యాదాద్రి క్షేత్రంలో శాస్త్రోక్తంగా లక్ష్మీపూజలు

ABN , First Publish Date - 2021-04-17T06:17:14+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో లక్ష్మీపూజలు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవ నేత్రపర్వంగా చేశారు.

యాదాద్రి క్షేత్రంలో శాస్త్రోక్తంగా లక్ష్మీపూజలు
ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన ఆండాళ్‌ అమ్మవారు

పూర్తి కావొచ్చిన గ్యాస్‌ టన్నెల్‌ పనులు

రథశాలకు శంఖు, చక్ర తిరునామాల బిగింపు

యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 16: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో లక్ష్మీపూజలు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవ నేత్రపర్వంగా చేశారు. ప్రధాన ఆలయంలోని స్వయంభువులను కొలిచిన పూజారులు, బాలాలయ కవచమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చించారు. మండపంలో ఉత్సవమూర్తులను అభిషేకించి, స్వామి, అమ్మవార్లను తులసీదళాలు, కుంకుమలతో తీర్చిదిద్దారు. అనంతరం హోమం, నిత్య తిరుకల్యాణ వేడుకలు ఆగమ శాస్త్రరీతిలో చేశారు. సాయంత్రం బాలాలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన ఆండాళ్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ఊంజల్‌సేవలో తీర్చిదిద్ది ఊరేగించారు. వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఊంజల్‌ సేవోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.4,20,798 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 


తుదిదశకు గ్యాస్‌ టన్నెల్‌ పనులు

యాదాద్రిలో స్వామివారి నిత్య నివేదనలు, ప్రసాదాల తయారీ తదితర అవసరాలకోసం కొండకు ఆగ్నేయ భాగంలో గ్యాస్‌ టన్నెల్‌ను నిర్మించాలని అధికారులకు సీఎం సూచించారు. దీంతో వైటీడీఏ సాంకేతిక కమిటీ ఆమోదంమేరకు చేపట్టిన గ్యాస్‌ టన్నెల్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. కొండపైకి ఈ ప్రాంతంనుంచే అన్ని విభాగాలకు గ్యాస్‌ సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదాల తయారీ భవనం, స్వామివారి రామానుజకూటమి, బ్రాహ్మణసత్రం తదితర విభాగాలకు గ్యాస్‌ పైప్‌లైన్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే గ్యాస్‌ నిర్వహణ, తదితర అవసరాలకోసం గ్యాస్‌ టన్నెల్‌ వద్ద మెయింటనెన్స్‌ షెడ్డు నిర్మించారు. దాదాపు ఈ పనులన్నీ తుదిదశకు చేరకున్నాయని వైటీడీఏ అధికారులు తెలిపారు. 


మంద కృష్ణమాదిగ పూజలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ దర్శించారు. బాలాలయంలో కవచమూర్తుల చెంత ఆయన సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొనగా, అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. ప్రధానాలయం పరిసర ప్రాంతాల్లో పర్యటించి పనుల తీరును తెలుసుకున్నారు. 


రథశాలకు శంఖు, చక్ర, తిరునామాలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి రథశాలకు పూర్తిగా ఆధ్యాత్మిక సొబగులు అద్దుతున్నారు. కలకత్తాకు చెందిన నిష్ణాతులైన కార్మికులు ఆధ్యాత్మిక ఆకృతులను ఫైబర్‌తో రూపొందించి, బిగిస్తున్నారు. రథశాలకు నాలుగు వైపులా ఐరన్‌ నిర్మాణాలు ఏ మాత్రం కనిపించకుండా స్వామి, అమ్మవార్ల విగ్రహాలు, శంకు, చక్ర, తిరునామాలతోపాటు ఆంజనేయస్వామి, గరత్మంతుడి విగ్రహ రూపాలను ఫైబర్‌తో అమర్చనున్నారు. రథశాల ముందు స్వాగత తోరణాన్ని తలపించే విధంగా, మిగిలిన మూడు వైపులా పాంచారాత్రాగమ శాస్త్రాన్ని తెలియజేసే పలు రూపాలతో తీర్చిదిద్దనున్నారు. కాగా ఈ ఫైబర్‌ నిర్మాణాలు ఫైర్‌, వాటర్‌ ప్రూఫ్‌ మెటీరియల్‌తో రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 30 అడుగుల ఎత్తులోని రథశాలకు నాలుగు వైపులా ఆధ్యాత్మిక హంగులను అమర్చనున్నారు. అదేవిధంగా రథశాలకు పక్కన ఉన్న లిఫ్టును కూడా ఆలయ రూపురేఖలు కనిపించే విధంగా నిర్మిస్తున్నారు.  

Updated Date - 2021-04-17T06:17:14+05:30 IST