‘ఎక్సైజ్‌’లో మామూళ్ల కిక్కు

ABN , First Publish Date - 2022-01-12T04:58:43+05:30 IST

మద్యం షాపుల లాటరీ ద్వారా ప్రభుత్వఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టిన ఎక్సైజ్‌శాఖ ఇప్పుడు తమ సొంత ఖజానా నింపుకొనే పనిలో నిమగ్నమైంది. మద్యంషాపుల ...

‘ఎక్సైజ్‌’లో మామూళ్ల కిక్కు

లైసెన్సుల మంజూరులో చేతివాటం

ఒక్కో  దుకాణానికి రెండున్నర లక్షలపైనే వసూలు


ఖమ్మం: మద్యం షాపుల లాటరీ ద్వారా ప్రభుత్వఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టిన ఎక్సైజ్‌శాఖ ఇప్పుడు తమ సొంత ఖజానా నింపుకొనే పనిలో నిమగ్నమైంది. మద్యంషాపుల లాటరీ ప్రక్రియ పూర్తికావడం, షాపుల కేటాయింపు జరగడం, తాత్కాలిక లైసెన్సు లతో షాపుల తెరవడం.. ఇదంతా యథామామూలుగా సాగినా రెండేళ్ల పాటు మద్యంషాపులు నిర్వహించేందుకు పూర్తిస్థాయి లైసెన్సు మంజూరు తోనే అసలుకథ మొదలైంది. ఈ లైసెన్సు మంజూరుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్‌శాఖ మామూళ్ల కిక్కు చూపిస్తోంది. ఒక్కో లైసెన్స్‌కు రెండు న్నర లక్షలు డిమాండ్‌చేసి గుంజుతోంది. ఇందుకు కిందిస్థాయివారు వసూళ్లపర్వం నడిపిస్తుండగా.. ఈ కథ పైస్థాయివరకు  జరుగుతోందని ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్‌ శాఖలో జరుగుతున్న మామూళ్లదందాపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


పైసలిస్తేనే పూర్తిస్థాయి లైసెన్స్‌..

ఉమ్మడి జిల్లాలో రెండేళ్లపాటు మద్యం వ్యాపారం నిర్వహణకోసం ఇటీవల టెండర్లప్రక్రియ పూర్తికావడంతో మద్యం షాపులు దక్కినవారు తాత్కాలిక లైసెన్సులు పొంది షాపులు తెరిచారు. ఇలా మద్యం వ్యాపారం ప్రారంభించి నెలరోజులవుతున్నందున పూర్తిస్థాయి లైసెన్సులు ఇవ్వడం ఆ శాఖలోఆనవాయితీ. ఇందుకు బ్యాంకు గ్యారంటీలు, మద్యంషాపు ఏర్పాట్లు, నిబంధనలు సరిచూసుకుని ఎక్సైజ్‌శాఖ ఉచితంగానే లైసెన్సులు జారీ చేయాలి. కానీ ఉమ్మడి జిల్లాలో అలా ప్రక్రియ సాగడంలేదు. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ దుకాణాల లైసెన్స్‌ మంజూరుకు రేటుపెట్టింది. లైసెన్స్‌ మంజూ రు చేసినందుకు కొన్నిచోట్ల రూ.2.50లక్షలు మరికొన్నిచోట్ల రూ.3.50లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. షాపు డిమాండ్‌ను బట్టి మామూళ్ల రేటు ఫిక్స్‌చేశారు. ఇప్పుడు ఎక్సైజ్‌ లైసెన్సు జారీకోసం ప్రతి షాపునుంచి ముడు పులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అడిగినంత సొమ్ములు ఇచ్చి లైసెన్స్‌లు తీసుకోగా ఇంకా కొందరు బేరసారాలు నడిపిస్తున్నారు.


‘అంత ఇవ్వలేం కొంత ఇచ్చుకుంటాం’ అంటూ బేరమాడుతున్నా ఎక్సైజ్‌శాఖ మా త్రం ససేమిరా అంటోంది. ‘విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టుకోండి, ఎంఆర్‌పీని పక్కనబెట్టండి, అదనంగా బెల్టుషాపులనుంచి బాదండి, లాభా లు తెచ్చుకోండి.. మా ముడుపులు మాకు ఇవ్వండి’ అన్నట్టుగా జిల్లాలో లైసెన్స్‌ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో మద్యం వ్యాపారులు ఎవరి కీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఫిర్యాదుచేస్తే రోజువారి కేసులు పెట్టి లైసెన్స్‌కే వేటు వేస్తారని, లేదంటే షాపులు సీజ్‌చేస్తారన్న భయం వ్యాపారుల్లో నెలకొంది. దీంతో మద్యం వ్యాపారులు, సిండికేట్లు కొందరు ఎవరికివారు ముడుపులు ముట్టచెప్పి లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. 


కింది స్థాయి సిబ్బంది ద్వారా ఈ వసూళ్లు పర్వం నడుస్తోంది. లైసెన్స్‌కు ఇచ్చే సొమ్ములు తమ ఒక్కరికే కాదని, అందరికీ పంచాలంటూ వ్యాపారులకే లెక్కలు చెబుతున్నారు. దీంతో రెండేళ్లపాటు మద్యం వ్యాపారం చేయా లంటే ఎక్సైజ్‌శాఖ కరుణ ఉండాలని, లేకుంటే అప్పుల పాలవుతామన్న భయంతో వ్యాపారులు పెట్టుబడిలో ఇదో పెట్టుబడి అంటూ ముడుపులు ఇచ్చి లైసెన్స్‌లు పొందుతు న్నారు. ఖమ్మంజిల్లాలో 122మద్యం షాపులు, భద్రాద్రి జిల్లాలో 84 మద్యంషాపులున్నాయి. ఉమ్మడిజిల్లాలో ప్రతినెల రూ.200కోట్ల వ్యాపారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖతోపాటు పోలీసుశాఖలోకూడా నెలవారి మామూళ్లు అంటూ మద్యం వ్యాపారులకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారులు అడిగినవారికి అడిగినంత ఇస్తూ ఆ భారం మద్యంప్రియులపై మోపు తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఎంఆర్‌పీ కంటే అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపులు విచ్చలవిడిగా తెరుస్తూ ఎక్కువరేట్లకు విక్రయిస్తున్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో గతంలో మద్యం మామూలు విష యంలో ఏసీబీకీ చిక్కి జిల్లాలో ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు, సీఐలు, కాని స్టేబుళ్లు పలువురు సస్పెండ్‌ కావడంతోపాటు, ఖమ్మం జిల్లామద్యం మా మూళ్ల కథ ఏసీబీ చరిత్రలోనే సంచలనంగా నిలిచింది. కొందరు అధికారులు నిజాయితీగా ఉంటున్నా వసూళ్ల పర్వం మాత్రం ఆగడంలేదు. కొందరు మద్యం వ్యాపారులను చారిటబుల్‌ట్రస్టుకు సహాయం చేయాలి, కాబట్టి షాపు నుంచి సొమ్ములు కావాలంటూ అదనపు డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో మద్యం వ్యాపారులు అధికారులు చెప్పినట్టు వినడం, అడిగినంత ఇచ్చుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మద్యం లైసెన్సుల మంజూరులో జరుగుతున్న అక్రమాలపై కొందరు ఏసీబీకీ ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. 


వసూళ్ల ఆరోపణలు పూర్తి అవాస్తవం : అంజన్‌రావు, ఎక్సైజ్‌ డీసీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం షాపుల లైసెన్సుల మంజూరుకు ముడుపులు అడుగుతున్నారని, ఇప్పటికే కొందరు సొమ్ములు తీసుకున్నారని వస్తున్న ఆరోపణలు అవాస్తవాలు.. ఎక్కడా సొమ్ములు వసూలు చేయడంలేదు. ఇంతవరకు అలాంటి ఫిర్యాదులు రాలేదు. మద్యం వ్యాపారులు ఎవరుకూడా లైసెన్స్‌ల విషయంలో సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకు గ్యారంటీలు సమర్పించి లైసెన్సులు పొందవచ్చు. ఎవరైనా సొమ్ములడిగితే తనకు ఫిర్యాదుచేయాలి. ఎక్సైజ్‌ సిబ్బంది సొమ్ములు అడిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-01-12T04:58:43+05:30 IST