భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-27T05:31:26+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు మూడవ టీఎంసీ కాలువ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి

   జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌


కరీంనగర్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు మూడవ టీఎంసీ కాలువ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ కాలువ భూసేకరణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష   నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులతో గ్రామ సభలు నిర్వహించి భూములు ఇచ్చుటకు సమ్మతి తెలిపేలా వారిలో అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు తమ భూములను కోల్పోతున్న వారికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి న్యాయం జరిగేలా చేస్తామని తెలుపాలని సూచించారు. గ్రామ సభలు పూర్తయిన చిప్పకుర్తి, శ్రీరాములపల్లి, రామడుగు, నాగిరెడ్డిపూర్‌ గ్రామాలకు సంబంధించి సమ్మతి తెలిపిన రైతుల భూముల వివరాలతో ఈ నెల 31లోగా పేపర్‌ పబ్లికేషన్‌ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. మిగిలిన గ్రామాల్లో వెంటనే గ్రామ సభలు నిర్వహించి రైతుల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో రైతులు ఇల్లు కోల్పోతున్నవారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ శ్రీధర్‌, కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌, రామడుగు తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-27T05:31:26+05:30 IST