున్న పరిశ్రమలు

ప్రభుత్వ, ఆసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం


జిన్నారం, జూన్‌ 20: హైదరాబాద్‌ శివార్లలో భూముల ధరలు ఆకాశాన్నంటుతండటంతో ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు మాయంచేస్తున్నారు. పారిశ్రామికవాడల్లో ప్రభుత్వ భూములు, వరదకాల్వలు, అసైన్డ్‌ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. అసైన్డ్‌ భూముల్లోంచి రోడ్లు వేస్తున్నారు. చెరువలకు నీళ్లు వెళ్లకుండా వరద కాల్వలను ఆక్రమిస్తున్నారు. ప్రైవేటు సంస్థల పార్కింగ్‌ కోసం రహదారులను మింగేస్తున్నారు. 


కబ్జాలతో కుచించుకుపోయిన జిల్లెలవాగు

గడ్డపోతారం, కాజీపల్లి పారిశ్రామికవాడల మధ్య ఉన్న జిల్లెలవాగు కబ్జాలతో కుంచించుకుపోతున్నది. పారిశ్రామికవాడల మధ్యలోంచి మూడుకిలోమీటార్లు ప్రవహించే ఈ వాగు గుండా ఖాజీచెరువు, గండిగూడెం చెరువులకు వరదనీరు చేరుతుంది. ప్రస్తుతం ఈ వాగులో సమీప పరిశ్రమల నుంచి వ్యర్థ రసాయనాలను యథేచ్ఛగా విడుదల చేస్తున్నారు. వాగు ఒడ్డున ఉన్న పరిశ్రమల యజమానులు వాగును ఆక్రమించి కలిపేసుకున్నారు. పీసీబీ ఏర్పాటు చేసిన సంపు దిగువ భాగంలో 15 అడుగులు ఉండాల్సిన జిల్లెలవాగు ఐదడుగులకు కుచించుకుపోయి పిల్లకాల్వను తలపిస్తున్నది. వాగు ప్రవాహం ప్రాంతం, బఫర్‌జోన్‌లో చట్టవిరుద్ధంగా నిర్మాణాలు వెలస్తున్నాయి. భారీగా వరద వస్తే నీటి ప్రవాహానికి ఆటంకాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదమున్నది. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవటంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల ఆక్రమణ

గడ్డపోతారం పంచాయతీ పరిధిలో ఓ వెంచర్‌కు వెళ్లేందుకు అసైన్డ్‌ భూమి నుంచి రోడ్డువేశారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గతంలో వెలుగులోకి తీసుకురాగా.. రెవెన్యూ అధికారులు రోడ్డును తవ్వేశారు. కొద్దిరోజులకే అక్రమార్కులు తిరిగి రోడ్డును పునరుద్ధరించారు. గ్రామంలోనే సర్వేనంబర్‌ 11లో ఓ పరిశ్రమ యజమానులు రూ. 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీని నిర్మించారు. పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమల ఎదుట రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పార్కింగ్‌ కోసం షెడ్లు వేస్తున్నారు.


ఆరంభంలోనే హడావుడి..

విలువైన ఆక్రమణలను నిరోధించడానికి సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాలపై ఫిర్యాదులు కానీ, పత్రికల్లో కథనాలు కానీ వచ్చినప్పుడు హడావుడిగా పనులు నిలిపివేయిస్తున్నారు. కొద్దిరోజులకే కబ్జాదారులు తిరిగి తమ పనులను కొనసాగిస్తున్నా పట్టించుకోవడం లేదు. రూ. కోట్లు విలువచేసే భూములు కబ్జాకావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-06-21T05:54:15+05:30 IST