అనుమతి లేని నిమ్జ్‌కు భూములెందుకు?

ABN , First Publish Date - 2021-10-19T05:02:36+05:30 IST

రాష్ట్రంలో పేదల భూములను లాక్కుని రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుమతి లేని నిమ్జ్‌కు భూములెందుకు?
కలెక్టరేట్‌ వద్ద రైతుల ధర్నాలో మాట్లాడుతున్న కోదండరామ్‌

 ప్రభుత్వం తీరుపై మండిపడ్డ కోదండరామ్‌

 సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద భూములు కోల్పోయిన రైతుల ధర్నా  

ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి, అక్టోబరు 18: రాష్ట్రంలో పేదల భూములను లాక్కుని రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జహీరాబాద్‌ ప్రాంతంలోని నిమ్జ్‌ కోసం భూములను కోల్పోయిన రైతులు సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద సోమవారం చేపట్టిన ధర్నాలో కోదండరామ్‌ పాల్గొని రైతులకు మద్ధతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్‌ ప్రాంతంలో కేంద్రప్రభుత్వం అనుమతి లేని నిమ్జ్‌ కోసం రైతుల భూములను ఎలా గుంజుకుంటారని ప్రశ్నించారు. వెంటనే నిమ్జ్‌ భూసేకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. భూములను కోల్పోయిన రైతులందరికీ న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించే వరకూ పోరాడుతామన్నారు. భూసేకరణలో ఏ ఒక్క టీఆర్‌ఎస్‌ నాయకుడి భూమి పోలేదని, చిన్న, సన్నకారు రైతుల భూములను మాత్రమే లాక్కుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నెలకొల్పినా పేదల భూములే లాక్కుంటున్నారని మండిపడ్డారు. పేదల భూములను లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ, ప్రభుత్వం దళారీలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నిమ్జ్‌లో భూములు పోతున్నాయనే మనోవేదనతో ఇటీవల మోహన్‌రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములను గుంజుకుంటే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. భూములు కోల్పోతున్న రైతులతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడి ఉద్యమాన్ని నీరుగార్చవద్దన్నారు. రాష్ట్రంలో రైతులకు న్యాయం జరగకపోతే ఢిల్లీదాకా వెళ్లి న్యాయం సాధించుకుంటామని తెలిపారు. పోలీసులు రైతులకు సహకరించాలని కోదండరామ్‌ కోరారు. మా పంచాయతీ పోలీసులతో కాదని, ప్రభుత్వంతోనే అని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ మెయిన్‌ గేట్‌ వద్ద రైతులతో కలిసి జొన్న రొట్టే తింటూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  

Updated Date - 2021-10-19T05:02:36+05:30 IST