తూర్పు కొండల్లో.. భూ వివాదం!

ABN , First Publish Date - 2022-01-22T04:55:17+05:30 IST

తూర్పు కొండల్లో భూవివాదం రాజుకుంటోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. నేతల పరస్పర ఆరోపణలు, సవాళ్లతో వేడి రాజుకుంటోంది. ఎప్పుడో ఐదు దశాబ్దాల కిందట గిరిజనులకు కేటాయించిన డీ పట్టా భూములు ప్రైవేటు వ్యక్తికి లీజుకివ్వడమే ఈ వివాదానికి కారణం. దీని వెనుక రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజు ఉన్నారన్న పరోక్ష ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు.

తూర్పు కొండల్లో..  భూ వివాదం!
వివాదానికి కారణమైన భూములివే..


గిరిజనులు భూములు లీజులకివ్వడమే కారణం

నీటి సదుపాయం లేకే ఇచ్చామంటున్న లబ్ధిదారులు

రాజకీయరంగు పులుముకుంటున్న వైనం

(జియ్యమ్మవలస) 

తూర్పు కొండల్లో భూవివాదం రాజుకుంటోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. నేతల పరస్పర ఆరోపణలు, సవాళ్లతో వేడి రాజుకుంటోంది. ఎప్పుడో ఐదు దశాబ్దాల కిందట గిరిజనులకు కేటాయించిన డీ పట్టా భూములు ప్రైవేటు వ్యక్తికి లీజుకివ్వడమే ఈ వివాదానికి కారణం. దీని వెనుక రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజు ఉన్నారన్న పరోక్ష ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ‘తూర్పు కొండలు’ చర్చనీయాంశమవుతున్నాయి. దీనిపై లోతైన చర్చ నడుస్తోంది. అర్నాడ రెవెన్యూ పరిధిలో వనజ, బిల్లమానుగూడ, అర్నాడ, తుమ్మగూడ, కొత్తగూడ గ్రామాలు ఉన్నాయి. తూర్పు కొండలుగా పిలవబడే ఈ గ్రామాల్లో 301 సర్వే నెంబర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1988.96 ఎకరాల భూమి ఉంది. ఇందులో జిరాయితీ భూమి 1226.19 ఎకరాలు కాగా.... 762.77 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.  1972-73లో ఈ ప్రాంత గిరిజనులు సాగుచేసుకునేందుకు ప్రభుత్వ భూమిని డీ పట్టా కింద అందించారు. కొద్దికాలం పాటు సాగుచేసిన గిరిజనులు ఆ భూములను విడిచిపెట్టారు. నీటి సదుపాయం లేకపోవడం, పెట్టుబడులు కూడా రాకపోవడమే ఇందుకు కారణం. ఏళ్ల తరబడి ఖాళీగా వదిలేయడంతో ఆ భూములు అడవుల్లా తయారయ్యాయి.  తుమ్మిగూడ సర్వే నెంబరు 110లో 126 ఎకరాలు అటుంచితే, బిల్లమానుగూడ గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 200, 201/6లో ఉన్న 611 ఎకరాలు ప్రస్తుత వివాదానికి కారణమయ్యాయి. ఈ సర్వే నెంబర్లలో 250 ఎకరాల్లో నీలగిరి తోట వేయడమే వివాదానికి ప్రధాన కారణం. గిరిజనులకు ఏడాదికి రూ.2 వేలు ఇస్తామని ఆశచూపి ఒక ప్రైవేటు వ్యక్తి రాయించుకొని మోసం చేశారని.. దీనికి అక్కడ జేఏసీ ప్రతినిధిగా ఉన్న నిమ్మక జయరాజు కారణమన్నది ఆరోపణ. దీనిపై కొంతమంది గిరిజనులు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని కలవడం, ఆమె విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమకు కేటాయించిన భూములకు నీటి సదుపాయం లేదని... అందుకే తాత్కాలికంగా నోటి మాట ద్వారా లీజుకు ఇచ్చామని..లిఖితపూర్వకంగా ప్రైవేటు వ్యక్తికి ఇవ్వలేదని కొంతమంది చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఎవరు ఇచ్చినా వారికి తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. మొత్తానికి ఈ వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి ముదురుతోంది. 


 సత్వర విచారణ చేయాలి

ప్రభుత్వం స్పందించి నిజాలను నిగ్గుతేల్చాలి. భూ వివాదం సత్వర దర్యాప్తునకు ఆదేశించాలి. దీని వెనుక ఎవరున్నారు? బాధ్యులెవరు? అన్నది బయటపెట్టాలి. అవసరమైతే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో కమిటీ వేసి విచారించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిరాధార ఆరోపణలు తగవు.

-నిమ్మక జయరాజు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు


 టాస్క్‌ ఫోర్స్‌ అవసరం

అర్నాడ రెవెన్యూ పరిధిలో పూర్తిస్థాయిలో సర్వే చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ అవసరం. ప్రభుత్వం చేపడుతున్న రీసర్వేలో ఈ అంశం తేలనుంది. ప్రస్తుతం ఈ భూములకు హద్దులు లేవు. ఎంతమందికి ఇక్కడ డీ పట్టాలు ఇచ్చారో వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. 

- జి.శ్రీరామ్మూర్తి, తహసీల్దార్‌, జియ్యమ్మవలస



Updated Date - 2022-01-22T04:55:17+05:30 IST