ఆమెపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-03-04T06:16:35+05:30 IST

టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆమెపై అత్యాచారం

  1. నెల తర్వాత ఫిర్యాదు చేసిన బాధితురాలు
  2. ప్రధాన నిందితుడు అధికార పార్టీ నాయకుడి బంధువు
  3. ఇద్దరిని అరెస్టు చేసిన టూ టౌన్‌ పోలీసులు


నంద్యాల (నూనెపల్లె), మార్చి 3: టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘనట జరిగిన నెల తరువాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాద చేశారు. నిందితుల్లో ఒకరు నంద్యాల వైసీపీ నాయకుడి సమీప బంధువు కావడంతో కేసు నమోదు, అరెస్టుల్లో జాప్యం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి.  టూటౌన్‌ పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు, నంద్యాలకు చెందిన ఓ మహిళకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరు వృత్తిరీత్యా బెంగళూరులో ఉండేవారు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఆమె నంద్యాలకు వచ్చి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగించేవారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేవాడు. ఆయన వర్క్‌ ఫ్రం హోమ్‌ కింద విధులు నిర్వహిస్తూ అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామంలో ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న తనపై ఆదిల్‌, రాజేష్‌ అనే వారు ఈ ఏడాది జనవరి 7న అత్యాచారం చేశారని బాధిత మహిళ ఆరోపించారు. ఈ మేరకు ఫిబ్రవరి 7న టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఘటన జరిగిన నెల రోజుల తరువాత ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని, ఆలస్యానికి కారణం ఏమిటని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా తను ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైందని, కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను వేడుకున్నారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా తనను దుర్భాషలాడారని ఆమె కర్నూలులోని దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తరువాత ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని ఎస్పీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో నంద్యాల టూటౌన్‌ పోలీస్‌ స్టేషలు ఫిబ్రవరి 10న ఆదిల్‌, రాజేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


అందుకే జాప్యం..?

అత్యాచారం కేసులో ఏ-1 నిందితుడు ఆదిల్‌ నంద్యాల పట్టణంలోని ఓ వైసీపీ నాయకుడి సమీప బంధువు కావడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేయడంలో తాత్సారం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో టూటౌన్‌ పోలీసులు నిందితులు ఆదిల్‌, రాజేష్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-04T06:16:35+05:30 IST