రూ.250 కోట్ల భూ బాగోతం

ABN , First Publish Date - 2022-08-09T07:20:53+05:30 IST

ఇది చాలా విచిత్రమైన భూ వివాదం. లంచం అడిగారని హౌసింగ్‌ సొసైటీ పెద్దలు నేరుగా సింహాచలం దేవస్థానం ఈఓపై ఫిర్యాదు చేశారు.

రూ.250 కోట్ల భూ బాగోతం
మధుసూదన్‌ నగర్‌ సమీపాన భూములను చదును చేస్తున్న సొసైటీ మనుషులు. అడ్డుకోవడానికి వచ్చిన దేవదాయశాఖ సిబ్బంది (పైల్‌ ఫొటో)

కైలాసపురంలో 13.5 ఎకరాలపై ఎప్పటినుంచో వివాదం

తాము కొనుగోలు చేశామంటున్న మాధవ్‌ హిల్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌

ఆ భూమి తమదంటున్న సింహాచలం దేవస్థానం

న్యాయస్థానంలో కేసు

స్టేటస్‌ కో ఉన్నా చదును చేయడం ప్రారంభించిన అసోసియేషన్‌

అడ్డుకున్న అధికారులు

లంచం అడిగారంటూ ఈఓ సహా పలువురిపై సంస్థ సెక్రటరీ ఫిర్యాదు

ఆర్‌జేసీ విచారణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఇది చాలా విచిత్రమైన భూ వివాదం. లంచం అడిగారని హౌసింగ్‌ సొసైటీ పెద్దలు నేరుగా సింహాచలం దేవస్థానం ఈఓపై ఫిర్యాదు చేశారు. ఎవరిది తప్పో తేల్చడానికి దేవదాయ శాఖ పెద్దలు రంగంలోకి దిగారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమి కథ ఇది.

నగరంలోని కైలాసపురం డీఎల్‌బీ క్వార్టర్స్‌ సమీపానున్న మధుసూదన్‌ నగర్‌లో సర్వే నంబర్లు 289/పి, 290/పి, 291/పిలో 13.5 ఎకరాలు తాము కొనుగోలు చేశామని మాధవ్‌ హిల్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ చాలాకాలంగా క్లెయిమ్‌ చేస్తోంది. ఈ భూమి తమదని సింహాచలం దేవస్థానం చెబుతోంది. దీనిపై ఇరువర్గాల మధ్య  కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు స్టే మంజూరుచేసింది. ఆ ప్రకారం అందులో ఎవరూ ఎటువంటి పనులు చేపట్టకూడదు. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం రూ.250 కోట్లు. ఇదిలావుండగా, కొద్దినెలల క్రితం ఆ భూములను చదును చేయడానికి సొసైటీ ప్రతినిధులు జేసీబీలు తీసుకువెళ్లారు. పిచ్చిమొక్కలు తొలగించి, చాలావరకు లెవెల్‌ చేశారు. స్థానికులు ఈ విషయాన్ని దేవస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో భూ పరిరక్షణ విభాగం గార్డులతో సహా వచ్చి, అక్కడి పనులను అడ్డుకున్నారు. కోర్టు స్టే వున్నందున పనులు చేపట్టకూడదని స్పష్టంచేశారు. ఇక్కడే ఈ కేసు మలుపు తిరిగింది. కోర్టులో స్టే ఉండగా, సొసైటీ ప్రతినిధులు అందులో ప్రవేశించి పనులు చేపట్టినందున...దేవస్థానం అధికారులు కోర్టు ఉల్లంఘన కేసు వేయాల్సి ఉంది. ఈ విషయంలో జాప్యం జరిగింది. ఇందుకు ఈఓ కింద పనిచేసే ఇద్దరు అధికారులు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారే సొసైటీకి మేలు చేసేందుకు పైకి నివేదిక పంపడంలో జాప్యం చేశారని సమాచారం. అయితే ఏమి జరిగిందో తెలియదు గానీ, ఈ భూ వివాదంలో తమకు అనుకూలంగా వ్యవహరించడానికి ఈఓ సూర్యకళ రూ.28 లక్షలు లంచం డిమాండ్‌ చేశారంటూ సొసైటీ కార్యదర్శి ఆర్‌.వెంకటేశ్వరరావు నేరుగా దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌కు ఫిర్యాదుచేశారు. ఇక్కడి నుంచి ఈఓ సూర్యకళకు బదిలీ అయిపోయిన తరువాత...దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్‌జేసీ) సురేశ్‌బాబును కమిషనర్‌ ఆదేశించారు. ఆ మేరకు ఆర్‌జేసీ సోమవారం విశాఖపట్నం వచ్చి టర్నర్‌ చౌలీ్ట్రలో విచారణ చేపట్టారు. ఆయనతో పాటు దేవదాయ భూముల రక్షణ అధికారి విజయరాజు, తహసీల్దార్‌ శిరీష దేవిలు సొసైటీ కార్యదర్శిని పిలిచి విచారించారు. ఈఓ సూర్యకళ లంచం అడిగారని చెప్పడానికి ఆధారాలు ఏమిటో చూపించాలని కోరారు. అయితే ఆయన ఎటువంటి ఆధారం చూపించలేకపోయారు. మరో అవకాశం ఇస్తున్నామని, చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు తీసుకురావాలని ఆయనకు ఆర్‌జీసీ సూచించారు. 


ఇద్దరు ఈఓలను విచారిస్తాం: సురేశ్‌బాబు, ఆర్‌జేసీ

ఈ భూ వివాదంపై వచ్చిన ఆరోపణలపై విచారించాము. కార్యదర్శి ఆధారాలు చూపించలేకపోయారు. గడువు ఇచ్చాము. అయితే వివాదం చెలరేగిన తరువాత దానిపై దేవస్థానం తీసుకున్న చర్యలను పేర్కొంటూ కమిషనర్‌కు నివేదిక పంపాల్సి ఉంటుంది. ఆ విషయంలో తీవ్రమైన జాప్యం జరిగింది. దానికి కారణాలు ఏమిటో తెలియాల్సి ఉంది. ఈ ఆరోపణపై పాత ఈఓ సూర్యకళతో పాటు ప్రస్తుత ఈఓ భ్రమరాంబను కూడా విచారిస్తాం. ఆ భూములపై కోర్టులో వివాదం వున్నందున తీర్పు వచ్చేంత వరకు ఇరువర్గాలు సంయమనం పాటించాల్సి ఉంది. స్టేటస్‌ కోను సొసైటీ గౌరవించాలి. ఈలోగా అందులో ప్రవేశించడానికి వీల్లేదు. అక్కడ ఏమైనా నిర్మాణాలు జరిగితే దానికి దేవస్థానమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-08-09T07:20:53+05:30 IST