పేదల ఇళ్ల కోసం మళ్లీ భూ సేకరణ!

ABN , First Publish Date - 2021-01-11T06:30:57+05:30 IST

రెవెన్యూ యంత్రాంగం ఇతర అన్ని పనులనూ పక్కన పెట్టేసి భూముల చుట్టూనే తిరుగుతోంది. ఇళ్ల పట్టాల పంపిణీ ఒక వైపు కొనసాగుతుండగానే.. మరో విడత భూ సేకరణ కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి.

పేదల ఇళ్ల కోసం మళ్లీ భూ సేకరణ!

అధికార పార్టీ నేతల నుంచి రెవెన్యూపై ఒత్తిళ్లు 

మరో లక్షకు పైగా దరఖాస్తులు.. 

అన్నీ ప్రజాప్రతినిధుల సిఫార్సులే! 

ఇప్పటికే 6,547.21 ఎకరాల సేకరణ 

వందకు పైగా కోర్టు కేసులు

ఇప్పటికీ స్టేటస్‌ కో లోనే 

మళ్లీ భూములు సేకరించేదెలా! 

తలలు పట్టుకుంటున్న రెవెన్యూ


రెవెన్యూ యంత్రాంగం ఇతర అన్ని పనులనూ పక్కన పెట్టేసి భూముల చుట్టూనే తిరుగుతోంది. ఇళ్ల పట్టాల పంపిణీ ఒక వైపు కొనసాగుతుండగానే.. మరో విడత భూ సేకరణ కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాల పంపిణీని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం మార్చటంతో, అర్హులు ఇంకా ఉన్నారంటూ రెవెన్యూ యంత్రాంగం దృష్టికి ప్రతిపాదనలు తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదనలతో రెవెన్యూ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లావ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాల కోసం 6,547.21 ఎకరాల భూములను రెవెన్యూ యంత్రాంగం భూములను సేకరించింది. ఇందులో ప్రభుత్వ భూములు 2,442.57 ఎకరాలు కాగా, ప్రైవేటు భూములు 4,104.64 ఎకరాలు. ప్రభుత్వ భూముల్లో 887 లే అవుట్లు, ప్రైవేటు భూముల్లో 599 లే అవుట్లు చొప్పున మొత్తం 1,486 లే అవుట్లు వేశారు. వీటిలోని ప్లాట్లనే పక్షం రోజులుగా పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీని ఈ నెల 20 వరకు పొడిగించారు. ఒకటి, రెండు రోజుల్లో గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తే పూర్తయ్యే కార్యక్రమాలను ఇలా అట్టహాసంగా రోజుల తరబడి సాగదీయడం వల్ల రెవెన్యూ యంత్రాంగం చేయలసిన భూముల రీ సర్వే, తదితర కార్యక్రమాలు మూలన పడుతున్నాయి. మరో పక్షం రోజుల్లో తిరిగి సాధారణ విధుల్లోకి వెళ్లిపోవచ్చని రెవెన్యూ యంత్రాంగం భావిస్తున్న దశలో.. మళ్లీ భూ ప్రతిపాదనలు రావడంతో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డిసెంబరు 25 వరకు అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తులే వేల సంఖ్యలో ఉండగా, గ్రామ సచివాలయాల ద్వారా మళ్లీ కొత్తగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు వీటిని స్వీకరించి, మళ్లీ తహసీల్దార్లకు పంపిస్తున్నారు. మొత్తంమీదా ఈ దరఖాస్తులు మరో లక్ష వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. దీంతో రెవెన్యూ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. రెవెన్యూ యంత్రాంగం ఆందోళనకు అనేక కారణాలు ఉన్నాయి. 


వందకు పైగా కోర్టు కేసులు.. 

ఇళ్ల పట్టాల కోసం ఎలాగైనా భూములు సేకరించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారు. దీంతో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ స్టేటస్‌ కోలో ఉన్నాయి. పంట చేతికి వచ్చిన భూములు, దళితులకు ఇచ్చిన సాగుభూములు, నివేశనా స్థలాల్లో బలవంతపు సేకరణలకు దిగటంతో రైతులు, సాగుదారులు ఈ కేసులను వేశారు. ఇవి ఇంకా తేలనేలేదు. ఇంతలోనే మళ్లీ భూ సేకరణలు అంటే బలవంతపు దారిలోనే వెళ్లాల్సి ఉంటుందని, అలా చేస్తే మరిన్ని కోర్టు కేసులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు లబోదిబో మంటున్నారు. 


లే అవుట్లపై విమర్శలు  

ఇప్పటికే సేకరించిన భూముల్లో వేసిన లే అవుట్లపై విమర్శలు కూడా వస్తున్నాయి. కొత్తగా వేసిన లే అవుట్లన్నీ కొత్త కాలనీలుగా ఏర్పడతాయి. అక్కడ ప్రజల ఆరోగ్యం కోసం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. పిల్లలు చదువుకునేందుకు ప్రాథమిక పాఠశాల ఉండాలి. ఒక ఉద్యానవనం, తాగునీటి కోసం వాటర్‌ ట్యాంకు, ఆ ప్రాంతానికో సచివాలయం అవసరం. అక్కడ చెట్లను పెంచాలి. ఇవన్నీ చేయాలంటే కామన్‌సైట్స్‌ అవసరం. ఈ ప్లాట్లలో కామన్‌సైట్లనేవే లేవు. భూమి సమస్యే కారణమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీనిపై ఎవరైనా కోర్టులకు వెళితే తలనొప్పులు తప్పవని భావిస్తున్నారు. 

Updated Date - 2021-01-11T06:30:57+05:30 IST