Abn logo
Sep 19 2021 @ 00:50AM

రూ.8 కోట్ల విలువైన స్థలం.. కేవలం రూ.16 లక్షలకే..!

ఆప్సర్‌ థియేటర్‌ దగ్గరలోని భవనం

భూ మంత్రం

రూ.15 కోట్ల విలువైన దేవదాయ స్థలంపై భూచ్‌ బాబుల కన్ను

మంత్రి పేషీ అడ్డాగా అక్రమ దోపిడీకి యత్నం

తెరపై కాశీరావు.. తెరవెనుక బుజ్జిబాబు

ఎన్‌వోసీ ఇప్పించి సగం కొట్టేసేందుకు ఎత్తులు

బెడిసికొట్టడంతో మరో వ్యూహం

రూ.8 కోట్ల విలువైన భవనానికి టెండర్‌

వన్‌టౌన్‌ పోలీసుల సహకారం


(విజయవాడ- ఆంధ్రజ్యోతి): రూ.8 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.16 లక్షలకు పొందాలనుకోవడం ఎక్కడైనా విన్నామా.. ఒకేఒక్క అగ్రిమెంట్‌ సాయంతో రిజిస్ట్రేషన్‌ చేయించేసుకోవాలనుకోవడం ఎప్పుడైనా చూశామా.. అసలువారికి న్యాయం చేయకుండా, అవినీతిపరులకు అండగా నిలుస్తున్న పోలీసుల తీరును కన్నామా.. నగరంలో జరుగుతున్న నయా ఘరానా మోసం ఇది. సాక్షాత్తూ మంత్రి అనుచరులే ఈ వివాదంలో కీలక పాత్రధారులు కావడం, తమ పరిధిలోకి రాకపోయినా పోలీసులు అత్యుత్సాహంతో సివిల్‌ సెటిల్‌మెంట్‌ చేస్తుండటం.. ఇంత జరుగుతున్నా పోలీస్‌ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.


దేవదాయ శాఖకు విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో సర్వే నెంబర్లు 161/1, 161/2, 161/3లో 5.10 ఎకరాల భూమి ఉంది. దీని విలువ రూ.15 కోట్ల పైమాటే. ఈ భూమి భోగవల్లి ట్రస్టు ద్వారా దేవదాయ శాఖకు సంక్రమించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే, ఏలూరు రోడ్డులోని అప్సర థియేటర్‌ సమీపంలో భోగవల్లి కుటుంబీకులకు సుమారు రూ.8 కోట్ల విలువైన స్థలం, అందులో పురాతన భవనం ఉంది. కొద్దిరోజుల క్రితం భోగవల్లి కుటుంబీకులను మంత్రికి అత్యంత సన్నిహితుడైన ఓ ‘బుజ్జి’బాబు కలిశాడు. జక్కంపూడిలోని 5.10 ఎకరాలకు ఎన్‌వోసీ ఇప్పిస్తానని, పొలంలో సగం తనకు ఇవ్వాలని బేరం పెట్టాడు. దీనికి వారు అంగీకరించారు. ముందు జాగ్రత్తగా భోగవల్లి కుటుంబీకులు జక్కంపూడిలోని సర్వే నెంబరు 161/2లోని 2.77 ఎకరాలు తమకు విక్రయించేందుకు అంగీకరించినట్లు బుజ్జిబాబు అగ్రిమెంట్‌ రాయించుకున్నాడు. మంత్రి ఓఎస్‌డీ (ఆఫీసర్‌ ఆఫ్‌ స్పెషల్‌ డ్యూటీ)కి సన్నిహితుడైన నర్రా రవికిరణ్‌ పేరుతో ఈ అగ్రిమెంట్‌ జరిగింది.


తెరవెనుక పెద్దవారు ఉండటంతోనే దేవదాయ స్థలాన్ని అగ్రిమెంట్‌ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జక్కంపూడిలోని స్థలం తమ పూర్వీకులదని, దానికి ఎన్‌వోసీ ఇప్పించాల్సిందిగా భోగవల్లి కుటుంబీకుల నుంచి ఓ దరఖాస్తు దేవదాయ శాఖకు పంపారు. అయితే, ఎన్‌వోసీ లభించలేదు. దీంతో బుజ్జిబాబు మళ్లీ భోగవల్లి కుటుంబీకులను కలిసి ఎన్‌వోసీ కోసం తాను సుమారు రూ.50 లక్షలు ఖర్చు పెట్టానని, ఆ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా మెలికపెట్టాడు. ఒత్తిళ్లు తీసుకురావడంతో భోగవల్లి కుటుంబీకులు తమ వద్ద అంత డబ్బు లేదని, అప్సర థియేటర్‌ సమీపంలోని స్థలాన్ని విక్రయిస్తామని చెప్పారు. సుమారు రూ.8 కోట్ల స్థలాన్ని బుజ్జిబాబు అండ్‌ కో కేవలం రూ.కోటికి కొనేందుకు సిద్ధమైంది. సుమారు రూ.16 లక్షలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం మంత్రి ఓఎస్‌డీ మామ అయిన కాశీరావు పేరుతో జరిగింది.


ఆ తర్వాత బుజ్జిబాబు అండ్‌ కో మనసు మారింది. రూ.16 లక్షలకే స్థలాన్ని కొట్టేయాలని నిర్ణయించుకుని పోలీసులను రంగంలోకి దింపాడు. భోగవల్లి కుటుంబీకుడు చైతన్యను పోలీసు స్టేషన్‌కు పిలిపించి రిజిస్ర్టేషన్‌ చేసేలా ఒత్తిడి చేశారు. విషయం బయటకు పొక్కడానికి గతంలో మంత్రి వద్ద, ప్రస్తుతం వీఎంసీలో పీఆర్వోగా పనిచేస్తున్న బొమ్మాల శ్రీనివాసరావు కారణంగా భావించి అతనిపై పోలీసు కేసు పెట్టించారు. 


ఆగని వేధింపులు

పోలీసుల నుంచి భోగవల్లి కుటుంబీకులకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సివిల్‌ వివాదంలో తలదూర్చడమే కాకుండా పోలీసులే వేధింపులకు పాల్పడటంపై ఆ కుటుంబీకులు తమ కులపెద్దలను ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. సుమారు రూ.15కోట్ల విలువైన దేవదాయశాఖ స్థలాన్ని చేజిక్కించుకునే వ్యవహారం మంత్రికి తెలియకుండా జరుగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రమేయంతోనే పోలీసులు సైతం సివిల్‌ సెటిల్‌మెంటుకు తెగించారన్న వాదనా వినిపిస్తోంది. 


పీఆర్వోపై వేటు

చిట్టినగర్‌ : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ప్రజాసంబంధాల అధికారిగా వ్యవహరిస్తున్న బొమ్మాల శ్రీనివాసరావుపై అధికారులు వేటు వేశారు. పీఆర్వో పదవి నుంచి తొలగిస్తున్నట్టు కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ శనివారం రాత్రి తెలిపారు. ఓ భవన విక్రయం విషయంలో శ్రీనివాసరావు రెండు పార్టీలను మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కారణంగానే ఆయన్ను పీఆర్వో పదవి నుంచి తొలగించారని తెలుస్తోంది. 


దేవదాయ స్థలాన్ని అమ్మకానికి పెట్టినట్టు చూపిస్తున్న అగ్రిమెంట్‌


జక్కంపూడిలోని దేవదాయ శాఖ స్థలం