న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా శుక్రవారంనాడు పోలీసు విచారణకు హాజరుకాలేదు. ఉదయం 10 గంటలకు ఆశిష్ మిశ్రా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, 10.30 గంటల వరకూ ఆయన రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (హెడ్‌క్వార్టర్స్) ఉపేంద్ర అగర్వాల్ సకాలానికే కార్యాలయానికి చేరుకున్నారు.
కాగా, అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి, అశిష్ మిశ్రాను అరెస్టు చేయకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే గడువు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎస్‌కేఎం ఈరోజు సమావేశం కానుంది. మిశ్రా అరెస్టు కోసం వేచిచూస్తున్నట్టు మోర్చా నేతలు తెలిపారు. మరోవైపు, లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారంనాడు అరెస్టు చేసింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టులకు సంబంధించి స్థాయీ నివేదికను సమర్పించాలని ఉత్తప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.