దర్జాగా భూకబ్జా

ABN , First Publish Date - 2022-05-22T06:52:14+05:30 IST

పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు రూ.కోట్ల విలువైన భూమికి ఎసరు పెట్టాడు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు తమవంతు తోడ్పాటునిస్తున్నారు.

దర్జాగా భూకబ్జా
హెల్త్‌సెంటర్‌కు కేటాయించిన స్థలంలో చేపడుతున్న నిర్మాణాలు

హెల్త్‌ సెంటర్‌ పేరిట వైసీపీ నాయకుడి స్వాహా

చోద్యం చూస్తున్న రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు

గుత్తి, మే 21: పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు రూ.కోట్ల విలువైన భూమికి ఎసరు పెట్టాడు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు తమవంతు తోడ్పాటునిస్తున్నారు. తాడిపత్రి రోడ్డు జగనన్న కాలనీ సమీపంలో అర్బన హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి 29 సెంట్ల స్థలాన్ని  కేటాయించారు. కొత్తపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 727లో మున్సిపల్‌ శాఖ వినతి మేరకు ఈ స్థలాన్ని ఇచ్చారు. భవన నిర్మాణ పనుల సబ్‌ కాంట్రాక్టర్‌ పొందిన ఓ కౌన్సిలర్‌ సోదరుడు కొండ ప్రాంతాన్ని చదును చేయిస్తున్నాడు. దీనికోసం భారీ యంత్రాలను వినియోగించాడు. కేటాయించింది 29 సెంట్లుకాగా, చుట్టుపక్కల ఉన్న కొండలు, గుట్టలను యంత్రాలతో తొలగించి ఆక్రమించడానికి సిద్ధమయ్యాడు. తొలగించిన బండరాళ్లు, మట్టిని పట్టణానికి దూరంగా తరలించాల్సి ఉండగా, సమీపంలోని చాకలి కుంటలో వేసి, పూడ్చడానికి ప్రయత్నించాడు. ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళన చేయడంతో మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కుంటను వదిలి, అర్బనహెల్త్‌ సెంటర్‌ పక్కన ఉన్న స్థలంపై కన్నేశాడు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో గుట్టను తొలగిస్తున్నాడు. ఈ ప్రాంతంలో సెంటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతోంది. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే రెండు ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండా కొండలను  పేల్చేందుకు జిలెటిన స్టిక్స్‌ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1.5 ఎకరాలను చదును చేశాడు. ఈ విషయంపై తహసీల్దారు మహబూబ్‌ బాషాను వివరణ కోరగా, భూ కబ్జా విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-05-22T06:52:14+05:30 IST