న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నిజస్వరూపం ఏమిటో బయటపడిందని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీఎస్పీ సుప్రీం మాయావతి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. కుల ఆధారిత జనగణన 2021లో సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేయడంపై మాయావతి, లాలూ శుక్రవారంనాడు స్పందించారు. బీజేపీ ఎన్నికల ప్రయోజనాలు, వంచన (డూప్లిసిటీ) బయటపడిందని మాయవతి అన్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడం ద్వారా కులఆధారిత జనగణనకు కేంద్ర నిర్ణయించడం చాలా తీవ్రమైన విషయమని, బీజేపీ ఓబీసీ రాజకీయాలకు నిదర్శనమని, ఆ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటని మాయావతి తప్పుపట్టారు. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే ఓబీసీలకు సంబంధించి జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆమె అన్నారు. ఇందుకు నిరాకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యావత్ సమాజాన్ని, వారి భవిష్యత్తుకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. ఉద్యోగాల్లో బ్యాగ్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా చిన్నబుచ్చిన తరహాలోనే తాజా నిర్ణయం ఉందని విమర్శించారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఓ ట్వీట్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల వారిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోసం చేస్తున్నాయని అన్నారు. దేశంలోని 60 శాతానికి పైగా ఉన్న జనాభాకు సంబంధించి జనగణన దరఖాస్తులో ఒక కాలమ్ చేర్చనట్లయితే ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు.