పచ్చటి పొలాలపై పడగ..!

ABN , First Publish Date - 2022-05-16T06:29:24+05:30 IST

పచ్చటి పొలాలపై పడగ..!

పచ్చటి పొలాలపై పడగ..!
చిన్నాపురం ఆయకట్టు పరిధిలో చేపల చెరువు తవ్వకం

బందరు మండలంలోని వరి పొలాల్లో చేపల చెరువుల తవ్వకాలు

అసైన్డ్‌ భూముల్లో బడాబాబుల పాగా

రెవెన్యూ అధికారులకు భారీగా మామూళ్లు

పంటలు పండవని ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన రైతులు

అయినా ఆగని అక్రమార్కులు


అధికారం అడ్డుంది కదా.. అని అడ్డదిడ్డంగా తవ్వడం, అధికారుల అండుంది కదా.. అని అడ్డగోలుగా వ్యవహరించడం బందరు మండలంలోని అక్రమార్కులకు అలవాటైపోయింది. ఇంకేముంది.. ఏడాదికి రెండు పంటలు పండే భూముల పక్కనే కాదు.. డ్రెయిన్లనూ ఆక్రమించేసి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. రైతుల ఉసురు తీస్తున్నారు. లంచాలకు అలవాటుపడిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు మండలంలో వరి పొలాల మధ్య చేపల చెరువుల తవ్వకం జోరుగా సాగుతోంది. చిన్నాపురం ఆయకట్టు పరిధిలోని మంగ ల్లంక డ్రెయిన్‌, ఐదో నెంబరు సాగునీటి కాల్వ వెంబడి 150 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు తవ్వకం పనులను ఇటీవల ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అసైన్డ్‌ భూముల్లో ఈ పనులు చేస్తున్నారు. దీంతో చిన్నాపురం పరిసర గ్రామాలకు చెందిన 15 మంది రైతులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వరి పొలాల పక్కనే చేపల చెరువులు తవ్వేస్తున్నారని, దీంతో తమ భూముల్లో ఇక పంటలు పండవని ఆవేదన వ్యక్తం చేశారు. 

తుమ్మల చెరువులోనూ..

తుమ్మల చెరువు గ్రామ పరిధిలో, మచిలీపట్నం-కమ్మవారి చెరువు వెళ్లే రహదారి పక్కన రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తుమ్మలపాలెం, యాదర, చినయాదర, తుమ్మల చెరువు గ్రామాల పరిధిలోని వందలాది ఎకరాల నుంచి మురుగునీటిని సముద్రంలోకి తీసుకెళ్లే మంగల్లంక డ్రెయిన్‌ గట్టును సైతం ఆక్రమించేసి చెరువులు తవ్వుతున్నారు. ఈ విషయంపై ఆయా గ్రామాలకు చెందిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

బందరుకోట, గిలకలదిండి సరిహద్దుల్లో..

బందరుకోట, గిలకలదిండి సరిహద్దుల్లో వరి సాగుచేసే భూముల పక్కనే 70 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. బందరుకోట నుంచి గిలకలదిండి గ్రామంలోని పొలాల వైపునకు వెళ్లే దారిలో డ్రెయిన్‌ గట్టును సైతం ఆక్రమించేసి రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వరి సాగుచేసే రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా పనులు ఆపలేదు.

రెవెన్యూ అధికారులకు వాటాలు

ఈ వేసవిలో బందరు మండలంలోని పలు ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు ఊపందుకున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువుల తవ్వకం పనులు చేపట్టేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇచ్చేస్తే, అనుమతులు వచ్చేస్తాయన్న సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. చిన్నాపురం మంగల్లంక డ్రెయిన్‌, ఐదో నెంబరు సాగునీటి కాల్వల మధ్య ఉన్న 150 ఎకరాల్లో చెరువులు తవ్వడానికి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు ఇప్పించేందుకు ఒక వీఆర్వో మంత్రాంగం నడిపినట్లు రైతులు చెబుతున్నారు. ఇక్కడ చెరువులు తవ్వితే వరిపంటతో పాటు రెండో పంట మినుము కూడా పండే అవకాశం ఉండదంటున్నారు. ఈ చెరువుల తవ్వకం పనుల వ్యవహారంలో రెవెన్యూ అధికారుల వాటాగా రూ.20 లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వెస్ట్‌బ్లాక్‌, రుద్రవరం ఆయకట్టు పరిధిలో..

మచిలీపట్నం-కోన రోడ్డు వెంబడి కృష్ణా యూనివర్సిటీ ఎదురుగా, తారురోడ్డు పక్కనే రొయ్యల చెరువు తవ్వి గట్టును వేశారు. చెరువు నిండా నీటిని నింపితే తారురోడ్డు దెబ్బతింటుందని, చెరువు గట్టుకు, రోడ్డుకు మధ్య డ్రెయిన్‌ను ఏర్పాటు చేసుకోవాలని కోన, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం గ్రామాల సర్పంచ్‌లు యజమానికి పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. గట్టును రోడ్డు పక్కనే వేశాడు. దీంతో మూడు గ్రామాల సర్పంచ్‌లు, గ్రామస్థులు కలిసి రెవెన్యూ అఽధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అలాగే, గుండేరు డ్రెయిన్‌ భూమిని సైతం ఆక్రమించేసి రొయ్యల చెరువులు తవ్వేస్తున్నా మిన్నకుండిపోయారు. పాతేరు వంతెన నుంచి చిన్నాపురం, గుండేరు వంతెన వరకు డ్రెయిన్‌ గట్టు పక్కనే ఉన్న భూమిని చిన్నపాటి చెరువులుగా మార్చి, అందులో ఏరియేటర్లు పెట్టి మరీ  రొయ్యలు సాగు చేస్తున్నారు. రొయ్యలు, చేపల చెరువులు తవ్వుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, డ్రెయిన్‌ భూములను ఆక్రమించి, ఏడాదికి రెండు పంటలు పండే భూముల పక్కనే తవ్వకాలు జరిపితే ఇబ్బందేనని రైతులు వాపోతున్నారు. 



Updated Date - 2022-05-16T06:29:24+05:30 IST