ఆవులు..గేదెలకు లంపీ స్కిన్‌

ABN , First Publish Date - 2022-09-25T06:49:25+05:30 IST

కాప్రిపాక్స్‌ వైరస్‌ ద్వారా లంపీ స్కిన్‌ ముద్దచర్మవ్యాధి ఆవులు, గేదెల్లో వ్యాప్తి చెందుతుందని, జిల్లాలో పశువులు పెంచే రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌టీజీ సత్య గోవింద్‌ తెలిపారు.

ఆవులు..గేదెలకు లంపీ స్కిన్‌
లంపీ స్కిన్‌ వ్యాధి సోకిన గేదె

వేరే జిల్లాల పశువులు రాకుండా చెక్‌పోస్టులు
పశు సంవర్థక కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌
పశు సంవర్థకశాఖాధికారి  సత్య గోవింద్‌



రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 24 : కాప్రిపాక్స్‌ వైరస్‌ ద్వారా లంపీ స్కిన్‌ ముద్దచర్మవ్యాధి ఆవులు, గేదెల్లో వ్యాప్తి చెందుతుందని, జిల్లాలో పశువులు పెంచే రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌టీజీ సత్య గోవింద్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాక్సీ విరడే కుటుంబానికి చెందిన మశూచి కలుగజేసే ఈ వైరస్‌ దోమలు, తుండి ఈగలు ద్వారా ఒక పశువు నుంచి మరొక పశువుకు చేరుతుందన్నారు. ఈ వ్యాధి కలిగిన పశువు నుంచి రక్తం పీల్చే దోమలు, ఈగలు ఆరోగ్యవంతమైన పశువును కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వైరస్‌ బారిన పడిన పశువులకు లింప్స్‌ గ్రంధులు వాచి గుండ్రటి బుడిపెల మాదిరిగా 2 నుంచి 5 సెంటీమీటర్ల పరిమాణం కలిగి ఉంటాయన్నారు. వ్యాధి సోకిన పశువుకు 41 నుంచి 44 సెంటీగ్రేడ్ల వరకూ జ్వరం, ముక్కు, కళ్ల నుంచి నీరు, నీరసించి ఆహారం తినలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని, పాల దిగుబడి కూడా తగ్గిపోతుందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 4 నుంచి 28 రోజులు కూడా పట్టవచ్చన్నారు. వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేసి దూరంగా ఉంచాలని సూచించారు.ఈ వ్యాధి సోకకుండా గోట్‌పాక్స్‌ టీకాలను రాష్ట్ర పశుసంవర్థకశాఖ ఉచితంగా అందిస్తున్నదని పేర్కొన్నారు. నూతనంగా పశువులు జిల్లాలోకి రాకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టు ఏర్పాటు చేశామ న్నారు.జిల్లా పశుసంవర్థకశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూం 0883-2948 688 నెంబరుతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వ్యాధి మనుషులకు సోకదని, అయితే వ్యాధి సోకిన పశువుల పాలు పితికే వారికి చేతుల్లో పుండ్లు ఏర్పడే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-25T06:49:25+05:30 IST