అమరావతికి ఓ ‘లక్ష’!

ABN , First Publish Date - 2022-03-03T07:06:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ‘అమరావతి’లో సచివాలయ నిర్మాణానికి కేంద్రం బడ్జెట్‌లో అక్షరాలా లక్ష రూపాయలు కేటాయించింది.

అమరావతికి ఓ ‘లక్ష’!

బడ్జెట్‌లో కేంద్రం కేటాయింపులు

సచివాలయంతో పాటు వివిధ నిర్మాణాలకు నామమాత్ర నిధులు

న్యూఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ‘అమరావతి’లో సచివాలయ నిర్మాణానికి కేంద్రం బడ్జెట్‌లో అక్షరాలా లక్ష రూపాయలు కేటాయించింది. రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ కేటాయింపులు చేసింది. గత ఏడాది కూడా ఈ పద్దు కింద రూ.లక్ష కేటాయించడం గమనార్హం. నిజానికి... జగన్‌ సర్కారు అమరావతిని ఎప్పుడో అటకెక్కించింది. మధ్యలో మూడు రాజధానులను తీసుకొచ్చింది. న్యాయ వివాదాల నేపథ్యంలో... మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అధికారికంగా అమరావతేనని కేంద్రం కూడా గుర్తించింది. అలాగే... అమరావతిలో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్‌ పూల్‌ ఆఫీస్‌ అకామిడేషన్‌ (జీపీఏవో - కేంద్ర ఉద్యోగుల నివాసాలు) కోసం భూమి కొనుగోలుకు కూడా కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించింది. దీని కోసం గత ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 4.48 కోట్లను వెచ్చించింది. రూ. 1126.55 కోట్ల వ్యయంతో నిర్మించాల్సిన జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ క్వార్టర్ల (జీపీఆర్‌ఏ)కు  సైతం రూ.లక్ష కేటాయించడం గమనార్హం. దీనికి సంబంధించి భూ కొనుగోలుకు ఇప్పటి వరకు కేంద్రం రూ. 18.03 కోట్లు ఖర్చు చేసింది. అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) సిబ్బంది నివాస భవనాల నిర్మాణానికీ రూ.లక్షనే కేటాయించింది. విజయవాడ, విశాఖపట్నంలో హాలిడే హోమ్‌ నిర్మాణానికి, విశాఖలో 806 జీపీఆర్‌ఏ నివాసాల నిర్మాణానికి, అందుకు భూములు కొనుగోలుకు, విజయవాడలో సీజీవో కాంప్లెక్స్‌ నిర్మాణానికి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున కేంద్రం కేటాయించింది.

Updated Date - 2022-03-03T07:06:20+05:30 IST