అధికార పార్టీలో ‘భూ’కంపం

ABN , First Publish Date - 2020-08-14T14:18:56+05:30 IST

అధికార పార్టీలోని సీనియర్‌ నేత పేరు చెప్పి వివాదాస్పద భూమిని..

అధికార పార్టీలో ‘భూ’కంపం

సెటిల్‌మెంట్‌లో కొయ్య ప్రసాదరెడ్డికి మరికొందరి నేతల సహకారం

ఇద్దరు అధికారుల బదిలీకి ఈ వ్యవహారమే కారణమని ప్రచారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): అధికార పార్టీలోని సీనియర్‌ నేత పేరు చెప్పి వివాదాస్పద భూమిని చేజిక్కించుకునేందుకు యత్నించారనే అభియోగంపై వైసీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డిని అధిష్ఠానం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రసాదరెడ్డి వెనుక మరికొందరు వున్నట్టు చెబుతున్నారు.


ఆనందపురం మండలం గంగసాని అగ్రహారం వద్ద గల 103 ఎకరాల భూమిపై దేవదాయ శాఖకు, రాజమండ్రికి చెందిన కళ్యాణం వెంకటేశ్వరశాస్త్రికి నడుమ ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఆ వివాదం పరిష్కారంలో సహకరించాలంటూ కొయ్య ప్రసాదరెడ్డి, ఒక టీవీ ఛానెల్‌ విలేఖరి జిల్లా కలెక్టరేట్‌లో ఓ రెవెన్యూ అధికారిని కలిసినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత, ప్రభుత్వానికి అనుకూలంగా వుండే మీడియా ప్రతినిధి కలిసి రావడం...పైగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొనుగోలు చేయాలనుకుంటున్నారని చెప్పడంతో సదరు అధికారి కూడా సరేనన్నట్టు అధికార పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నారు.


రెవెన్యూ శాఖ  అధికారి సరేననడంతో కొయ్య ప్రసాదరెడ్డి నేరుగా భూమి వారసులుగా పేర్కొంటూ ఆర్డీవో కోర్టులో కేసు వేసిన కళ్యాణం వెంకటేశ్వరశాస్ర్తిని కలిసి వివాదం తాము పరిష్కరించుకుంటామని, తాము చెప్పిన ధరకు ఇచ్చేయాలని కోరినట్టు తెలిసింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఆ భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నందున మరో ఆలోచన చేయవద్దని, లేనిపక్షంలో భూమినే కోల్పోవాల్సి వుంటుందని బెదిరించారనేది అభియోగం. ఈ మేరకు వారు నేరుగా ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేయగా ఆయన దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఇంటెలిజెన్స్‌ అధికారులను ఆదేశించినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. వాస్తవమేనని అధికారులు నివేదిక ఇవ్వడంతో సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లగా, కొయ్య ప్రసాదరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, అతనికి సహకరించిన రెవెన్యూ ఉన్నతాధికారిని తక్షణం బదిలీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో సదరు రెవెన్యూ ఉన్నతాధికారిని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.


అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం వున్నప్పటికీ బాధ్యులపై చర్యలకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరించారంటూ పోలీస్‌ ఉన్నతాధికారి తీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సదరు పోలీస్‌ అధికారిని కూడా బదిలీ చేయాలని డీజీపీని ఆదేశించినట్టు తెలిసింది. కొయ్య ప్రసాదరెడ్డి భూదందా కారణంగా ఇద్దరు ప్రభుత్వ అధికారులపై బదిలీ వేటు పడినట్టయింది. అయితే ఈ సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో ప్రసాదరెడ్డి వెనుక ఇద్దరు, ముగ్గురు అధికార పార్టీ నేతలు, సానుభూతిపరులు వున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.


Updated Date - 2020-08-14T14:18:56+05:30 IST