భూఅక్రమార్కులపై వేటు

ABN , First Publish Date - 2021-08-06T05:41:36+05:30 IST

జిల్లాలో భూ అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కొరడా ఝుళిపించారు. ఇప్పటికే పొదిలి, చిన్నగంజాం తహసీల్దారు, ఇద్దరు ఆర్‌ఐలు, వీఆర్వోల సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసిన కలెక్టర్‌ గురువారం మార్కాపురంలో భూ అక్రమార్కులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. మార్కాపురం మండలంలో తన కుటుంబసభ్యుల పేరుతో ప్రభుత్వ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వీఆర్వో మాకం కోటయ్యని సస్పెండ్‌ చేశారు. అతనికి సహకరించిన ఏఆర్‌ఐ గోపీపైనా వేటు వేశారు.

భూఅక్రమార్కులపై వేటు
ఆంధ్రజ్యోతిలో జులై 12న భూఅక్రమాలపై ప్రచురితమైన కథనం

కొరడా ఝుళిపించిన కలెక్టర్‌

ఏఆర్‌ఐ, వీఆర్వో సస్పెన్షన్‌

కుటుంబసభ్యుల పేరుతో ప్రభుత్వ భూములు

మార్కాపురం, ఆగస్టు 5: జిల్లాలో భూ అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కొరడా ఝుళిపించారు. ఇప్పటికే పొదిలి, చిన్నగంజాం తహసీల్దారు, ఇద్దరు ఆర్‌ఐలు, వీఆర్వోల సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసిన కలెక్టర్‌ గురువారం మార్కాపురంలో భూ అక్రమార్కులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. మార్కాపురం మండలంలో తన కుటుంబసభ్యుల పేరుతో ప్రభుత్వ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వీఆర్వో మాకం కోటయ్యని సస్పెండ్‌ చేశారు. అతనికి సహకరించిన ఏఆర్‌ఐ గోపీపైనా వేటు వేశారు.


సమగ్ర విచారణకు ఆదేశం

మార్కాపురం తహసీల్దార్‌గా జూన్‌ 30న ఉద్యోగ విరమణ చేసిన జి.విద్యాసాగరుడు పనితీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు విచారణకు ఆదేశించారు. జేసీ వెంకటమురళి జూన్‌లో మార్కాపురం తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలో జరిగిన వెబ్‌ల్యాండ్‌ లావాదేవీలపై విచారణ చేయాలని వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనాన్ని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరళావందనం కేవలం జూన్‌లో మార్కాపురం మండలంలో జరిగిన అడంగల్‌ కరెక్షన్‌, మ్యుటేషన్లపై విచారణ ప్రారంభించారు. ఒక్క జూన్‌లోనే 587 లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ప్రత్యేక కలెక్టర్‌ సరళావందనం సంబంధిత ఫైళ్లపై విచారణ చేపట్టారు. తెలిసిన సమాచారం మేరకు విచారణలో వెల్లడైన అంశాలపై ఎప్పటికప్పుడు జేసీకి సమాచారం అందజేస్తున్నారు. ఇప్పటివరకూ విచారణలో వెల్లడైన అంశాల ద్వారా జేసీ సిఫార్సు మేరకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మార్కాపురం ఏఆర్‌ఐ గోపి, మార్కాపురం పట్టణ 4వ వీఆర్వో మాకం కోటయ్యను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


కుటుంబసభ్యుల పేరుతో ప్రభుత్వ భూములను మార్చిన వీఆర్వో  

మార్కాపురం పట్టణ వీఆర్వో మాకం కోటయ్య తన కుటుంబసభ్యుల పేరుతో ప్రభుత్వ భూములు మార్చుకున్నాడని, అందుకు ఏఆర్‌ఐ గోపి సిఫార్సు చేశాడన్న కారణంతో వారిద్దరినీ సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ జారీచేసిన ఉత్తర్వులు పేర్కొన్నారు. కలెక్టర్‌ జారీచేసిన ఉత్తర్వుల మేరకు మార్కాపురం మండలం ఇడుపూరులో సర్వే నెంబర్‌ 51-2లో 2 ఎకరాలు, సర్వే నెంబర్‌ 63-1లో 1.35 ఎకరాలు, సర్వే నెంబర్‌ 1114-2లో 1.11 ఎకరాలు వీఆర్వో కోటయ్య తన కుమారుడైన మాకం యలమంద పేరుతో, సర్వే నెంబర్‌ 51-2లో2 ఎకరాల చుక్కల భూమి, సర్వే నెంబర్‌ 63-1లో 1.35 ఎకరాల సర్వీస్‌ ఇమాం భూమి, సర్వే నెంబర్‌ 1114-2లో 1.11 ఎకరాల భూమిని తన మరో కుమారుడు మాకం కోటేశ్వరరావు పేరుతో, సర్వే నెంబర్‌ 290-2లో 4.50 ఎకరాల చుక్కల భూమి తన కోడలు మాకం సుజాత పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇందుకుగాను ఏఆర్‌ఐ గోపి తహసీల్దార్‌కు సిఫార్సు చేసినందుకు, తన కుటుంబసభ్యుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నందుకు మాకం కోటయ్యను సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-06T05:41:36+05:30 IST