కేంద్ర మంత్రిని తొలగించాలంటూ ప్రియంక 'మౌనవ్రతం'

ABN , First Publish Date - 2021-10-11T21:39:40+05:30 IST

లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయాలనే డిమాండుతో..

కేంద్ర మంత్రిని తొలగించాలంటూ ప్రియంక 'మౌనవ్రతం'

లక్నో: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు 'మౌన వ్రతం' పాటించింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పార్టీ కార్యకర్తలు లక్నోలో జరిగిన మౌనవ్రతంలో పాల్గొన్నారు. జీపీఓ పార్క్‌ వద్ద జరిగిన ధర్నాలో కూడా ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.


నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతికి దారితీసిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌‌కు కోర్టు ఆదేశించింది. కాగా, కేసు విచారణ స్వేచ్ఛగా, నిష్కాక్షికంగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రిని డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనిపై రాష్ట్ర బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ మౌనవ్రతం చేపట్టే ప్రజాస్వామ్య హక్కు ఉందని, అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహ్ సింగ్ సైతం ఆయన హయాంలో పదేళ్లు మౌనవ్రతంలోనే ఉన్నారని విమర్శించారు. దళితులు, రైతులపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎందుకు నిరసనలు చేయరని కాంగ్రెస్‌ను నిలదీశారు.

Updated Date - 2021-10-11T21:39:40+05:30 IST