యాదాద్రిలో వైభవంగా లక్ష్మీపూజలు

ABN , First Publish Date - 2022-01-22T05:37:26+05:30 IST

గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం లక్ష్మీపూజలు వైభవంగా కొన సాగాయి.

యాదాద్రిలో వైభవంగా లక్ష్మీపూజలు
ప్రత్యేక అలంకరణలో ఆండాల్‌ అమ్మవారు

స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాల్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదాద్రి టౌన్‌, జనవరి 21: గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం లక్ష్మీపూజలు వైభవంగా కొన సాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను 108బంగారు పుష్పాలతో అర్చించారు. మండపంలో ఉత్సవమూర్తులను వేదమంత్రాలతో అభిషేకించి తులసీ దళాలు, కుంకుమ అర్చనలు చేశారు.సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, కొండకింద పాత గోశాలలోని వ్రతమండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయం లో రామలింగేశ్వరుడికి, దర్శన క్యూకాంప్లెక్స్‌లోని చరమూర్తులను శైవాగమ పద్ధతిలో కొలిచారు. బాలాలయంలో సా యంత్రం ఆండాల్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవాలు కొనసాగాయి.


‘మంత్రగీతానుక్రమణిక’ ఆవిష్కరణ

యాదాద్రి ఆలయం ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు రచించిన ‘యాదాద్రి లక్ష్మీనరసింహ మంత్రగీతానుక్రమణిక, శ్రీవిష్ణు విజయ విలాసోత్సవం’ పుస్తకాలను దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రధానాలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం ఎన్నారై, సుంకిశాల వేంకటేశ్వరస్వామి దేవస్థాన ఫౌండర్‌ ట్రస్టీ పైళ్ల మల్లారెడ్డి కిలో బంగారం విరాళానికి సంబంధించిన రూ.50లక్షల చెక్కును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దేవస్థాన ఈవో గీతారెడ్డికి అందజేశారు. 

Updated Date - 2022-01-22T05:37:26+05:30 IST