సెటిల్మెంట్ల దందా

ABN , First Publish Date - 2022-06-08T05:14:31+05:30 IST

హిందూపురం దినదినాభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ భూములు కొనేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలవారు కూడా ఆసక్తి చూపుతుంటారు.

సెటిల్మెంట్ల దందా

వాలిపోతున్న కడప, కర్నూలు ముఠాలు

ఓ వర్గానికి మద్దతుగా వకాల్తా

పోలీసు స్టేషన్లలో నిత్యం పంచాయితీలు 

భూ యజమాని నుంచి పైసా వసూల్‌

హిందూపురం టౌన 

పట్టణంలో భూముల ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. దీనిని క్యాష్‌ చేసేందుకు కడప, కర్నూలు నుంచి గ్యాంగ్‌లు వాలిపోతున్నాయి. వివాదాలున్న భూములపై కన్నేస్తున్నారు. ఓ వర్గానికి మద్దతుగా వకాల్తా పుచ్చుకుని, పంచాయితీలు చేస్తున్నారు. ఇలా పోలీసు స్టేషన్లలో నిత్యం భూమి పంచాయితీలు సాగుతున్నాయన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆఖరుకు అర్థంలేని సెటిల్మెంట్‌ చేసి, భూమి అసలు యజమాని నుంచి సొమ్ము గుంజుతున్నారు. ఆ గ్యాంగ్‌లు, వారి వెనకున్న రాజకీయ పలుకుబడిన చూసి భయపడిన భూముల యజమానులు చేసేదిలేక వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. పురంలో ఈ తరహా సెటిల్మెంట్లు నిత్యం సాగుతున్నాయి. 

హిందూపురం దినదినాభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ భూములు కొనేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలవారు కూడా ఆసక్తి చూపుతుంటారు. స్థిరాస్థి వ్యాపారం కూడా అందుకు తగ్గట్టుగానే సాగుతుంటుంది. దీనిని ఆదాయ వనరుగా మలచుకునేందుకు రాజకీయ అండదండలున్నవారు ప్రభుత్వ భూములు సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. హిందూపురంతోపాటు రూరల్‌, లేపాక్షి, పరిగి మండలాల్లో కొందరు జన, రాజకీయ బలాలతో వివాదాల భూములే ఆర్థిక వనరులుగా సృష్టించి, దందాలకు పాల్పడుతున్నారు. 20 గజాల స్థలం నుంచి 20 కోట్ల భూముల వరకు కన్నేస్తున్నారు. కోర్టు వివాదంలో ఉన్న భూముల వ్యవహారంలో సైతం మూడో వ్యక్తి ప్రవేశించి, ఓవైపు వత్తాసు పలుకుతూ లేని ఇబ్బందులు సృష్టిస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమందికి భూమికి సంబంధించి సర్వహక్కులూ ఉన్నా.. ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇటీవల హిందూపురం టీచర్స్‌ కాలనీలో మూడుప్లాట్లను ఓ ఉద్యోగి కొన్నేళ్ల క్రితం అప్పటి ధరల ప్రకారం కొనుగోలు చేశాడు. అతడి పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఆయన కూడా బెంగళూరులో నివాసముంటున్నాడు. ఈ ప్లాట్లను అప్పుడప్పుడు వచ్చి చూసుకెళ్లేవారు. ఆ ప్లాట్లకు సంబంధించి హిందూపురంలో ఉన్న ఓ వ్యక్తితో కలిసి కర్నూలుకు చెందినవారు తమకు విక్రయించినట్లు అగ్రిమెంట్‌ సృష్టించారు. అసలుదారుడు వచ్చి చూసి కోర్టుకు వెళ్తానన్నారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇతర జిల్లా వ్యక్తి మద్యవర్థిగా రంగప్రవేశం చేశాడు. రూ.20లక్షలకు డీల్‌ కుదిర్చాడు. ఇందులో అగ్రిమెంట్‌ వేసుకున్న వ్యక్తి రూ.5 లక్షలు, ఇతర జిల్లా వ్యక్తి రూ.15లక్షలు తీసుకున్నాడు. ఇందులో వారిది ఏమీ లేకపోయినా విలువైన భూమి కావడంతో రూ.20లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.


వివాద భూములపై కన్ను

మోతుకపల్లి వద్ద ఎప్పుడో తాతల కాలంలో అమ్మిన భూమి కదిరి ప్రాంతానికి చెందిన కొందరు వారి వారసుల వద్ద అగ్రిమెంట్‌ వేయించుకున్నారు. ఇందులో వారికి భాగం వస్తుందని అందులో ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన వారు అభ్యంతరం తెలిపారు. అవతలి వ్యక్తులు అధికార పార్టీకి చెందినవారు కావడంతో చేసేదిలేక వారు అడిగినంతలో సగం సొమ్ము చెల్లించాల్సి వచ్చింది.

  కొట్నూరులో కూడా ఇలాంటి వ్యవహారాన్ని కర్నూలుకు చెందిన వ్యక్తి రూ.25లక్షలకు సెటిల్‌ చేసినట్లు అక్కడివారు చర్చించుకుంటున్నారు.

ముద్దిరెడ్డిపల్లి ప్రాంతంలో కొన్ని భూములు విలువైనవి కావడంతో ఇతర ప్రాంతాలకు చెందినవారు కన్నేశారు. వారు అడిగినంత ఇవ్వకపోతే నకిలీ అగ్రిమెంట్లతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. 1బి కూడా చేయాలని అధికారులను అడుగుతున్నారు. దీంతో చేసేదిలేక అసలైనవారు సొమ్ము చెల్లించుకోవాల్సి వస్తోంది. డీఆర్‌ కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.

రైల్వే రోడ్డు, బోయపేట, నింకంపల్లి, హౌసింగ్‌ బోర్డు ప్రాంతాల్లో సుమారు రూ.20కోట్లుపైగా విలువచేసే ఆస్తుల పంచాయితీలు ఇలాగే సాగుతున్నాయి.

పట్టణంలోని పోలీసు స్టేషనకు నిత్యం భూమికి సంబంధించిన కేసులు వెళ్తూనే ఉన్నాయి. కొంతమంది అధికారబలంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి, చక్కబెడుతున్నారు. తమకెందుకులేనని కొందరు కోర్టుకు వెళ్తున్నారు. ఇలా పోలీసుస్టేషనలో రోజుకో పంచాయితీ జరుగుతుందన్నది నగ్న సత్యం.


పురంలో కడప, కర్నూలు గ్యాంగ్‌లు

పట్టణంలో భూముల విలువ విపరీతంగా ఉండటంతో సునాయాసంగా డబ్బు సంపాదించవచ్చని జిల్లాలోని కొన్ని ప్రాంతాల వారితోపాటు కడప, కర్నూలుకు చెందిన గ్యాంగ్‌లు తరచూ హిందూపురానికి వచ్చి వెళ్తున్నాయి. వారు తాము ఫలానా వ్యక్తి బంధువులమని చెప్పుకుంటూ భూములపై కన్నేస్తున్నారు. ధర్మవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూముల సెటిల్మెంట్‌కు పట్టణంలో ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని, ఇక్కడే ఉన్నారు. అతడు రోజూ భూములు సెటిల్మెంట్లపైనే పోలీసులను సంప్రదిస్తున్నారని ఆ శాఖ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే భూములు సెటిల్మెంట్లు ఆగి, అసలైన హక్కుదారులకు న్యాయం చేకూరుతుంది.


ఫిర్యాదులు వస్తున్నాయి..

హిందూపురం పట్టణ పరిధిలో కొన్ని భూములకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో ప్రభుత్వ స్థలాలు కూడా ఉంటున్నాయి. వాటిని పరిశీలించి, చట్టపరంగా మా పరిధిలో ఉంటే న్యాయం చేస్తున్నాం. లేదంటే కేసు నమోదు చేస్తాం. మా పరిధిలోకి రానివాటిని కోర్టుకు వెళ్లమని సూచిస్తున్నాం.

- ఇస్మాయిల్‌, వనటౌన సీఐ



Updated Date - 2022-06-08T05:14:31+05:30 IST