భూసేక‘రణం’

ABN , First Publish Date - 2022-04-16T05:56:31+05:30 IST

వానొస్తే పల్లె ముంగిట పచ్చని పంటలు..

భూసేక‘రణం’
అసంపూర్తిగా వేదవతి ప్రాజెక్టు పనులు

  1. ఏళ్లు గడిచినా ఒక్క ఎకరా సేకరించ లేదు
  2. ఆర్డీఎస్‌ కుడి కాలువకు 5,881.67 ఎకరాలు
  3. వేదవతి ప్రాజెక్టుకు 4,781 ఎకరాలు అవసరం
  4. ఇప్పటి వరకు ఖారారు కాని పరిహారం
  5. ఎకరాకు రూ.15 లక్షలు డిమాండ్‌ చేస్తున్న రైతులు
  6. వేధిస్తున్న నిధుల సమస్య 
  7. జిల్లా మంత్రి గుమ్మనూరు దృష్టి సారించేనా..?


వానొస్తే పల్లె ముంగిట పచ్చని పంటలు.. లేదంటే పెట్టుబడి మట్టిపాలు. వర్షాధార పంటలపై ఆధారపడ్డ కష్టజీవుల బాధలు అక్షరాలకు అందవంటే అతిశయోక్తి కాదు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికీ కటకటే. ఈ సమస్య పరిష్కారానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం చంద్రబాబు ఆర్డీఎస్‌ కుడి కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రెండింటికీ రూ.3,928.22 కోట్లు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదట్లో పెండింగ్‌లో పెట్టింది. ఆ తరువాత అనుమతులు ఇచ్చినా.. నిధుల కొరత, భూ సేకరణ సమస్యలు వేధిస్తున్నాయి. 

- కర్నూలు-ఆంధ్రజ్యోతి


జిల్లా పశ్చిమ ప్రాంతం ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో రైతులను దశాబ్దాలుగా వెంటాడుతున్న కరువు శాశ్వత పరిష్కారం కోసం వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టు, ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.79 లక్షల మంది గ్రామీణులకు తాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఇందుకు వేదవతి ప్రాజెక్టుకు రూ.1,942.80 కోట్లు, ఆర్డీఎస్‌ కాలువ నిర్మాణానికి రూ.1,985.42 కోట్లు కలిపి రూ.3.928.22 కోట్లు మంజూరు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం పరిపాలన, సాంకేతిక అనుమతులు ఇచ్చింది. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది. అయితే.. పనులు మొదలు కాకుండానే 2019 మే నెలలో ఎన్నికలు రావడంతో టీడీపీ ఒడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎం జగన బాధ్యతలు తీసుకోగానే పనులు ఆపేశారు. తరువాత ప్రాధ్యానత ప్రాజెక్టు కింద చేర్చి అనుమతులు ఇచ్చారు. మూడేళ్లు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. భూ సేకరణలో అంతులేని జాప్యం, నిధుల కొరత వెరసి కరువుపల్లె జల జీవ నాడులైన ఆర్డీఎస్‌ కెనాల్‌, వేదవతి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఈ ప్రాజెక్టులలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు ఎంత పరిహారం ఇస్తారో..? ఇంతవరకు తేల్చకపోవడం కొసమెరుపు. 

 

  ఽభూ సేకరణలో జాప్యం 

  ఆలూరు, ఆదోని నియోజ కవర్గాల్లో 80 వేల ఎకరా లకు సాగునీరు ఇవ్వాలన్నది వేదవతి ప్రాజెక్టు లక్ష్యం. గూళ్యం సమీపంలో వేదవతి నుంచి వరద జలాలు ఎత్తిపోసి హాలహర్వి, మొలగ వెళ్లి జలాశ యాల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు పంపిణీ చేస్తారు. పైపులైన, కాలువలు, జలాశయాల నిర్మాణాల కోసం రూ.4,781 ఎకరా లు సేకరిచాల్సి ఉంది. ఇప్పటి వరకు 276.46 ఎకరాలు ఎస్‌డీసీ సర్వే, 427.97 ఎకరాలు ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తి చేశారు. 43.33 ఎకరాలకు డ్రాప్ట్‌ డిక్లరేషన స్టేజ్‌లో ఉంటే.. అవార్డు స్టేజ్‌లో కేవలం 17.24 ఎక రాలు మాత్రమే ఉంది. 

- మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు మండలాల పరిధిలో 40 వేల ఎకరాలకు సాగునీరు, 1.20 లక్షల జనాభాకు తాగునీరందించే లక్ష్యంగా ఆర్డీఎస్‌ కుడి కాలువ చేపట్టారు. కోసిగి మండలం ఆర్డీఎస్‌ ఆనకట్ట నుంచి కర్నూలు మండలం ఉల్చాల వరకు 160 కి.మీలు ప్రధాన కాలువ, కోసిగి, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు, గోనెగండ్ల మండలం చిన్నమరివీడు దగ్గర నాలుగు టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 5,881.67 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ 595.52 ఎకరాలు ఎస్‌డీసీ సర్వే, 531.85 ఎకరాలు ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తి చేస్తే.. 327.03 ఎకరాలు పీఎన స్టేజ్‌, 191.31 ఎకరాలు డీఅండ్‌ డీ స్టేజీలో ఉంది. భూ సేకరణ జాప్యం కారణంగా పను లు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.

  న్యాయం, పరిహారం కోసం  రైతుల డిమాండ్‌

భూ సేకరణ (ఎల్‌ఏ) చట్టం-2013 ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్డీఎస్‌ కాలువ నిర్మాణాలు చేసే గ్రామాల్లో ప్రస్తుతం భూమి స్వభావం, ప్రధాన రహదారులు ఉన్న దూరాన్ని బట్టి ఎకరా రూ.10-20 లక్షలకు పైగా పలుకుతోంది. వేదవతి ప్రాజెక్టు నిర్మాణం గ్రామాల్లోనూ దాదాపుగా అదే పరిస్థితి. అయితే.. ఆయా గ్రామాల్లో మూడేళ్ల వ్యవధిలో జరిగిన రిజిసే్ట్రషన విలువ ఆధారంగా భూమి ధర నిర్ణయిస్తామని భూ సేకరణ అధికారులు అంటున్నారు. ఆ ప్రకారమైతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాతల కాలం నుంచి జీవనాధారమైన భూములను త్యాగం చేస్తున్న తమకు ఎకరాకు రూ.15 నుంచి రూ.20 లక్షల భూ పరిహారం ఇస్తే తప్పా కోలుకోలేమని అంటున్నారు. ఆర్డీఎస్‌ ప్రాజెక్టులో భాగంగా 1.50 టీఎంసీల సామర్థ్యంతో ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు దగ్గర జలాశయం నిర్మిస్తున్నారు. ఇందుకోసం 250 ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉంది. ఎకరా రెండెకరాలకు మించి భూమి లేని సన్న చిన్నకారు రైతులే భూములు కోల్పోవాల్సి వస్తోంది. భూములు ఇవ్వలేమంటూ ఆ గ్రామ రైతులు ఇప్పటికే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కలిసి విన్నవించారు. తప్పక ఇవ్వాల్సి వస్తే.. కోటేకల్లు రిజర్వాయర్‌ నిర్మించే ప్రదేశానికి కేవలం ఐదారు కి.మీల దూరంలో ఆరేకల్లు సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి ఎకరా రూ.40 లక్షల ప్రకారం భూ సేకరణ చేశారు. అదే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్న రెవెన్యూ అధికారులు ఎకరాకు ఎంత ధర నిర్ణయించారో ఇంతవరకు తేల్చి చెప్పలేదని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు న్యాయమైన భూ పరిహారం ఇవ్వాలని, అది కూడా ఏక మొత్తంలో చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

  వేధిస్తున్న  నిధుల కొరత

ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు హైదరాబాదుకు చెందిన ఎనసీసీ లిమిటెడ్‌ సంస్థ చేపట్టింది. ప్రతిపాదన వ్యయం రూ.1,985.42 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 0.65 శాతం పనులు కూడా జరగలేదు. ఆర్డీఎస్‌ ఆనకట్ట వద్ద ప్రధాన కాలువ పనులు మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశారు. రిజర్వాయర్‌ పనులు మొదలే కాలేదు. వేదవతి ప్రాజెక్టు పనులను హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్‌ ఇనఫ్రా లిమిటెడ్‌ సంస్థ చేపట్టింది. అంచనా వ్యయం రూ.1,942.80 కోట్లు కాగా ఇప్పటి దాకా 6.48 శాతం పనులు పూర్తి చేశారు. రూ.104 కోట్లు ఖర్చు చేసినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే.. నిధులు కొరత, భూ సేకరణ జాప్యం కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. 

 మాకు  న్యాయం చేయాలి

బిలేహల్‌ గ్రామంలో 2 వేల ఎకరాలు వేదవతి ఎత్తిపోతల పథకానికి అవసరం అంటున్నారు. కాని అధికారులు మాత్రం పరిహారం చెల్లించే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మేము భూములు ఇవ్వలేమని తేల్చి చెప్పాం. మా డిమాండ్లు అంగీకరిస్తే తప్ప భూములు ఇవ్వలేం. 

- గిడ్డయ్య, బిలేహల్‌

రైతుల ఒప్పందం మేరకు పరిహారం నిర్ణయిస్తాం

 వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ త్వరలో పూర్తి చేస్తాం. స్పెషల్‌ కలెక్టరుగా కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. బాధిత రైతులతో మాట్లాడి వారి ఒప్పందం మేరకు న్యాయం పరిహారం అందేలా ధర నిర్ణయిస్తాం. 

  - రామకృష్ణారెడ్డి,  ఆర్డీవో, ఆదోని 



Updated Date - 2022-04-16T05:56:31+05:30 IST