Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 08 Dec 2021 22:07:00 IST

ఏపీలో సినిమా టికెట్ల రేట్లు ఇబ్బందిగా ఉన్నాయి: ‘లక్ష్య’ నిర్మాతలు

twitter-iconwatsapp-iconfb-icon
ఏపీలో సినిమా టికెట్ల రేట్లు ఇబ్బందిగా ఉన్నాయి: లక్ష్య నిర్మాతలు

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్‌మోహ‌న్ రావు మీడియాతో ముచ్చటించారు.


వారు మాట్లాడుతూ.. ‘‘లవ్ స్టోరి సినిమా మాకు మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్‌గానూ పెద్ద సక్సెస్ అయింది. శేఖర్ కమ్ములగారు మాకు ఒక‌ మంచి సినిమాను ఇచ్చారు. ఆ సమయంలో మాకు వచ్చిన మొత్తం చాలా ఎక్కువే. వారం వారం సినిమాలు మారుతుంటాయి. ఈ వారం లక్ష్య సినిమా రాబోతోంది. ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొదట ఈ కథ విన్నప్పుడు కొద్దిగా భయపడ్డాము. కానీ పూర్తిగా కథ విన్నాక చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్నవెంటనే నాగశౌర్యకు పంపించాం. అతను విన్న వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత నార్త్ స్టార్‌ ఎంటర్టైన్మెంట్స్‌ శరత్ మరార్‌తో కలిసి నిర్మించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్‌లో 100 థియేటర్లలో లక్ష్య సినిమాను విడుదల చేయబోతోన్నాం.

అసలు థియేటర్లకు జనాలు వస్తారా? లేరా? అని అనుకున్నాం. కానీ ‘అఖండ’తో ఇప్పుడు ఆ భయాలన్నీ పోయాయి. రెండేళ్ల క్రితమే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేశాం. ఫిల్మ్ బాగుంటే జనాలు వస్తారు అని తెలిసింది. ఇప్పుడు మేం థియేటర్ రెవిన్యూ మీద ఆధారపడ్డాం. సినిమాలు చిన్నవి పెద్దవి అని కాదు. పెద్ద సినిమా అయినా బాగా లేకపోతే ఎవ్వరూ చూడటం లేదు. అదే ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా బాగుంది. యాభై కోట్లు కలెక్ట్ చేసింది.


ఆన్‌లైన్ టికెటింగ్ అనేది మంచిదే. దానిపై ఎవ్వరికీ ఎలాంటి ఏ అభ్యంతరం లేదు. కాకపోతే టికెట్ రేట్లే ఇబ్బందిగా ఉంది. తెలంగాణలో రేట్లు బాగున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి బాగా లేదు. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. దేశం అంతా ఒక వైపు పోతోంటే మనం ఇంకో వైపు పోలేం కదా. కచ్చితంగా రేట్లు పెంచాల్సిందే. మన దగ్గర ఉన్న థియేటర్లు దేశంలో ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో థియేటర్లను నిర్మించాం. ప్రేక్షకులు కూడా అలాంటి థియేటర్లోనే సినిమాలను చూడాలని అనుకుంటారు. మరీ ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా రేట్లు ఉంటేనే పరిశ్రమకు మంచిదని మా అభిప్రాయం. మరీ ఎక్కువగా ఉంటే కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. టికెట్ రేట్లను మరీ ఇంత తక్కువగా తగ్గించడంతో నిర్మాతలకు కష్టంగా మారింది.


లక్ష్య సినిమా క్రీడా నేపథ్యంలో రావడమే ప్లస్ పాయింట్. కేతిక శర్మ చాలా బాగా నటించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ అద్బుతంగా వచ్చాయి. ఆల్రెడీ లక్ష్యం అనే సినిమా వచ్చిందనే ఉద్దేశ్యంతో లక్ష్య అనే టైటిల్‌ను పెట్టాం. ఈ చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల-ధనుష్, శివ కార్తికేయన్‌తో ఒక సినిమా, సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ డైరెక్షన్‌లో ఒక సినిమా, రంజిత్ దర్శకత్వంలో గౌతమ్, విజయ్ సేతుపతి, సందీప్ కిషన్‌ల కాంబినేషన్‌లో మరో సినిమా.. నాగార్జునతో ఓ సినిమాను చేస్తున్నాం. నాగార్జునగారి సినిమాకు ముందుగా కాజల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే హీరోయిన్‌ను చూస్తున్నాం..’’ అని తెలిపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement