ఆ భూమి రికార్డులు.. ట్యాంపరింగ్‌?

ABN , First Publish Date - 2021-07-28T05:40:33+05:30 IST

గుంటూరుకు, జాతీయ రహదారికి సమీపంలోని పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలో ఉన్న వివాదాస్పద 54 సెంట్ల భూమిపై అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ భూమి తమదంటే తమది అంటూ ముగ్గురు, నలుగురు వ్యక్తులు ముందుకొస్తున్నారు.

ఆ భూమి రికార్డులు.. ట్యాంపరింగ్‌?

తక్కెళ్లపాడులోని వివాదాస్పద భూమిపై అనుమానాలు

గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ సర్వే నిర్వహించిన సర్వేయర్‌

జాయింట్‌ కలెక్టర్‌ క్షేత్రస్థాయికి రావాలంటోన్న గ్రామస్థులు


గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గుంటూరుకు, జాతీయ రహదారికి సమీపంలోని పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామ

పరిధిలో ఉన్న వివాదాస్పద 54 సెంట్ల భూమిపై అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ భూమి తమదంటే తమది అంటూ ముగ్గురు, నలుగురు వ్యక్తులు ముందుకొస్తున్నారు. ఒరిజినల్‌ పట్టాదారులు తమకు జీపీ చేశారని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూమిలో  రహస్యంగా సర్వేయర్‌ మళ్లీ సర్వే చేయడం, చుట్టుపక్కల ఉన్న భూముల యజమానులెవ్వరికి నోటీసులు ఇచ్చి పిలవకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఇదే సమయంలో భూమి రికార్డులు కూడా ట్యాంపరింగ్‌ జరుగుతున్నట్లు స్థానికులు కొంతమంది అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి రికార్డులు, లింకు డాక్యుమెంట్లు వంటి ఆధారాలతో జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి వివాదానికి తెరదించాలని సమీప భూ యజమానులు కోరుతున్నారు. రూ.5 కోట్ల భూమిపై ఖద్దరు కన్ను అనే శీర్షికతో మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం స్థానికంగా, రెవెన్యూ, సర్వే శాఖల వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. దశాబ్దాల తరబడి ఎలాంటి సాగు లేకుండా ఖాళీగా పడి ఉంటున్న ఆ భూమిపై ఇప్పుడే ఎందుకు వివాదాలు ముసురుతున్నాయనే విషయంపై రెవెన్యూ ఉన్నతాధికారులు శ్రద్ధ పెట్టాల్సి ఉన్నది. రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ కార్యాలయంకు ఫిర్యాదు అంది అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇక్కడి రెవెన్యూ అధికారుల్లో చలనం రావడం అనుమానాలకు తావిస్తున్నది. ఆ భూమికి తాను వారసుడినని, కాట్రపాటి వెంకటసుబ్రహ్మణ్యంకి మనవడిని అంటూ హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఆర్‌కేనగర్‌కు చెందిన కేవీఎస్‌ఆర్‌ ఎస్‌ఎస్‌ ప్రకాష్‌ అనే వ్యక్తి ఈ నెల 16న పెదకాకాని తహసీల్దారుకి లేఖ రాశారు. 54 సెంట్ల భూమిని పార్టీషన్‌ చేసుకున్నామని  ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లినందున రికార్డుల్లో అప్‌డేట్‌ చేసుకోలేదని, వాటిని అప్‌డేట్‌ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో వివాదానికి ముగింపు పలకాలంటే పారదర్శకమైన సర్వే జరగాలని స్థానికులు కోరుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం, జిల్లా యంత్రాంగం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆ భూమికి సంబంధించిన రికార్డులు పరిశీలించాలంటున్నారు.  

Updated Date - 2021-07-28T05:40:33+05:30 IST