లక్ష్మణరేఖ లేని ‘లక్ష్మణుడు’

ABN , First Publish Date - 2020-06-17T06:16:59+05:30 IST

వాజపేయికి మర్యాద ఇస్తూనే ఆడ్వాణీ తన అస్తిత్వాన్ని, తన ఆధిక్యతను నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు. నరేంద్ర మోదీ విషయంలో అమిత్ షా అలాంటిదెప్పుడూ చేయలేదు...

లక్ష్మణరేఖ లేని ‘లక్ష్మణుడు’

వాజపేయికి మర్యాద ఇస్తూనే ఆడ్వాణీ తన అస్తిత్వాన్ని, తన ఆధిక్యతను నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు. నరేంద్ర మోదీ విషయంలో అమిత్ షా అలాంటిదెప్పుడూ చేయలేదు. 1980లనుంచీ కలిసికట్టుగా పనిచేస్తున్న మోదీ-– షా అభిప్రాయాల్లోనూ, వారు అమలు చేయాలనుకున్న ఎజెండాలోనూ తేడా ఏమీ లేదు. వారిద్దరూ కలిసే తమకు పార్టీలో మరెవరూ పోటీ పడకుండా చేశారు. ఇద్దరూ కలిసి దేశంలో కొత్త పాలనా సంస్కృతిని సృష్టించారు. ఈ సంస్కృతే బిజెపి భవిష్యత్తునూ, దేశ భవిష్యత్తునూ నిర్ణయిస్తుంది.


దేశరాజధాని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. కరోనాతో నగరం అట్టుడికి పోతున్నప్పటికీ, రోజురోజుకూ మర ణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఢిల్లీలో ఇప్పుడు ఎటువంటి నిరసన ప్రదర్శనలూ లేవు. డిసెంబర్ 16 నుండి దాదాపు వందలాది మహిళలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి చరిత్రపుటల్లో కెక్కిన షాహిన్ బాగ్ ప్రాంతం ఇప్పుడు ప్రశాం తంగా ఉన్నది. గడ్డ కట్టించే చలిలో కూడా నిరసన ధ్వనులు వినిపించిన షాహిన్ బాగ్ మహిళలు కరోనా తాకిడికి తలవంచాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మూలంగా నెలకొన్న పరిస్థితులను ఆసరాగా తీసుకుని మార్చి 24 ఉదయం ఢిల్లీ పోలీసులు షాహిన్ బాగ్‌పై దాడి చేసి నిరసన కారులను చెదరగొట్టి, టెంట్‌లను పీకేసి, ఆ ప్రాంతంలో రాసిన ప్రభుత్వవ్యతిరేక రాతల్ని తుడిపేసిన తర్వాత అక్కడ నిరసన ధ్వనులు సద్దుమణిగిపోయాయి. నిజానికి దేశమంతటా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ విధిస్తే షాహిన్ బాగ్‌లో అంతకు మూడునెలల ముందే లాక్‌డౌన్ వాతావరణం అలముకొన్నది.


మళ్లీ మే 22న లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత షాహిన్ బాగ్‌లో దుకాణాలను తెరిచారు. మళ్లీ నిరసన కారులు ఈసారి రోడ్డుమీదకు రాకుండా పోలీసులు అక్కడ నిత్యం అప్రమత్తంగా ఉంటు న్నారు. గత ఏడాది చివర్లో అట్టుడికిపోయిన జామియా మిలియా, జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీలు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో 700 ఎఫ్ఆర్‌లు దాఖలయ్యాయి. అల్లర్లను ప్రేరేపించారన్న ఆరోపణతో ఢిల్లీ అంతటా 2687 మందితోపాటు కొందరు విద్యార్థులను అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలు జరిగే అవకాశాలు లేవని, ఢిల్లీ వ్యాపారి ఒకరు అన్నారు. కరోనా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. వ్యాపారులనుంచీ వలస కార్మికుల వరకు జీవన సంఘర్షణ చేయక తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజల జీవితాలు ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉన్నాయి. నిరసన తెలుపదలుచుకుంటే ఫేస్ బుక్‌లోనో, వాట్సాప్‌లోనో తెలియజేయడం తప్ప వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితులు ఎక్కడున్నాయి? ఏమైతేనేం, కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లు కరోనా మూలంగా ఢిల్లీలో ప్రశాంత వాతావరణం ఏర్పడితే కరోనాను ఈ సంద ర్భంగా సద్వినియోగపరుచుకునేందుకు కేంద్రానికి అవకాశం కలిగింది. అందుకు ఘనత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దక్కక తప్పదు. లాక్‌డౌన్ విధించిన రెండు నెలలూ ఆయన ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఉపయోగించుకున్నారు. సిఏఏ పై నిరసన ధ్వనుల నేపథ్యంలో కొంతకాలం మిన్నకుండినట్లు కనపడిన అమిత్ షా ఇప్పుడు ఢిల్లీలో మళ్లీ అంతటా తానై కనపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం అల్లర్లు జరిగి, 45 మంది మరణించినప్పటికీ ఢిల్లీలో ఆయన పర్యటించలేదు కాని ఇప్పుడు ఆసుపత్రులకు అకస్మాత్తుగా వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం కావాలో ఆయనకు బాగా తెలుసు.


గత రెండునెలలూ అమిత్ షా స్తబ్ధంగా ఉన్నారని లేదా అస్వస్థతగా ఉన్నారని చాలా మంది భావించారు. కాని అమిత్ షా వైఖరి తెలిసిన వారెవరూ ఆయన స్తబ్ధంగా ఉన్నారని అనుకోరు. అర్ధరాత్రి వరకూ పనిచేసే ఆయన ఎప్పుడు నిద్రపోతారో తెలియదని, నిరంతరం ఏదో ఒక పని, ఏదో ఒక వ్యూహరచన చేస్తూనే ఉంటారని ఆయన అనుయాయులు అంటారు. న్యాయాస్థానాల్లో కీలక కేసులు, జాతీయ దర్యాప్తు సంస్థ, సిబిఐ, ఐబి, భద్రతా ఏజన్సీల కార్యకలాపాలనుంచీ జాతీయస్థాయిలో, రాష్ట్రాల్లోనూ జరిగే రాజకీయాలనుంచీ ఆయనకు తెలియని పరిణామం అంటూ ఉండదు. లాక్‌డౌన్ సమయంలోనే కశ్మీర్‌కు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు జరిగాయి. ఇక భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయన దిగిపోయి ఆరునెలలు అయినప్పటికీ పార్టీలో కీలక నిర్ణయాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయని చెప్పక తప్పదు. మరి ఆయన క్రియాశీలకంగా లేరని ఎవరంటారు? అమిత్ షా కార్యకలాపాలకు లాక్‌డౌన్లు ఏ మాత్రం అడ్డురావు.


లాక్‌డౌన్‌ విధించే సమయంలోనే మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం చేతులు మారి కాంగ్రెస్ కమల్ నాథ్ నుంచి బిజెపి కమల నాథుల అధీనంలోకి వచ్చింది. గుజరాత్‌లో మార్చి నెల నుంచీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తూనే ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీనితో మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి పలాయనం చిత్తగించినట్లయింది. సాఫీగా ఇద్దరు ఎంపిలు గెలిచే పరిస్థితి నుంచి కాంగ్రెస్ ఒక్క ఎంపినే కష్టమ్మీద గెలిపించుకునే పరిస్థితి ఏర్పడింది. భయాందోళనతో కాంగ్రెస్ మిగిలిన 65 ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించాల్సి వచ్చింది. రాజస్థాన్‌లో కూడా పరిస్థితి కాంగ్రెస్ కుసవ్యంగా ఉన్నదా అంటే ఇది కూడా లేదు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలు ఎక్కడ బిజెపి శిబిరానికి ఫిరాయిస్తారా అన్న భయంతో వారిని ఢిల్లీ- జైపూర్ జాతీయ రహదారిలో ఉన్న ఒక రిసార్ట్‌కు మార్చారు. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపికి సంకేతాలు పంపడం ప్రారంభించడంతో వారిని బుజ్జగించడంకోసం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఛీఫ్ సెక్రటరీని మార్చాల్సి వచ్చింది. పాండిచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా కదలికలు మొదలయ్యాయి. ఇవాళ దేశంలో ఏ ప్రభుత్వానికి ఎంత మెజారిటీ ఉన్నా అమిత్ షా తలుచుకుంటే రాత్రికి రాత్రి పరిస్థితులు మారతాయని భయపడే వారున్నారు. అమిత్ షా అంటే మజాకా మరి!

కర్ణాటకలో గత ఏడాది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం ద్వారా అధికారంలోకి వచ్చిన బిజెపి ముఖ్యమంత్రి యడ్యూరప్ప వారిని బిజెపి టికెట్‌పై మళ్లీ గెలిపించిన తర్వాత తనకు ఢిల్లీలో కూడా తిరుగులేదని భావించి దెబ్బతినక తప్పలేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు ఆయన అత్యంత పలుకుబడిగల నేతలను సిఫారసు చేస్తే పార్టీ అధిష్ఠానం బుట్టదాఖలు చేసి ఇద్దరు సాధారణ కార్యకర్తలకు సీట్లు ఇచ్చి యడ్యూరప్ప స్థానం ఏమిటో చూపించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు మరో సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ అమిత్ షా మూలంగానే వచ్చిందని సమాచారం.


భారతీయ జనతా పార్టీలో జగత్ ప్రకాశ్ నడ్డా జాతీయ అధ్యక్షుడైన తర్వాత అమిత్ షా పైకి ఎక్కడా కనపడపోయినప్పటికీ నడ్డా తీసుకునే ప్రతి కీలక నిర్ణయం వెనుక ఆయన హస్తం లేదని చెప్పలేం. అయినప్పటికీ ఆయన పార్టీకి అత్యంత విధేయంగా ఉన్నట్లు పైకి కనపడతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వర్చువల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ర్యాలీల నిర్వహణ బాధ్యతను ఒక పార్టీ కార్యదర్శికి అప్పగించారు. ఈ కార్యదర్శి హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మీరు ఢిల్లీనుంచి పశ్చిమ బెంగాల్, బిహార్ లో నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని చెప్పినప్పుడు మీరు ఎప్పుడు చెబితే అప్పుడు సభలో పాల్గొంటాను. ‘నా కంటే పార్టీ సుప్రీం కదా..’ అన్నప్పుడు ఆయన తబ్బిబ్బయ్యారు.


పశ్చిమ బెంగాల్, బిహార్ ర్యాలీల్లో ప్రసంగించాలని తానే నిర్ణయించిన విషయం తెలిసినప్పటికీ పార్టీ కార్యదర్శికి విలువ ఇచ్చినట్లు నటించడం అమిత్ షా వంటి వ్యూహకర్తకే సాధ్యం. అదే విధంగా జూన్ 2న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరబోతుండగా అకస్మాత్తుగా అమిత్ షా తన అపాయింట్మెంట్ రద్దు చేసుకుని ఆయన వెనక్కు వెళ్లేలా చేశారు. జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే రాష్ట్రంలో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు కేంద్రం ఆశీర్వాదం ఉన్నట్లు చెప్పుకుంటారని రాష్ట్ర బిజెపికి చెందిన కోర్ కమిటీ సభ్యులు నివేదిక పంపించడంతో అమిత్ షా ఆయనను కలవకూడదని ఆఖరు నిమిషంలో నిర్ణయించారని ఆ సభ్యుల్లో ఒకరు చెప్పారు. కాని అమిత్ షాకు కూడా తన స్వంత సమాచార సేకరణ యంత్రాంగం ఉంటుందని వారికి తెలియని విషయం కాదు.


నిజానికి పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో అమిత్ షా ప్రసంగించిన వర్చువల్ ర్యాలీలే మళ్లీ ఆయన తెరముందుకు క్రియాశీలకంగా వచ్చేందుకు కారణమయ్యాయి. ఈ ర్యాలీలను నిర్వహించేందుకు పార్టీ ఉధృతంగా పనిచేసింది. బిహార్ అంతటా 27వేల ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రజలు, కార్యకర్తలు సభల్లో పాల్గొనేలా చేసింది. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో కూడా 17వేల స్క్రీన్లను ఏర్పాటు చేసి అమిత్ షా రాష్ట్రమంతటా కనపడేలా చేసింది. యూ ట్యూబ్, ఫేస్‌బుక్ మాధ్యమాల్లోనూ, టీవీ ఛానెల్స్‌లోనూ అంతటా అమిత్ షాయే కనపడేందుకు పార్టీ యంత్రాంగం తీవ్ర కృషి జరిపింది. ఈ రెండు ర్యాలీలతోనే బిజెపిలో నరేంద్రమోదీ తర్వాత నంబర్ టూ ఎవరో మరో సారి స్పష్టంగా తేలిపోయింది. దేశంలో ఏ ఎన్నిక జరిగినా బిజెపి తరఫున మోదీ తర్వాత ప్రధాన ప్రచార కర్త అమిత్ షాయే అన్న విషయం కూడా ఎప్పుడో ధ్రువపడింది.


గత ఎన్నికల సందర్భంగా అమిత్ షాను ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘వాజపేయి, ఆడ్వాణీ లాగా నరేంద్రమోదీ, మీరు పార్టీ, ప్రభుత్వం పగ్గాలు చేపట్టినట్లేనా’ అని అడిగినప్పుడు ఆయన అదేంలేదని, తాను సాధారణ కార్యకర్తనని చెప్పుకున్నారు. కాని అప్పటికే ఆయన గాంధీ నగర్‌లో ఆడ్వాణీ స్థానంలో లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయించారు. గతంలో అడ్వాణీ గెలుపు వెనుక కృషి చేసిన అమిత్ షాయే తాను పోటీచేసినప్పుడు అంతకంటే భారీ మెజారిటీతో గెలిచారు. ఆడ్వాణీలాగా పార్టీ అధ్యక్ష పదవి నిర్వహించిన అమిత్ షా హోంమంత్రిగా కూడా ఆయన కుర్చీలోనే కూర్చున్నారు. ఆడ్వాణీలాగా ఆయన డిప్యూటీ ప్రధానమంత్రి పదవి చేపట్టలేదు కాని ఇవాళ దేశంలో ఆయన అంతకంటే ఎక్కువగా అధికారాలను అనుభవిస్తున్నారు. ఆడ్వాణీ చేయలేని పనులన్నీ చేయగలుగుతున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ ఆయన వద్దకు రావడం అనేది సాధారణ విషయం కాని అంతకంటే ముఖ్యమైనది, దేశంలో ఉన్న కీలక వ్యవస్థలన్నీ ఆయన నియంత్రణలోకి రావడం.


వాజపేయి–ఆడ్వాణీకీ, మోదీ–-అమిత్ షాకూ మధ్య తేడా చాలా ఉన్నది. వాజపేయి అభిప్రాయాలకూ, ఆడ్వాణీ అభిప్రాయాలకూ మధ్య ఏ మాత్రం పొంతన కుదరదు. అలా కుదిరి ఉంటే ఇవాళ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కుర్చీలోనే కాదు, గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగి ఉండేవారు కాదు. వాజపేయికి మర్యాద ఇస్తూనే ఆడ్వాణీ తన అస్తిత్వాన్ని, తన ఆధిక్యతను నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు. కాని అమిత్ షా మోదీ విషయంలో అలాంటిదెప్పుడూ చేయలేదు. 1980ల నుంచీ కలిసికట్టుగా పనిచేస్తున్న వారిద్దరి అభిప్రాయాల్లోనూ, వారు అమలు చేయాలనుకున్న ఎజెండాలోనూ తేడా ఏమీ లేదు. వారిద్దరూ కలిసే తమకు పార్టీలో మరెవరూ పోటీ పడకుండా చేశారు. లక్ష్మణుడికి లక్ష్మణ రేఖ గీయాల్సిన అవసరం లేదన్న విషయం మోదీకి బాగా తెలుసు. ఇద్దరూ కలిసి దేశంలో కొత్త పాలనా సంస్కృతిని సృష్టించారు. ఈ సంస్కృతే బిజెపి భవిష్యత్తునూ, దేశ భవిష్యత్తునూ నిర్ణయిస్తుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-06-17T06:16:59+05:30 IST