Jul 23 2021 @ 18:22PM

ఇక ప్ర‌తి శుక్ర‌వారం కొత్త అప్‌డేట్.. హీరో ‘ల‌క్ష్య‌’మిదే!

టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. నాగశౌర్యకు 20వ చిత్రమిది. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారాయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఇకపై ప్రతి శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేయనుంది. ఈ కొత్త త‌ర‌హా ప్ర‌మోష‌న్స్ త‌ప్ప‌కుండా సినిమాపై అంచనాలు పెంచుతాయని చిత్రయూనిట్ భావిస్తోంది.