ఆసిఫాబాద్‌ జిల్లాలో కుంటుపడుతున్న విద్యాబోధన

ABN , First Publish Date - 2022-06-25T04:04:00+05:30 IST

జిల్లాలో విద్యాశాఖలో ఇన్‌చార్జీల పాలనతో బోధన కుంటుపడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల వైఫ ల్యంతో విద్యాశాఖలో పాలన గాడి తప్పింది.

ఆసిఫాబాద్‌ జిల్లాలో కుంటుపడుతున్న విద్యాబోధన

- పదేళ్లుగా మండల విద్యాధికారులంతా ఇన్‌చార్జిలే

- ఒక్కొక్కరికి నాలుగేసి మండలాల బాధ్యతలు

- ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక్కడే రెగ్యులర్‌ ఎంఈవో

- ప్రభుత్వం సర్వీస్‌ రూల్స్‌  తేల్చకపోవడమే కారణం 

ఆసిఫాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యాశాఖలో ఇన్‌చార్జీల పాలనతో బోధన కుంటుపడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల వైఫ ల్యంతో విద్యాశాఖలో పాలన గాడి తప్పింది. అది విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. 20 ఏళ్లుగా పెండింగ్‌లో నానుతున్న (గవర్నమెంట్‌-లోకల్‌బాడీ) ప్రభుత్వ, స్థానికసంస్థల పాఠశాలల కంబైన్డ్‌ సర్వీస్‌ రూల్స్‌ ఇప్పటికీ తేల్చలేదు. దీంతో అటు రాష్ట్రంలో, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇన్‌చార్జీలతోనే పాఠశాలల పాలన నెట్టుకొస్తున్నారు. సర్వీస్‌ రూల్స్‌ పంచా యతీ కారణంగా నాలుగు జిల్లాల్లోని 70మండలాలకుగాను 69మండలాలకు ఇన్‌చార్జీలే మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తు న్నారు.  ఆసిఫాబాద్‌ జిల్లాలో 15మండలాలకుగానూ 14, నిర్మల్‌ జిల్లాలో మొత్తం 19మండలాలు ఉంటే 19మండలాలు, ఆదిలాబాద్‌ జిల్లాలోని 18, మంచిర్యాల జిల్లాలో మొత్తం 18మండలాలకు ఇన్‌చార్జీలే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు జిల్లాలకు కలిపి ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలంలో మాత్రమే ఒకే ఒక్క రెగ్యులర్‌ ఎంఈవో విధులు నిర్వహిస్తు న్నాడు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు మండలానికో విద్యాధికారి ఉండేలా సీనియర్‌ ఫ్రధానోపాధ్యాయులను గుర్తించి అనధికారి కంగా అదనపు బాధ్యతలను అప్పగించి బోధన కుంటుపడకుండా చర్యలు చేపట్టారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అలాంటి సర్దుబాటు ఇక్కడ లేకపోవడం వల్ల పర్యవేక్షణ కొరవడి పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని అంటున్నారు. ఒక్కో ఎంఈవోకు నాలుగేసి మండలాల అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల పర్యవేక్షణ తలకుమించిన భారంగా మారిందంటున్నారు. ఓవైపు ఉత్తమఫలితాలు సాధించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా అందుకు తగ్గ వనరులను సమకూర్చడంలో విఫలమవుతు న్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ..

మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంఈవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం, స్కూల్‌ కాంప్లెక్స్‌, పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయులపై అజమాయిషి, పుస్తకాల పంపిణీ, ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై పర్యవేక్షణలాంటి కీలకబాధ్యతలు వీరిపైనే ఉంటాయి. ఇంతటి కీలకమైన పోస్టులు దీర్ఘకాలికంగా ఇన్‌చార్జీల పాలనలోనే నడుస్తున్నాయి. ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం గెజిటెడ్‌ హెచ్‌ఎంలకే ఇన్‌చార్జీల బాధ్యతలను అప్పగించింది. వీరంతా తమ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణతశాతం పెంచేందుకు కృషి చేయాల్సి ఉండడంతోపాటు పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంది. ఎంఈవోలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు హైస్కూళ్లు, కేజీబీవీ, మోడల్‌స్కూళ్ల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పాఠశాల బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇన్‌చార్జి ఎంఈ వోలుగా ఏకకాలంలో రెండు బాధ్యతలను నిర్వర్తిస్తూ పాఠశాలలను పర్యవే క్షించడం కత్తిమీద సాములా తయారైంది. ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఉండే పాఠశాలలకు పర్యవేక్షణ ఉన్నప్పుడే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా డుమ్మాకొడతారన్న అపవాదు ఉంది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. తాజాగా పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా కెరమెరి, జైనూర్‌ వంటి మండలాల్లో ఉర్దూ మీడియం పాఠశాలలు తెరుచుకోకపోవడమే దీనికి ఉదాహరణ.

అదనపు బాధ్యతలతో సమస్యలు..

- శ్రీనివాస్‌రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జి ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇన్‌చార్జి ఎంఈవోతోపాటు పాఠశాలలోనూ హెచ్‌ఎంగా బాధ్యతలు నిర్వ హించడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఒక్కో ఎంఈవో రెండు, మూడు మండలాలకు ఇన్‌చార్జిగా ఉండడంతో పనిభారం పెరుగుతోంది. పర్యవేక్షణ కొరవడి, విద్యాప్రమాణాలు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వం రెగ్యులర్‌ ఎంఈవోలను నియమిస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

Updated Date - 2022-06-25T04:04:00+05:30 IST