రూ. 1కోటి స్థలం.. కబ్జాపర్వం!

ABN , First Publish Date - 2021-05-07T04:35:51+05:30 IST

అది ఏర్పేడు - నగిరేకల్‌ వరకు నిర్మించిన 565వ జాతీయ రహదారి. దుత్తలూరు మీదుగా వెళ్లడంతో అక్కడి భూముల ధరకు రెక్కలొచ్చాయి.

రూ. 1కోటి స్థలం..  కబ్జాపర్వం!
సర్వే నెం.226/3లో చదును చేసిన ప్రభుత్వ భూమి

మహిళ పేరిట నకిలీ పట్టా సృష్టి

స్థలం చదును చేస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు

విషయం తెలిసినా కన్నెత్తిచూడని అధికారులు

దుత్తలూరు మండలం నందిపాడులో భూబాగోతం


ఉదయగిరి, మే 6 : అది ఏర్పేడు - నగిరేకల్‌ వరకు నిర్మించిన 565వ జాతీయ రహదారి. దుత్తలూరు మీదుగా వెళ్లడంతో అక్కడి భూముల ధరకు రెక్కలొచ్చాయి. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణం రెండవదశ పనులు ప్రారంభం కావడం ఈ ప్రాంత భూములకు మరింత డిమాండ్‌ పెరిగింది. దీంతో భూబకాసురుల కన్ను దుత్తలూరు మండలంపై పడింది. రూ.1కోటికిపైగా విలువ కలిగిన జాతీయ రహదారి పక్కనే ఉన్న భూములపై ఓ వ్యక్తి కన్ను పడింది. ఇతరుల పేరిట నకిలీ పట్టాను సృష్టించి యంత్రాలతో చదునుకు పూనుకోవడం, గ్రామస్థులు అడ్డుకోవడంతో ఈ భూబాగోతం వెలుగులోకి వచ్చింది.

నందిపాడు కూడలి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిపై ఓ వ్యక్తి కన్ను పడింది. సర్వే నెం.226/3లో 54 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు 1999లో ఓ మహిళ పేరుతో నకిలీ పట్టాను సృష్టించాడు. ఈ ప్రాంతంలో ఒక సెంటు స్థలం రూ.2లక్షలు పలుకుతోంది. అంటే మొత్తం ఆక్రమించేందుకు యత్నించిన స్థలం విలువ రూ.కోటికిపైగానే ఉంటుంది. ఇటీవల ఆ భూమిని యంత్రాలతో చదును చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అదే వ్యక్తి సమీపంలోని సర్వే నెం.228, 228/బి, 228/సిలోని మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమలేఅవుట్‌ వేసినట్లు  గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికిపోయినా మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఆయా భూములు రికార్డుల్లో సైతం ప్రభుత్వ భూములుగానే ఉండటంతో అందులో బోర్డులు సైతం ఏర్పాటు చేసినా అక్రమార్కులు లెక్కచేయకుండా బరితెగిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని  స్థానికులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-07T04:35:51+05:30 IST