Abn logo
Feb 22 2020 @ 03:39AM

ఇల్లెంత దూరం!

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఇప్పుడు ఉంటున్నది ఒకచోట! ఉగాదికి స్థలం ఇస్తామంటున్నది ఎక్కడో ఇంకో చోట! అదికూడా... ఇల్లు కట్టుకుంటామంటేనే స్థలం ఇస్తారట! లేదంటే... స్థలం లేదు! స్థలం తీసుకోవాలనుకుంటే... ఇప్పటిదాకా అలవాటుపడి, జీవనోపాధి దొరుకుతున్న ప్రదేశాన్ని వదిలిపెట్టాలి! అలాకాకుండా... పనిని, ఉపాధిని కాపాడుకోవాలంటే స్థలాన్ని వదులుకోవాలి! ఇది ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం పెట్టిన మెలిక! రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల... మరీ ముఖ్యంగా పట్టణాలు, నగర ప్రాంతాల్లో ప్రస్తుతం లబ్ధిదారులు ఉంటున్న చోటు నుంచి 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో స్థలాలు కేటాయిస్తున్నారు. ‘స్థలం ఇచ్చినచోట నివసిస్తాం’ అని లిఖితపూర్వక హామీ ఇస్తేనే ‘పట్టా ఇస్తాం’ అంటూ షరతులు పెడుతున్నారు. ఇక్కడ ఉండే తమకు ఎక్కడో స్థలాలు ఇస్తే ఏం చేసుకొంటామని పేదలు లబోదిబోమంటున్నారు.


ఇదీ గ్రామం లెక్క.. 

రెవెన్యూశాఖ లెక్కల ప్రకారం, 17,310 రెవెన్యూ గ్రామాలకు గాను 10,760 పల్లెల్లోనే ఇంటి స్థలాలకు అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉంది. 6182 మేజర్‌ పంచాయితీలు, వాటి ఆవాసాల్లో ప్రభుత్వం వద్ద సెంటు భూమి కూడా లేదని తేల్చింది. ఈ గ్రామాల్లో పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వాలంటే ప్రైవేటుగా భూమి సేకరించాలి. సహజంగా ఇంటిస్థలాలు ఇచ్చేందుకు గ్రామం వెంట ఉండే భూములను సేకరిస్తారు. లేదంటే కనీసం గ్రామానికి కొంత దూరంలో ఉన్న భూములను ఎంపిక చేస్తారు. దీని వల్ల కొత్తగా ఇచ్చే ఇళ్లకు, గ్రామానికి మధ్య దూరం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 


ఇదీ పట్టణం పరిస్థితి

రెవెన్యూశాఖ అంచనాల ప్రకారం, 110 నగరాలు, పురపాలక సంస్థల పరిధిలో 66 ప్రాంతాల్లోనే ఇంటిస్థలాలు, బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం వద్ద భూములున్నాయి. 44 పట్టణాలు, పురపాలక సంస్థల పరిధిలో సర్కారు వద్ద సెంటు భూమిలేదు. ఇక్కడ ప్రైవేటుగా భూమి సేకరించాలి. అన్ని పట్టణ ప్రాంతాల్లో  4,774 ఎకరాలు అవసరమని తేల్చారు. ఈ భూమిని సేకరించడానికి భారీగా ఖర్చవుతుందని చెప్పి, పట్టణాలకు దూరంగా ఉన్న గ్రామాల్లోనే ఈ లబ్ధిదారులకు ఇంటి స్థలాలు సర్దుబాటు చేయాలని రెవెన్యూ అధికారులకు అమరావతి నుంచి పలు మార్గదర్శకాలు వెళుతున్నాయి. అక్కడ ఉంటామంటేనే పట్టాలు ఇస్తామని పేదలకు షరతులు పెట్టడం ఈ వ్యవహారంలో అసలుట్విస్టు!


ఎందుకీ మెలిక?

పేదలకు తాము నివసిస్తున్న చోటకాకుండా మరో చోట ఎందుకు ఇంటిస్థలాలు కేటాయిస్తామంటున్నారు?  భూములు అందుబాటులో లేవా? లేక భూసేకరణ  చేయడం లేదా? ఇంటిస్థలాల విషయంలో సర్కారు తొలి నుంచి  నేలవిడిచిసాము చేయడమే ఈ పరిస్థితికి కారణమని ఈ ప్రశ్నలకు నిపుణులు సమాధానమిస్తున్నారు. ఒకేసారి 25 లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు ఇస్తామని సర్కారు గత ఏడాది ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, దాన్ని అమలు చేయడానికి రెవెన్యూశాఖ సమర్పించిన కార్యాచరణ నివేదిక మాత్రం ఆచరణలో తలకిందులైంది. పేదలందరికి భూములు ఇవ్వాలంటే ప్రభుత్వం వద్ద ఉన్న దానితోపాటు ప్రైవేటుగా 25వేల ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూశాఖ సర్కారుకు సిఫారసు చేసింది. ఇందుకోసం రూ. 14వేలకోట్లపైనే వ్యయం అవుతుందని నివేదించింది. ‘ఇంటిస్థలాలకోసం రూ. 14వేల కోట్లు అంటే భయపడతామా? పేదలకోసం ఆ మాత్రం ఖర్చుపెట్టలేమా?’ అంటూ అధికారుల నివేదికలపై చిర్రుబుర్రులాడిన సర్కారు పెద్దలు.. రానురాను ఆ జోరును తగ్గించారు. భారం తగ్గించుకోవాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని రెవెన్యూశాఖకు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఎక్కువగా ప్రభుత్వ భూములపై ఆధారపడాలని షరతు విధించింది. ఖరీదైన భూములు ముట్టుకోవద్దనేది అందులో మరో కండీషన్‌. ఎన్ని ప్రయత్నాలు చేసినా భూమి సమకూరడం లేదు. మరోవైపు లబ్ధిదారుల టార్గెట్‌ భారీగానే ఉంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇస్తామన్న సెంటున్నర భూమి కాస్తా సెంటుకు మార్చారు. అది కూడా అందుబాటులో లేకుంటే, జీప్లస్‌3, జీప్లస్‌5 కింద ప్లాట్‌లు ఇస్తామన్నారు. వాటికి కూఢా భూమి దొరకడం లేదు. అంటే, పట్టణాల్లో ప్రైవేటు భూములు లేకపోలేదు. ఖరీదైన వాటిని భూసేకరణ కింద తీసుకోలేకనే..  సర్దుబాటు వ్యవహారాలు తెరమీదకు తీసుకొస్తున్నారు.


విజయవాడకు చెందిన వెంకటరావు నిరుపేద కూలీ. కాలువగట్టుమీద గుడిసెలో నివసిస్తున్నాడు. ఉగాదికి ఇచ్చే స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు అమరావతి ఏరియాలో ఇంటిస్థలం ఇస్తామని కబురొచ్చింది. ఎక్కడ విజయవాడ? ఎక్కడ అమరావతి? విజయవాడలో పనిచేసుకొనే పేదవాడు అమరావతిలో ఏం చేయాలి?


తిరుపతి పట్టణంలో రోజూకూలీగా పనిచేస్తున్న వెంకటప్పకు సొంత ఇల్లు లేదు. తిరుపతి రైల్వేస్టేషన్‌కు దూరంగా ఓ గుడిసెలో ఉంటున్నాడు. ఆయనకు తిరుపతి రూరల్‌ మండలంలో ఇంటిస్థలం చూపించారు. అది ఆయన నివాసానికి 18 కిలోమీటర్లు దూరంలో ఉంది. తిరుపతికి వెళ్లి పనిచేసుకొని తిరిగి రావాలంటే రోజూ 36 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే!


ఊరొదిలి..


విశాఖ జిల్లాలో 2.2 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో 1.78 లక్షల మంది నగరంలోనే ఉన్నారు. సగటున 20 నుంచి 45 కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇచ్చారు. గతంలో కేవలం పది కిలోమీటర్ల దూరంలో గృహాలు నిర్మించి ఇస్తేనే లబ్ధిదారులు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఎక్కడెక్కడో ఇస్తామంటే వెళ్లబోమని ఇప్పుడూ స్పష్టం చేస్తున్నారు.


కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం, అల్లీనగరం, శ్రీ నగరం గ్రామాల్లోని లబ్ధిదారులకు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోని ఎమ్‌.తిమ్మాపురంలో పట్టాలు కేటాయించారు. అది కూడా రహదారి వసతి లేని చోట! ఇదే జిల్లా గోకవరం గ్రామ లబ్ధిదారులకు ఏడు కిలోమీటర్ల దూరంలోని కొత్తపల్లిలో ఇంటిస్థలాలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. స్థలం కోసం ఉన్న ఊరిని, ఉపాధి అవకాశాలను వదిలి వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.


కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలో 2001లో టీడీపీ హయాంలో 83 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలను కేటాయించారు. 2012లో కాంగ్రెస్‌ హయాంలో ఆ పట్టాలను రద్దు చేసి ఒక్కొక్కరికి 1.5 సెంట్లు చొప్పున 168 మందికి మరోసారి పంపిణీ చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ పట్టాలను మళ్లీ రద్దు చేసి ఒక్కో లబ్ధిదారుడికి సెంటు స్థలం చొప్పున పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.  


పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు 12 కిలోమీటర్ల దూరంలోవున్న తాడువాయి పంచాయతీ పరిధిలోని చల్లావారిగూడెం స్థలం కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకోసం సేకరించిన స్థలంలోనే 22 ఎకరాలను వీరికి ఇస్తున్నారు.


విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ప్రభుత్వానికి చెందిన విలువైన సుమారు రెండు ఎకరాల భూమిని ఇదే మండలంలోని ఓఎల్‌ పురం గ్రామస్థులకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు లేఅవుట్‌ వేసి సిద్ధం చేశారు. కానీ... చెట్టుపల్లి పంచాయతీకి చెందిన 295 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పంచాయతీ కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతాన్ని గుర్తించారు. తమ గ్రామ పరిధిలోని విలువైన స్థలాన్ని మరో ఊరి వాళ్లకు ఇచ్చి... తమకు మాత్రం ఎక్కడో ఇస్తారా అని చెట్టుపల్లి పేదలు ప్రశ్నిస్తున్నారు. 


గుంటూరు జిల్లాలో అచ్చంపేట, పెదపాలెం, చిగురుపాడు, కస్తల గ్రామాలకు చెందిన 693 మంది లబ్ధిదారులకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఎంపిక చేశారు. 


తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో నివేశన స్థలాల లబ్ధిదారుల కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి మండల పరిధిలోని నవులూరు గ్రామంలో స్థలాలు కేటాయించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తాడేపల్లికి చెందిన పేదలు నిత్యం విజయవాడకు వెళ్లి, రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారే ఎక్కువ. ప్రస్తుతం తమకు కేటాయిస్తున్న స్థలాల నుంచి జీవనోపాధికి విజయవాడ వెళ్లడం దూరాభారంగా మారుతుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


గుంటూరు నగరంలో నివసించే పేదలకు పది కిలోమీటర్ల దూరంలోని వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జీ+3 భవనాలు కట్టించి ఇచ్చేందుకు భూసేకరణ తలపెట్టారు.

 దుగ్గిరాల మండలంలోని 1700 మందికి రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థలాలు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు లబ్ధిదారులు అంగీకరించక పోవడంతో... ఇవి తీసుకోకపోతే ఇక ఎక్కడా స్థలం రాదని వారిని అధికారులు బెదిరిస్తున్నారు.


చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొత్తపల్ల్లె పంచాయతీ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆరు కిలోమీటర్ల దూరంలోని వలసపల్లె పంచాయతీలో పది ఎకరాలు గుర్తించారు. ఆ భూమిలో సమాధులున్నాయి. వాటిని మినహాయించి మిగిలిన భూమిని లే అవుట్‌గా మార్చేశారు. 


కడప జిల్లా రాయచోటి పట్టణ లబ్ధిదారులకు ఆరు కిలోమీటర్ల దూరంలో సంబేపల్లె మండలం ముద్దినేనివాండ్లపల్ల్లె వద్ద స్థలాలు కేటాయిస్తున్నారు. అంత దూరం వెళ్లలేమని, పట్టణానికి ఆనుకోని భూ సేకరణ చేసి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement
Advertisement