కొత్తపారసంబలో భూ వివాదం

ABN , First Publish Date - 2021-01-18T05:17:19+05:30 IST

కొత్త పారసంబలో గ్రామకంఠం భూమి వివాదాస్పదంగా మారింది. గ్రామంలో సర్వే నంబర్‌ 176/5లో ఉన్న స్థలం గ్రామ అవసరాలకు వినియోగిస్తున్నారు.

కొత్తపారసంబలో భూ వివాదం
వివాదాస్పద స్థలంలో గుమిగూడిన గ్రామస్థులు

  వివాదాస్పద స్థలంలో కంచే వేసే ప్రయత్నం

  అడ్డుకున్న గ్రామస్థులు

కాశీబుగ్గ, జనవరి 17: కొత్త పారసంబలో గ్రామకంఠం భూమి వివాదాస్పదంగా మారింది. గ్రామంలో సర్వే నంబర్‌ 176/5లో ఉన్న స్థలం గ్రామ అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే ఆ స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తమకు మంజూరు చేసిందంటూ రోణంకి అప్పారావు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అదే స్థలంలో ఆదివారం మొక్కలు నాటుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామ అవసరాల కోసం చదును చేసిన స్థలంలో మొక్కలు ఎలా నాటుతారంటూ ప్రశ్నించారు. దీంతో కొద్దిపాటి వివాదం రేగింది. అదే స్థలంలో గ్రామస్థులు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. సీఐ శంకరరావు ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. సమస్యను రెవెన్యూ అధికారుల సమక్షంలో తేల్చుకోవాలని సూచించారు. ఈ స్థలానికి సంబంధించి కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన కుమారుడు, కుమార్తె పేరిట ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని రోణంకి అప్పారావు చెబుతున్నారు. అందుకు సంబంధించి ధ్రువపత్రాలు తమ వద్ద ఉన్నాయని.. స్థలానికి సంబంధించి పన్నులు సైతం మునిసిపాల్టీకి కడుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు. అది గ్రామకంఠం భూమి అని.. అప్పారావు కుటుంబసభ్యులు తప్పుడు ధ్రువపత్రాలు చూపించి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వివాహం జరిగిన వేరే గ్రామంలో ఉంటున్న కుమార్తె పేరిట స్థలం మంజూరు నిబంధనలకు విరుద్ధమంటున్నారు. కాగా రెండేళ్ల కిందట ఇదే స్థలంపై వివాదం చోటుచేసుకోగా గ్రామస్థులు ఆ ప్రాంతాన్ని చదునుచేసి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. కొన్నేళ్ల కిందట విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. అప్పట్లో అధికారులు, గ్రామపెద్దల చొరవతో వివాదం సద్దుమణిగింది. తాజాగా అదే స్థలం చుట్టూ ఆదివారం కంచె వేసి మొక్కలు నాటుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీనిపై సమగ్ర సర్వే చేసి గ్రామకంఠం భూమిని పరిరక్షించాలని అధికారులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగతామని స్పష్టం చేస్తున్నారు.

 

 


Updated Date - 2021-01-18T05:17:19+05:30 IST