Abn logo
Dec 4 2020 @ 00:15AM

లలితా సహస్రనామం పుట్టిన చోటు!

ప్రతి క్షేత్రానికీ తనదైన ప్రత్యేకత ఉంటుంది. అయితే తమిళనాడులోని తిరుమీయచూరు అనేక విశేషాల సమాహారం. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు, సూర్యుడి రథ సారథి అనూరుడు, రామాయణ గాథలోని వాలి సుగ్రీవులతో పాటు శనీశ్వరుడు, యముడు కూడా ఇక్కడే జన్మించారనీ, దివ్యమైన లలితా సహస్రనామం ఆవిర్భవించిన ప్రదేశం ఇదేనని స్థలపురాణం చెబుతోంది. దాని ప్రకారం... పూర్వం దేవతలనూ, మునులనూ పండాసురుడనే రాక్షసుడు హింసిస్తూ ఉండేవాడు.


అతని బాధ తప్పించాలని అమ్మవారిని వారు శరణు కోరారు. అప్పుడు శ్రీచక్ర రథంపై రౌద్రమూర్తిగా దిగివచ్చిన ఆదిపరాశక్తి ఆ రాక్షసుణ్ణి సంహరించింది. తన రౌద్రం శాంతించడానికి ఆమె తిరుమీయచూరు ప్రాంతంలో తపస్సు చేసింది. వాగ్దేవతలను సృష్టించి, తనను స్తోత్రం చేయమని ఆదేశించింది. ఆ వాగ్దేవతలు పలికిన అమ్మవారి నామాలే శ్రీ లలితా సహస్రనామంగా రూపుదిద్దుకున్నాయి. శ్రీ లలితాంబికగా ఇక్కడ అమ్మవారు కొలువయింది. ఈ ఆలయంలో శివుడు మేఘనాథస్వామిగా దర్శనమిస్తాడు. 

అలిగిన అమ్మను బతిమాలే స్వామి!

అమ్మవారు అలిగి, ముఖం పక్కకు తిప్పుకొంటే, స్వామివారు బుజ్జగిస్తున్నట్టు ఒక విగ్రహం ఈ ఆలయంలో కనిపిస్తుంది. మరెక్కడా కనిపించని ఇలాంటి విగ్రహం వెనుక ఆసక్తికరమైన కథలున్నాయి. కశ్యప ముని, ఆయన భార్యలు వినత, కద్రువ సంతానం కోసం శివుడిని వేడుకున్నారు. వినత, కద్రువులకు చెరో గుడ్డునూ శివుడు ఇచ్చి, ఏడాదిపాటు వాటిని జాగ్రత్తగా కాపాడాలని ఆదేశించాడు. వినత తీసుకున్న గుడ్డు నుంచి ఏడాది తరువాత గరుత్మంతుడు పుట్టాడు. కద్రువకు ఇచ్చిన గుడ్డు ఏ మార్పూ లేకపోవడంతో ఆమె ఆ గుడ్డును పగలగొడుతుంది. అందులో పూర్తిగా ఎదగని బిడ్డ కనిపిస్తాడు. ఆవేదన చెందిన కద్రువ మళ్ళీ ప్రార్థించగా, శివుడు ప్రత్యక్షమై, ఆ బిడ్డ సూర్యుడికి రథసారథి అవుతాడని ఆశీర్వదించాడు.


అతడే అనూరుడు లేదా అరుణుడు. కైలాసం వెళ్ళి, శివ దర్శనం కోసం అనూరుడు తపస్సు చేస్తాడు. ‘ఊరువులు లేని నువ్వు కైలాసానికి ఎలా వెళ్తావ’ని సూర్యుడు హేళన చేస్తాడు. అనూరుడి తపస్సు ఫలించి, శివుడు దర్శనమివ్వడమే కాకుండా... అతణ్ణి ఎగతాళి చేసిన సూర్యుణ్ణి శపిస్తాడు. దీంతో సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడు. శాప పరిహారం కోసం సూర్యుడు ప్రార్థిస్తే, ఏడు నెలల పాటు తననూ, పార్వతినీ ఏనుగుపై ఆకాశంలో ఊరేగించాలని శివుడు ఆదేశిస్తాడు.. ఏడో నెల పూర్తవడానికి కొన్ని నెలల రోజుల ముందు, ‘నా శాప విముక్తి సంగతి ఏమయింద’ని శివుణ్ణి సూర్యుడు అడిగాడు. దీనికి ఆగ్రహించిన పార్వతి గడుపు పూర్తవకుండా శాప విమోచనం కోరడమేమిటంటూ సూర్యుణ్ణి శపించడానికి లేస్తుంది. ఆమె శాపానికి సూర్యుడు గురైతే లోకమంతా పూర్తిగా అంధకారంలో నిండిపోతుందని గ్రహించిన శివుడు ఆమెను బుజ్జగించి, సూర్యుడికి శాపవిమోచన ప్రసాదిస్తాడు. సూర్యుడికి తన తేజస్సు తిరిగి వస్తుంది.


ఆ కథను ప్రతిబింబించేదే ఈ విగ్రహమని స్థలపురాణం చెబుతోంది. గంగాదేవికి శివుడు తలపై... తనకన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చాడని పార్వతి అలిగిందనీ, శివుడు ఆమెను బతిమాలాడనీ... ఆ సందర్భాన్ని ఈ విగ్రహం గుర్తు చేస్తుందనీ మరో కథ. ఇలాంటి విశిష్టతలున్న ఈ ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఈ గుడి తమిళనాడులోని ముఖ్యపట్టణమైన కుంభకోణానికి సుమారు 35 కిలోమీటర్ల  దూరంలో ఉంది. అయిదు అంతస్థుల రాజగోపురంతో సమున్నతంగా కనిపించే ఈ క్షేత్రంలో అనేక ఉప ఆలయాలున్నాయి.

Advertisement
Advertisement
Advertisement