ఓటుకు రూ.లక్ష!

ABN , First Publish Date - 2020-02-25T08:45:45+05:30 IST

సహకార ఎన్నికల్లో భాగంగా పీఏసీఎస్‌ డైరెక్టర్‌ స్థాయిలో మొదలైన ధనప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఓటుకు రూ.లక్ష!

డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నికకు ‘భారీ’ ఖర్చు

ఒక్కో జిల్లాకు రూ.2 నుంచి రూ. 3 కోట్లు

నేడు ఒక్కరోజే నామినేషన్లు, స్ర్కూటినీ, విత్‌డ్రా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): సహకార ఎన్నికల్లో భాగంగా పీఏసీఎస్‌ డైరెక్టర్‌ స్థాయిలో మొదలైన ధనప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. డీసీసీబీ డైరెక్టర్‌ పోస్టులకు జరిగే ఎన్నికల్లో ఓటుకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అవరసరమైతే ఈ మొత్తం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పీఏసీఎ్‌సల చైర్మన్లుగా ఎన్నికైనవారు.. డీసీసీబీ ఎన్నికల్లో ఓటు వేస్తే తమకు కనీసం రూ.5 లక్షల వరకు నజరానా వస్తుందనే అంచనాల్లో ఉన్నారు. అయితే ఒకే రాజకీయ పార్టీకి చెందిన మద్దతుదారులు 90 శాతానికి మించి పీఏసీఎ్‌సల చైర్మన్‌ పదవులను గెలుచుకోవడంతో.. డీసీసీబీ ఎన్నికల్లో వారి ఓట్లకు డిమాండ్‌ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల మద్దతుతోగానీ, ఇండిపెండెంట్‌గా గానీ గెలిచిన సొసైటీ చైర్మన్లలో ఎవరైనా డైరెక్టర్‌ పోస్టులకు నామినేషన్లు వేస్తే మాత్రం పరిస్థితులు మారిపోతాయి. నిర్ణీత సంఖ్యలో డీసీసీబీకి 20, డీసీఎంఎ్‌సకు 10 చొప్పున నామినేషన్లు దాఖలైతేనే డైరెక్టర్‌ ఎన్నికలు ఏకగ్రీవమవుతాయి. అంత కంటే ఒక్క నామినేషన్‌ ఎక్కువ పడినా ఎన్నిక జరుగుతుంది. దీంతో చైర్మన్‌ పదవిని ఆశించే నేతలు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. అందరితోనూ పెట్టుబడి పెట్టించాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఆ తర్వాత అధిష్ఠానం నుంచి సీల్డు కవర్‌లో ఎవరిపేరు వస్తే.. వారిని చైర్మన్‌ను చేసి, మిగిలిన వారికి ఆ నేతతోనే ఖర్చులు ఇప్పించేలా సమన్వయం చేస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎ్‌సలకు డైరెక్టర్లకు అభ్యర్థులను ఎమ్మెల్యేలే ఖరారు చేశారు. కాగా, నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల్నింటినీ మంగళవారం ఒక్కరోజే పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పీఏసీఎస్‌ చైర్మన్లంతా ఎమ్మెల్యేల పర్యవేక్షణలో.. క్యాంపుల్లో ఉన్నారు. 

Updated Date - 2020-02-25T08:45:45+05:30 IST