కలెక్టర్‌ పేరు చెప్పి ఎకరాకు లక్ష డిమాండ్‌!

ABN , First Publish Date - 2020-09-17T07:43:31+05:30 IST

‘నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ ఇప్పించేందుకు 112 ఎకరాలకు రూ.1.12 కోట్లు డీల్‌! రెండు విడతల్లో రూ.40 లక్షలు తీసుకున్నాడు. మిగతా మొత్తానికి బినామీ పేరిట

కలెక్టర్‌ పేరు చెప్పి ఎకరాకు లక్ష డిమాండ్‌!

ఇంట్లోనే లంచం డబ్బు తీసుకున్న నగేశ్‌

రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ అధికారులు

4 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ ఇప్పించేందుకు 112 ఎకరాలకు రూ.1.12 కోట్లు డీల్‌! రెండు విడతల్లో రూ.40 లక్షలు తీసుకున్నాడు. మిగతా మొత్తానికి బినామీ పేరిట 5 ఎకరాలు సేల్‌ అగ్రిమెంట్‌ చేయించాడు! ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తే డబ్బులిచ్చింది ఎవరో తెలియదని బుకాయించాడు. ఆరా తీస్తే జిల్లా కలెక్టర్‌ తీసుకుని ఉండొచ్చని బదులిచ్చాడు’ ఇవీ.. లంచం కేసులో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ప్రాథమిక విచారణ అనంతరంఏసీబీ అధికారులు వెల్లడించిన అంశా లు. స్థలం కొనుగోలు నుంచి లంచం, అగ్రిమెంట్‌ వరకు ప్రతి విషయాన్ని అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు. 


కథ మొదలైందిలా..

ఫిబ్రవరి 29న లింగమూర్తి మరికొందరు  చిప్పల్‌తుర్తిలో 112.21 ఎకరాలను కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం నర్సాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లగా ఆ స్థలం 22-1 నిషేధిత జాబితాలో ఉన్నందున కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. లింగమూర్తి జూలై 21న నర్సాపూర్‌ తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఆర్డీవో అరుణారెడ్డికి అందజేశారు. జూలై 30న లింగమూర్తి.. నగేశ్‌ను కలవగా కలెక్టర్‌ పేరు చెప్పి ఎకరాకు రూ.లక్ష లంచం అడిగారు. ఇందుకు అంగీకరించి మరుసటి రోజు నగేశ్‌ ఇంట్లోనే రూ.19.50 లక్షలు అందజేశారు. ఆగస్టు 7న రూ.20.50 లక్షలు ఇచ్చారు. రూ.72 లక్షలకు 8 ఖాళీ చెక్కుల్ని నగేశ్‌ తీసుకున్నారు. జూలై 31న జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ఎన్‌వోసీని ఆగస్టు 7న లింగమూర్తికి ఇచ్చిన నగేశ్‌.. సర్వే, ఆన్‌లైన్‌ రికార్డు కరెక్షన్‌ను పెండింగ్‌లో ఉంచారు. నగేశ్‌ ఆదేశాల మేరకు జూనియర్‌ అసిస్టెంట్‌ వసీమ్‌ తరచూ లింగమూర్తికి ఫోన్‌ చేసి డబ్బు కోసం వేధించసాగాడు.


ఆగస్టు 14న నగేశ్‌ను కలిసిన లింగమూర్తి డబ్బులు లేవని చెప్పగా.. 10 ఎకరాల భూమి రిజిస్టర్‌ చేసి ఇవ్వాల్సిందిగా సూచించారు. చివరికి ఐదెకరాలకు ఒప్పందం కుదిరింది. జీవన్‌ గౌడ్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని చెప్పిన నగేశ్‌.. ముందుగా సేల్‌ అగ్రిమెంట్‌ రాసి ఇవ్వాలన్నారు. ఆగస్టు 21న లింగమూర్తి నగేశ్‌కు సేల్‌ అగ్రిమెంట్‌ను అందజేశారు. కాగా, నగేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, బినామీ జీవన్‌ గౌడ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీమ్‌ నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతించింది. జుడీషియల్‌ రిమాండులో ఉన్న ఐదుగురు నిందితుల్ని ఈ నెల 21 నుంచి 24 వరకు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. 

Updated Date - 2020-09-17T07:43:31+05:30 IST