భూమాయ..!

ABN , First Publish Date - 2022-05-15T06:04:29+05:30 IST

భూమాయ..!

భూమాయ..!
వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్‌ ఆమోదించిన భూమి ఇదే..

పట్టాభి స్మారకానికి భూమి కేటాయించరు..

సొంత కార్యాలయానికి మాత్రం హడావుడి ఉత్తర్వులు

మచిలీపట్నంలో వైసీపీ రాజకీయ క్రీడ

ఆడిటోరియం ప్రతిపాదిత స్థలం వద్దే వైసీపీ ఆఫీసుకు రెండెకరాలు

రూ.33 కోట్ల విలువైన భూమి వందేళ్ల లీజుకు.. 

జూ ఆగమేఘాలపై ఆమోదం తెలిపిన 

మచిలీపట్నం కార్పొరేషన్‌

చక్రం తిప్పిన మాజీమంత్రి పేర్ని నాని


మహనీయులంటే విలువ లేదు.. సొంత పార్టీకి మాత్రం విలువైన భూములిచ్చేస్తారు. మచిలీపట్నంలో పట్టాభి స్మారక భవనం కోసం స్థలం కేటాయించలేని వైసీపీ నాయకులు తమ సొంత కార్యాలయానికి మాత్రం రెండెకరాలను కార్పొరేషన్‌ వేదికగా ఆగమేఘాలపై ఆమోదింపజేయించుకున్నారు. నగరం నడిబొడ్డున సుమారు రూ.33 కోట్ల విలువైన స్థలాన్ని నామమాత్రపు లీజుతో కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం) : మచిలీపట్నం నడిబొడ్డున అత్యంత విలువైన రెండెకరాలను వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయింపజేసుకున్నారు. జిల్లా కోర్టుకు వెళ్లే దారిలో సాయిబాబా మందిరం, పోలీస్‌ క్వార్టర్ల సమీపంలో ఉన్న ఈ ఖరీదైన భూమిని వైసీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం కేటాయిస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో ఈనెల 13న ఆగమేఘాలపై తీర్మానం ఆమోదింపజేయించారు. ఈ భూ కేటాయింపు కోసం మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మతో హడావుడిగా ప్రత్యేక టేబుల్‌ అజెండాను రూపొందించారు. దీని ప్రస్తుత రిజిస్ర్టేషన్‌ విలువ ప్రభుత్వ ధర ప్రకారం చదరపు గజం రూ.35 వేలు. బహిరంగ మార్కెట్‌లో రూ.45 వేల పైమాటే. గజం రూ.35 వేల చొప్పున ధర నిర్ణయించినా, అక్షరాలా రూ.33.60 కోట్లవుతుంది. ఇంత విలువైన భూమిని నామమాత్రపు లీజు పేరుతో కొట్టేసేందుకు కుట్ర జరుగుతోందని పట్టణ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన విలువైన భూమి రాజకీయ పార్టీలకు కట్టబెట్టడం ఏమిటని, పార్టీపై ఉన్న ప్రేమ పేదలపై లేదని మండిపడుతున్నారు.  

అంత హడావుడి దేనికో..

ఈనెల 13న మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు నోటీసు జారీ చేశారు. వైసీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి కేటాయించే అంశాన్ని టేబుల్‌ అజెండాగా పెట్టి, ఆమోదం తెలిపేశారు. జిల్లా జడ్జిల బంగ్లాల ఎదురుగా, పోలీస్‌ క్వార్టర్ల పక్కనే ఆర్‌ఎస్‌ నెంబరు 371-ఏ-1లో ఐదెకరాలకు పైగా ఉంది. ఈ భూమిలోని రెండెకరాలను వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం రెగ్యులర్‌ లీజు ప్రాతిపదికన కేటాయించామని, మచిలీపట్నం కార్పొరేషన్‌ ఇందుకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ లేఖ రాశారని నోటీసులో పేర్కొన్నారు. ఆ లేఖను ఆధారంగా చేసుకుని మచిలీపట్నం తహసీల్దార్‌ ఆర్‌సీఏ/1894/2021తో 2022, మే 2 ద్వారా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆమోదం కోసం లేఖ రాశారని వివరించారు. ఈ లేఖ ఆధారంగా సర్వే చేసి వార్డు నెంబరు 4, ఆర్‌ఎస్‌ నెంబరు 371/ఏ1ఏ2లో భూమి ఉన్నట్టుగా గుర్తించామని తెలిపారు. ఈ  రెండెకరాలను వైసీపీ కార్యాలయ భవనం కోసం లీజు ప్రాతిపదికన ఎస్‌డీఆర్‌ తయారు చేయడం జరిగిందన్నారు. ఈ భూమి ఆర్‌ఎస్‌ఆర్‌లో పోరంబోకు, పోలీస్‌ లైనుగా నమోదై ఉందని నోటీసులో వివరించారు. వీటిని ఆధారంగా చేసుకుని శుక్రవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపాదించిన అంశాలన్నీంటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించేశారు. 

పట్టాభి స్మారకం ఊసేదీ..?

ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడిగా, జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మచిలీపట్నం ఖ్యాతిని దశదిశలా చాటిన డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి భవిష్యత్‌ తరాలకు తెలిపే చిన్నపాటి స్మారక భవనం ఎక్కడా లేదు. మరోవైపు ఆంధ్రాబ్యాంకును సైతం యూనియన్‌ బ్యాంకులో విలీనం చేసేయడంతో పట్టాభి ఆనవాళ్లు క్రమంగా చెరిగిపోతున్నాయి. ఆయన మచిలీపట్నంలో సుమారు వందేళ్ల కిందట ఆంధ్రాబ్యాంకును స్థాపించారు. అది దేశవ్యాప్తంగా 5వేలకుపైగా బ్రాంచీలతో అవతరించింది. ఆంధ్రాబ్యాంకు విలీనంతో ఆ బ్యాంకును స్థాపించిన పట్టాభి పేరు భవిష్యత్తు తరాలు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం, మ్యూజియాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఎంపీ వల్లభనేని బాలశౌరి తెరపైకి తెచ్చారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతస్థాయి అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపి రూ.40 కోట్లతో పట్టాభి స్మారక భవనాన్ని మచిలీపట్నంలో నిర్మించేలా ఒప్పించారు. ఈ భవనం నిర్మాణం కోసం మచిలీపట్నంలో రెండెకరాలను కేటాయించాలని ఆయన ఎప్పటి నుంచో అధికారులను కోరుతున్నారు. జిల్లా కోర్టుకు వెళ్లే దారిలో ఉన్న ఐదు ఎకరాల్లో కొంత భూమిని కేటాయించాలని ఆయన కోరినా అధికారుల నుంచి స్పందన లేదు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని కారణంగానే ఈ ప్రక్రియ ముందుకు పడలేదన్న ప్రచారం జరుగుతోంది. పట్టాభి స్మారక భవనం ఏర్పాటుపై సుముఖంగా లేని నాని ఎంపీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయకుండా చూశారన్న ప్రచారం సొంత పార్టీ నాయకుల్లోనే చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యాలయం కోసం రెండెకరాలను కేటాయిస్తూ కార్పొరేషన్‌ ఆమోదం తెలపడం వైసీపీ నాయకుల వైఖరిని తేటతెల్లం చేస్తోంది. పేదలు ఉండేందుకు ఇంటి కోసం సెంటు భూమిని కేటాయిస్తున్న వైసీపీ సర్కార్‌ జిల్లా పార్టీ కార్యాలయం కోసం రెండెకరాలను ఇవ్వడమేమిటన్న విమర్శలూ వస్తున్నాయి. 



Updated Date - 2022-05-15T06:04:29+05:30 IST